Share News

వైసీపీ నేతల్లారా.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి: మంత్రి జనార్దన్ రెడ్డి..

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలయాల అభివృద్ధిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పనులు చేడయం వల్లే దేవుడు వారిపై ఆగ్రహించారని.. అందుకే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొపెట్టారని అన్నారు.

వైసీపీ నేతల్లారా.. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి: మంత్రి జనార్దన్ రెడ్డి..
Minister BC Janardhan Reddy

నంద్యాల: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలయాల అభివృద్ధిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పనులు చేడయం వల్లే దేవుడు వారిపై ఆగ్రహించారని.. అందుకే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొపెట్టారని అన్నారు. ఇవాళ(ఆదివారం) బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి.


ఈ సందర్భంగా పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.5.08 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం రూ.3.30 కోట్ల వ్యయంతో 16 గదులు, రెండు డార్మిటరీలు, 8 షాపులు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అలాగే రూ.1.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం, రూ.29 లక్షలతో లడ్డూ పోటు, రూ.24 లక్షలతో దేవస్థానం ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.


మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..'ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. యాగంటి ఉమామహేశ్వర ఆలయ నిధులను గత ప్రభుత్వంలా దుర్వినియోగం చేయకుండా కొత్త కమిటీ సద్వినియోగం చేస్తోంది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు స్వామివారికి రూ.5.57 కోట్ల ఆదాయం వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో 2021 నుంచి 2024 వరకు రూ.7 కోట్ల ఆదాయం వచ్చింది.. కానీ ఆ సొమ్ముకు లెక్కాపత్రం లేదు. నేడు స్వామివారి ఆదాయంతో మేము చేస్తున్న అభివృద్ధి కళ్ల ముందు కనపడుతోంది. గత ప్రభుత్వంలో స్వామివారి ఆదాయం ఎక్కడికి పోయినట్లు?.. ఆలయ ఆదాయ వనరులు ఏం చేసినట్లు?.. భగవంతుడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాటి పాలకమండలపై ఉంది.


ఇప్పటికే సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశాం. నేడు వైసీపీ నేతలు పార్కింగ్ స్థలం ఏర్పాటుపైనా కోర్టులో పిటిషన్ వేయడం దుర్మార్గం. అటవీ భూమి కొల్లగొడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజల కోసం పని చేస్తుంటే విమర్శలు చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా పని చేస్తున్న అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే దేవుడు మీ అంతు చూసి ఇళ్లలో కూర్చోబెట్టాడు. కూటమి ప్రభుత్వంలో ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. మీరు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే సొంత నిధులతో సేవ చేయాలి.


దోచుకోవడం దాచుకోవడం ఇదే వైసీపీ నేతల పని. యాగంటిలో జరుగుతున్న అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు. అభివృద్ధి జరిగితే మీకు నొప్పేంటి?. సొంత నిధులతో అభివృద్ధి చేసి మాతో పోటీ పడండి. కక్ష సాధింపు వైఖరి మానుకోవాలి. ఆలయ అభివృద్ధికి సలహాలు, సూచనలకు మాత్రమే మేము పరిమితమయ్యాం. దేవాలయంలో రాజకీయాలకు వ్యతిరేకం. వ్యక్తిగతంగా ఎప్పుడూ ఆలయంలో ఆధిపత్యం కోసం ప్రయత్నించలేదు. త్వరలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇస్తాం' అని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

మహిళా బిల్లు మద్దతు కోసం పలు కార్యక్రమాలు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బహిరంగ సవాల్!

Updated Date - Apr 12 , 2026 | 12:30 PM