ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ బహిరంగ సవాల్!
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:02 PM
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నెల్లూరు రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి.
నెల్లూరు, ఏప్రిల్ 12: నగర కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నెల్లూరు రాజకీయాల్లో వేడిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మొక్కల పెంపకం కోసం వెచ్చిస్తున్న నిధులపై వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నగరంలో నాటే ఒక్కో మొక్కకు రూ. 12 వేలు ఖర్చు చేస్తున్నారన్న ఎమ్మెల్సీ ఆరోపణలను రూప్ కుమార్ యాదవ్ తోసిపుచ్చారు.
ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘కార్పొరేషన్ పరిధిలో నాటే ఒక్కో మొక్కకు రూ. 12 వేలు ఖర్చుపెట్టినట్లు నిరూపిస్తే, నేను నా పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఒకవేళ నిరూపించలేకపోతే, మీ ఆరోపణలు తప్పని ఒప్పుకొని మంత్రి నారాయణకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. 12 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యతలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కేవలం రూ. 4 వేలు మాత్రమే ఖర్చు అవుతోంది. నగర పచ్చదనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే, అది చూసి ఓర్వలేకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నగరంలో కనీసం రూ. 50 కోట్ల నామినేషన్ పనులు కూడా జరగలేదు. మున్సిపల్ చట్టం ప్రకారమే పన్నుల వసూలు జరుగుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు మంచిది కాదు. అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అవాస్తవ ఆరోపణలు చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెండు రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు..
తిరుచానూరు పద్మావతి ఆలయ వాహన బేరర్లపై వైసీపీ బ్యాచ్ దాడి..