ఆరోగ్యసిరి... ఉసిరి
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:01 PM
‘సూరిమాను’ అసలు పేరు. జనవ్య వహారంలో ఉసిరిమాను అయ్యింది. సూరి అంటే సూర్యుడు. ఉసిరిలో సూర్యతేజస్సు ఉంది.
‘సూరిమాను’ అసలు పేరు. జనవ్య వహారంలో ఉసిరిమాను అయ్యింది. సూరి అంటే సూర్యుడు. ఉసిరిలో సూర్యతేజస్సు ఉంది. అందుకని ఆదివారం నాడు ఉసిరిని పూజించాలే గాని దంచుకుని, వండుకుని తినొద్దని ఓ గౌరవపూర్వక ఆచారం ఉంది!
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ మూడింటినీ త్రిఫలాలంటారు. ఇవి లేకుండా ఆయుర్వేద ఔషధాలు లేనట్టే, ఉసిరి లేని భోజనం కూడా అసంపూర్ణం. ఉసిరి ఎంతటి ఔషధమో అంతటి కూరగాయ! దాన్ని వండుకోవాలంటే యుక్తి కావాలి. పాకశాస్త్రగ్రంథాలు ఉసిరికాయతో అనేక వంటకాలను వివరించాయి.
క్షేమకుతూహలంలో ఉసిరికాయల కూర: పెద్దవిగా ఉన్న ఉసిరికాయలకు నూనె పట్టించి ‘అంగారపాకం’ అంటే నిప్పుల మీద లోపలి గుజ్జంతా ఉడికేవరకూ కాల్చాలి. ఓవెన్లున్న వాళ్లు గ్రిల్ చేయొచ్చు. పైన మాడు వలిచేసి, గింజ ఏరేసి లోపలి గుజ్జు మాత్రమే తీసు కోండి. మట్టి లేదా గాజు మూకుడులోతాలింపు గింజలు వేగించి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు, తగినంత ఉప్పు, మిరియాలపొడి కలిపి అందులో ఈ ఉసిరిగుజ్జు చేర్చి కాసేపు మగ్గ బెడితే ఉసిరి కాయల కూర సిద్ధం అయినట్టే! లోహపు బాండీల్లో వండవద్దనేది చెప్పదగిన సూచన. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది!
చక్రదత్తలో ఉసిరి హల్వా: చక్రదత్త అనే ఆయుర్వేద గ్రంథంలో ఉసిరి హల్వా తయారీని వివరించింది. తాజా ఉసిరికాయ ముక్కల్ని తీసుకుని కొద్దికొద్దిగా ఉసిరికాయల జ్యూసు పోస్తూ మెత్తగా నలిగేలా దంచి అందులో తగినంత చక్కెర, తేనె, కొద్దిగా నెయ్యి కలపాలి. ఇది ఉసిరికాయల హల్వా. చ్యవనప్రాశ లేహ్యంతో సమానమైన ఔషధం. దీన్ని ఫ్రిజ్‌లో భద్రపరచి రోజూ ఒక చెంచా చొప్పున తీసుకుంటే, 80 యేళ్ళ వయసువాళ్లు కూడా యవ్వనవంతులు అవుతారంటుంది చక్రదత్త. స్కూలుకెళ్ళే పిల్లలకు రోజూ పెడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
తెలుగువారి నల్లపచ్చడి: బాగా కండ ఉన్న ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి ఒక పింగాణీ జాడీలోపల నూనె పట్టించి అందులోకి తీసుకోండి. ఈ ముక్కల పైన 3-4 చెంచాల పసుపు. తగినంత ఇంగువపొడి చల్లి, బాగా కలిపి ముక్కలు మునిగే వరకూ నువ్వులనూనె పోసి కదల్చకుండా ఒక పక్కన ఉంచాలి. 3-4 రోజుల్లో ముక్కలు మెత్తబడి ఉంటాయి. ఆ ముక్కల్ని మెత్తగా దంచి, లేదా మిక్సీపట్టి తగినంత సైంధవలవణం చేర్చి మూతబెట్టి, పైన ఒక తెల్లగుడ్డతో వాసెనగట్టి కనీసం 3 నెలలు కదల్చకుండా భద్రపరచాలి. ఇది వాతావరణ ప్రభావాన నల్లగా మారు తుంది. ఫ్రిజ్‌లోనే ఉంచితే నలుపు రాదు. దీని రుచిని శివుడు కూడా వర్ణించలేడంటాడు, క్షేమకుతూహలం పాకశాస్త్రగ్రంథంలో క్షేమశర్మ. ఒక వారానికి సరిపడా ఇవతలకు తీసుకుని, కొత్తిమీర వగైరా కలిపి తాజాగా తాలింపు పెట్టుకుని రోజూ ఒక చెంచా మోతాదులో మొదటి ముద్దగా తినేవారికి ఏ రోగాలూ రావు. షుగరు వ్యాధి ఉన్నవారు పసుపు కూడా చెరి సగంగా ఈ పచ్చడితో కలిపి తింటే మంచిది.
మామిడికాయతో కలిపి పప్పు: మామిడి లాగానే ఇంచుమించు ఏడాది పొడవునా ఉసిరికాయలు దొరుకుతున్నాయి. కాబట్టి తాజాగా తినటానికి ఒకప్పటికన్నా సౌలభ్యం ఉంది. మామిడి కాయ ముక్కలతో పాటుగా ఉసిరికాయ ముక్కలు కూడా కలిపి పప్పుగానీ, పులుసుగానీ, పచ్చడిగానీ చేసుకుంటే, ఉసిరివలన కలిగే ప్రయోజనాలన్నీ అదనంగా దొరుకుతాయి.
ఉసిరికాయ వాతాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని కరిగిస్తుంది. విషదోషాల్ని పోగొట్టే గుణం దీని కుంది. కంటి చూపుని పెంచుతుంది. జ్ఞాప కశక్తిని పెంచుతుంది. దీని రసంలో మిరియాల పొడి, పసుపు కలిపి రోజూ తాగుతూ ఉంటే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది.. ముసలితనం రాకుండా కాపాడుతుంది. రక్తస్రావాన్ని ఆపుతుంది. స్త్రీ పురుషుల లైంగిక సమర్థతల్ని పెంచుతుంది. బీపీ షుగరు పైన పనిచేస్తుంది. ఉసిరికాయ దొరికితే వదలకండి. ఆరోగ్యసిరి కాయలివి!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!
ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్’: ఏబీవీ
Read Latest Telangana News and National News