మహిళా బిల్లు మద్దతు కోసం పలు కార్యక్రమాలు: ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:37 AM
చట్లసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతుగా కూటమిలోని పార్టీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
విజయవాడ, ఏప్రిల్12: చట్లసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతుగా కూటమిలోని పార్టీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళలతో ర్యాలీలు, సభలు నిర్వహిస్తామన్నారు. అలాగే వాల్ రైటింగ్, సిగ్నేచర్ క్యాంపులు, మిస్డ్ కాల్స్ ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రజల మద్దతు కూడగడతామని చెప్పారు.
ఏప్రిల్ 16,17,18 తేదీల్లో పార్లమెంట్‌లో జరిగే చర్చల్లో చట్ట సభల్లో మహిళ బిల్లు ఆమోదం పొందుతుందని మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేస్తామని ప్రకటించారు. 2029 నాటికి మహిళా బిల్లు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో బీజేపీదీ కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలని భావించే మహిళలు బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఏ పార్టీ అయినా గెలుపు కోసం పని చేస్తుందని.. నాయకులు తయారు కావాల్సి ఉందన్నారు.
2029 నాటికి జన గణన, డీ లిమిటేషన్, మహిళా బిల్లు అన్నీ పూర్తవుతాయని ఏపీ బీజేపీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. మొదటి నుంచీ మహిళలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సెప్టెంబర్ 23వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళలు రెండు శాతం ఉండే పరిస్థితి నుంచి.. నేడు వంద మందిపైగా ఉన్నారని వివరించారు. దేవెగౌడ ఆధ్వర్యంలో మహిళా బిల్లు పెట్టినా సభలో ఆమోదం పొందలేదని పేర్కొన్నారు.
మహిళా బిల్లు లోక్‌సభలోకి రాకుండా నిలిపి వేసిందంటూ కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ నిప్పులు చెరిగారు. మోదీ సారథ్యంలో లోక్ సభ, రాజ్యసభల్లో మహిళా బిల్లుకు పూర్తి మద్దతు లభిస్తుందన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ బిల్లును సవరణ చేసుకుని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానున్నారని వివరించారు. మహిళలు, పురుషులు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలనేదే బీజేపీ అభిప్రాయమన్నారు.
ఈ బిల్లుకు అంతా పూర్తి మద్దతు ఇచ్చేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. సోమవారం సభను కాంగ్రెస్ పార్టీ బాయ్ కాట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఉన్నా.. మహిళా బిల్లుకు పూర్తి స్థాయిలో ఆ పార్టీ ఆమోదం ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మోదీ నేతృత్వంలో నారీ శక్తి వందన్‌కు పూర్తి ఆమోదం వచ్చేలా చేశారని వివరించారు.
ఖర్గే వ్యాఖ్యలకు మాధవ్ కౌంటర్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలు సభ్య సమాజంతో పాటు ఎవరూ అంగీకరించరని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఒక వర్గాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. రాజకీయాల్లో ఇలాంటి నాయకులు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత దిగజారుడు విధంగా మల్లికార్జున్ ఖర్గే తీరు ఉందంటూ మండిపడ్డారు.
ప్రధాని మోదీకి ధన్యవాదాలు: ఏపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించిన సందర్భంగా దేశంలోని మహిళా లోకం తరఫున ప్రధాని మోదీకి ఏపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు ధన్యవాదాలు తెలిపారు. చట్టసభల్లో మూడో వంతు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఝాన్సీ లక్ష్మీ భాయి, రాణీ రుద్రమదేవి వంటి ఎంతో మంది నారీ మణులను స్ఫూర్తిగా తీసుకుని ఈ రిజర్వేషన్ అమలు చేసుకుంటున్నామని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ముద్ర యోజన వంటి అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.
స్టాండప్, స్టార్టప్ ఇండియాలో 84 శాతం మహిళలే ఉన్నారని నిషితా రాజ్ గుర్తు చేశారు. బారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లాంటి చాలా మందికి ప్రధాని మోదీ అవకాశాలు కల్పించారని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మహిళలకు భద్రత కల్పించారని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా ప్రతి ఇంటికీ గ్యాస్ సిలిండర్ అందించారని వివరించారు. 2047 నాటికి వికసిత్ భారత్ నినాదంతో ప్రపంచంలో తొలి స్థానంలో భారత్ నిలబడేలా మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భద్రాచలంలో పెరిగిన భక్తుల రద్దీ..
వ్యవస్థను కదిలించిన కానిస్టేబుల్ రేవతి సాహసం.. న్యాయ వ్యవస్థలో మార్పునకు ఇదే సమయం!
For More AP News And Telugu News