Share News

అనేక ప్రశ్నల పోరాటం ఆమెది!

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:22 PM

మనలో చాలామంది పర్యావరణ సమస్యలను వార్తల్లో చూిసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి చేతులు దులుపుకుంటారు.

అనేక ప్రశ్నల పోరాటం ఆమెది!

మనలో చాలామంది పర్యావరణ సమస్యలను వార్తల్లో చూిసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి చేతులు దులుపుకుంటారు. అంతేగానీ... వాటి పరిష్కారం కోసం కోర్టు తలుపు తట్టడానికీ, ప్రభుత్వాలను ప్రశ్నించడానికీ ముందుకు రావడం అరుదు. అయుతే ‘మా భవిష్యత్తు మీద మీ నిర్ణయాలు ఎందుకు?’ అనే ఓ సూటి ప్రశ్న స్కూలు బ్యాగు వేసుకుని బడికి వెళ్లే చిన్నారి రిధిమా పాండే నోటి నుంచి వచ్చింది. అది కూడా ఆమె తొమ్మిదేళ్ల వయసులో!

కొండలూ, అడవులూ, నదులూ... అందమైన ప్రకృతి మధ్య ఉత్తరాఖండ్‌లో రిధిమ బాల్యం గడిచింది. వన్యప్రాణుల అభయారణ్యాలకూ, రెస్క్యూ సెంటర్లకు వెళ్లేది. తల్లిదండ్రులు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు. ప్రకృతి సౌందర్యాన్ని మాత్రమే కాదు... దాని ప్రకోపాన్ని కూడా ఆమె కళ్లారా చూసింది. 2013లో ఉత్తరాఖండ్‌ కేదారనాథ్‌లో వెల్లువెత్తిన ఘోరమైన వరదలు గ్రామాలను ముంచెత్తి... వేలమంది ప్రాణాలను తీశాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల రోదనలు, దుఃఖం ఆమెను కలిచివేశాయి. రిధిమ జీవిత గమనాన్నే మార్చేసిన దుర్ఘటన అది. ఈ విపత్తు సహజమైనదా? మనుషుల తప్పిదాల ఫలితమా? అనే సందేహాలు వెంటాడాయి. దాంతో భూతాపం, వాతావరణ మార్పుల గురించి తెలుసుకుంది.


చైతన్యం పెంచిన చర్య

2017... అప్పుడు రిధిమకు తొమ్మిదేళ్లు. మిగతా పిల్లలు కార్టూన్లు చూస్తూ... ఆటపాటలతో గడిపే వయసులో ఆ చిన్నారి ఓ నిర్ణయం తీసుకుంది. అది ఏకంగా భారత ప్రభుత్వంపై కేసు వేయడం. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేసింది. దాని సారాంశం..

  • పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది.

  • వాతావరణ మార్పుల విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదు.

  • దీనివల్ల పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది.


book6.2.jpgఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. శక్తిమంతమైన వ్యవస్థను తొమ్మిదేళ్ల బాలిక ధైర్యంగా నిలదీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ పిటిషన్‌ డిస్మిస్‌ అయినప్పటికీ ప్రజల్లో ప్లాస్టిక్‌ కాలుష్యం, వాయు నాణ్యతల్లాంటి పర్యావరణ సమస్యలపై చైతన్యం పెంచడంలో సఫలమైంది. రెండేళ్లు గడిచాయి. రిధిమ తన పోరాటాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లింది. గ్రెటా థన్‌బర్గ్‌ లాంటి 15 మంది యువ ఉద్యమకారులతో చేతులు కలిపింది. పెద్ద దేశాలు వాతావరణ పరిరక్షణలో విఫలమవుతున్నాయనీ, పిల్లల హక్కులు ప్రమాదంలో పడుతున్నాయనీ ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేసింది. ప్రభుత్వాలు తమ నిర్ణయాలు రేపటి జీవితాలపై ప్రభావం చూపుతాయని గుర్తించి బాధ్యతగా వ్యవహరించాలనేది ఆమె డిమాండ్‌. ‘‘ప్రకృతి మాత విలువనూ, ప్రాముఖ్యాన్నీ మనం అర్థం చేసుకోవాలి. పర్యావరణ స్పృహతో పరిశుభ్రమైన, తాజా గాలితో శ్వాస తీసుకునేలా మన భూమిని తీర్చిదిద్దుకోవాలి’’ అంటుందామె.


ఉద్యమాల్లో చురుగ్గా...

పర్యావరణ ఉద్యమకారిణిగా వివిధ ఉద్యమాల్లో, నిరసనల్లో ఆమె చురుకైన పాత్ర పోషించింది. 2025లో కర్ణాటకలోని కాలసా-బండూరి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రిధిమ పాల్గొంది. అడవుల నాశనం జీవ వైవిధ్యానికి ప్రమాదమనీ, స్థానిక ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతుందనీ గళమెత్తింది. జాలీ గ్రాంట్‌ ఎయిర్‌పోర్ట్‌ డెహ్రాడూన్‌, కేరళ యాంటీ పెట్రోలియం ప్రాజెక్టు ..లాంటి ఎన్నో పోరాటాలకు చేయూతనిచ్చింది. దాంతో స్ఫూర్తినిచ్చే రిధిమ ఉద్యమ గాథ డాక్యుమెంటరీలకు ఎక్కింది. పర్యావరణ అంశాలపై ఆమె అంతర్జాతీయ వేదికల్లో ప్రసంగించింది. 2020లో బీబీసీ ‘100 అత్యంత ప్రభావశీల మహిళ’ల్లో ఒకరిగా ఆమె ఎంపికైంది. అదే ఏడాది ‘యంగ్‌ నేచురలిస్ట్‌’ అవార్డు, 2021లో మదర్‌థెరిసా మెమోరియల్‌ అవార్డు లభించాయి.


zzzzzz.jpgజన సమీకరణ పెద్ద సమస్య

ఆయా సమస్యలపై పోరాటాలకు ప్రజలను సమీకరించడం అంత సులువు కాదని రిధిమ చెప్తుంది. మీడియా కవరేజి ఉండదనో, పోలీ సులు అరెస్టు చేస్తారనో ఏదో ఒక కారణంతో కొందరు ఉద్యమాలకు వెనకాడుతుంటారనేది ఆమె అనుభవం. మరో పక్క నిరసనలూ, ఉద్యమాల తర్వాత కూడా ప్రభుత్వాల్లో పెద్దగా చలనం ఉండదు. అక్కడక్కడా ఆశాభంగాలు ఎదురైనా తన మార్గంలో కొనసాగుతూ యువతకు ఆమె స్ఫూర్తినిస్తోంది. ప్యారిస్‌ ఒప్పందం కింద భారతదేశ కట్టుబాట్లకు అనుగుణంగా ఉండే వాతావరణ విధానాలను కఠినంగా అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు 2025లో స్పష్టం చేసింది. ఈ చరిత్రాత్మక తీర్పు రిధిమ కొనసాగించిన నిరంతర న్యాయపోరాట ఫలితమే!


రిధిమా పాండేలాంటి ఉద్యమకారిణుల కృషి ఫలితంగా పర్యావరణ పరిరక్షణ... యువత గట్టిగా పట్టించుకునే సమస్యగా మారింది. ఒకప్పుడు పెద్దవాళ్లు మాత్రమే ఇలాంటివి ఆలోచించేవారు. ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. స్కూళ్లలో, కాలేజీల్లో విరివిగా చర్చలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో పోస్టులకే పరిమితం కాకుండా ప్లాంటేషన్‌ డ్రైవ్స్‌, క్లీనప్‌ క్యాంపెయిన్స్‌ లాంటి కార్యాచరణలూ పెరుగుతున్నాయి!


ఈ వార్తలు కూడా చదవండి:

పెరుగుతున్న పసిడి ధరలు.. స్థిరంగా వెండి!

ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్‌’: ఏబీవీ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2026 | 12:22 PM