వియత్నాం ఫ్రూట్ మన దగ్గర...
ABN , Publish Date - Apr 12 , 2026 | 10:49 AM
ఎర్రగా దోసకాయలా ఉంది. కొబ్బరి కాయలా రెండు ముక్కలు చేసి, దానిలోని ఎర్రని గుజ్జును స్పూన్‌తో తీసి జ్యూస్ చేశారు. జ్యూస్ రుచి కొంచెం వగరు, పులుపుగా ఉంది.
ఎర్రగా దోసకాయలా ఉంది. కొబ్బరి కాయలా రెండు ముక్కలు చేసి, దానిలోని ఎర్రని గుజ్జును స్పూన్‌తో తీసి జ్యూస్ చేశారు. జ్యూస్ రుచి కొంచెం వగరు, పులుపుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ‘వియత్నాం ఫ్రూట్’కు యమా డిమాండ్ ఉంది. అది మనదగ్గర కూడా పండుతోందంటే నమ్ముతారా?
కొవిడ్ అనంతరం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో ‘సూపర్ ఫుడ్స్’ అనే పదం కొత్తగా వినిపిస్తోంది. అంటే... శరీరానికి ఎక్కువ పోషకాలు అందించే ఆహారాలన్నమాట. బ్లూబెర్రీ, అవకాడో, క్వినోవా వంటి పంటలు ఇప్పటికే ప్రపంచ మార్కెట్లను ఆక్రమించాయి. తాజాగా ఆ జాబితాలో చేరిన మరో పండు ‘గ్యాక్ ఫ్రూట్’. దక్షిణ ఆసియా అడవుల్లో పుట్టిన ఈ పండు, ఇప్పుడు పోషకా హార శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య పరిశ్రమల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎర్రగా మెరుస్తూ కనిపించే ఈ పండులో పోషక విలువలు అసాధారణం.
‘గ్యాక్ ఫ్రూట్’ తీగజాతి మొక్క. వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా వంటి దేశాలలో ఇది సహజంగా పెరుగు తుంది. బయటకు పనసపండులా మెత్తని ముళ్లతో ఉన్నట్టుగా కనిపించినప్పటికీ, గట్టి పొరతో ఉంటుంది. పండిన తర్వాత ఇదిచిక్కని నారింజ, ఎరుపు రంగులో మెరిసిపోతుంది. దీని లోపల గింజల చుట్టూ ఉన్న గుజ్జులో అత్యధిక పోషకాలు ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు దీనిని ‘ప్రకృతి ఇచ్చిన పోషకాల ఖజానా’గా పేర్కొన్నారు.
ఇక్కడికి ఎలా వచ్చింది?
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, ఇమామ్‌గూడ గ్రామస్తుడు బుచ్చిరెడ్డి గత 30 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నారు. ఆయన సన్నిహితుల్లో ఒకరు క్యాన్సర్‌తో బాధపడటం చూసి దానికి నివారణగా పనికొస్తుందని ఈ పండు గురించి యూట్యూబ్ వీడియోల్లో చూశారు. ఆ మొక్కల కోసం సెర్చ్ చేయగా ఏపీలోని పోలవరం జిల్లాలో ఒక రైతు ఇంటి పెరట్లో పెంచుతున్నట్టు తెలుసు కున్నారు. అక్కడి పండ్లు రుచి చూసిన తరువాత మొక్కలు తీసుకొని తన ఎకరా పొలంలో నాటారు. ‘‘ఎకరానికి 210 మొక్కలు నాటాలి. పందిళ్లపై సాగు, మొత్తం పెట్టుబడి రూ.5 లక్షలు. నాటిన 6 నెలల్లోపు పూత, 8 నెలలకు పండ్లు చేతికి వస్తాయి. ఒక్కసారి నాటితే 15 నుంచి 20 ఏళ్లదాకా దిగుబడి వస్తూనే ఉంటుంది. పూర్తిగా ఆర్గానిక్ ఎరువులతో పండిస్తున్నాం. సూర్యకాంతి ఉండి, నీరు నిల్వ ఉండని నేల అవసరం. సరైన పద్థతిలో సాగు చేేస్త ఒక ఎకరాలో మంచి ఆదాయం వస్తుంది.
ఏడాదికి ఒక్కసారి పందిరి మీద కొమ్మలు విస్తరించకుండా కత్తిరిేస్త చాలు. ఈ మొక్కల పెంపకంలో అతి కష్టమైన పని ‘పాలినేషన్’. దానిని రోజూ తప్పనిసరిగా చేయాలి’’ అంటారు బుచ్చిరెడ్డి.
సహనం అవసరం
మొక్కలలో పూల ద్వారా జరిగే పునరుత్పత్తి ప్రక్రియనే పాలినేషన్ అంటారు. అదే ఈ పంటకు అతి కీలకం. రైతులు సహనంతో తోటలో పూలను వెతుకుతూ చేయాల్సినది. ఒక పువ్వులోని పురుష భాగం నుంచి వచ్చే పరాగ కణాలు, ఆడ చెట్టు పువ్వులోని స్ర్తీ భాగం మీద పడే ప్రక్రియను ‘పాలినేషన్’ అంటారు. దీనివల్ల పువ్వు పండుగా మారుతుంది. పండులో విత్తనాలు ఏర్పడతాయి. దీనిని రైతులే తోటలో రోజూ చేయాలి. ఇద్దరు పనిచేేస్త 30 పూల వరకు చేయవచ్చు. 6 ఆడ చెట్లకు ఒక మగ చెట్టు పువ్వు సరిపోతుంది.
మిగతా మొక్కల్లో తేనెటీగలు, పక్షుల ద్వారా సహజంగానే పాలినేషన్ జరుగుతుంది. గ్యాక్ ఫ్రూట్ పూలలోని మకరందంలో తీపిదనం తక్కువ ఉంటుంది కాబట్టి తేనెటీగలను ఆకట్టుకోదు. అందుకే మనుషులే మగ, ఆడ పూలను కలపాల్సి ఉంటుంది. ‘‘పండు తయారవుతున్న దశలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్‌గా మారుతుంది. ఒక చెట్టు నుంచి ఏడాదికి 40 కిలోల వరకు దిగుబడి వస్తుంది. కిలో పండు నుంచి 12 గ్లాసుల జ్యూస్ వస్తుంది. కాయ పచ్చిగా ఉన్నపుడు రొయ్యలతో కలిపి కూరగా చేసుకొని తినొచ్చు. దోసకాయ కూరలా చేసుకోవచ్చు. పప్పులో కూడా కలిపి వండుకోవచ్చు’’ అంటున్నారు బుచ్చిరెడ్డి భార్య పద్మావతి.
పోషకాలు అనేకం...
‘గ్యాక్ ఫ్రూట్’లో అనేక పోషకాలున్నాయి. ఈ పండుపై చాలాకాలంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్- ఎ గా మారి, కళ్ల ఆరో గ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్- సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.లైకోపిన్ వంటి పదార్థాలు రక్తనాళాల్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ ఇ, ఇతర పోషకాలు చర్మాన్ని రక్షించి వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందుకే అనేక పోషక విలువలుగల గ్యాక్ ఫ్రూట్ ఆరోగ్య పరిశ్రమలో కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఈ సూపర్ ఫ్రూట్‌తో చేస్తున్న న్యూట్రిషనల్ సప్లిమెంట్స్, హెల్త్‌డ్రింక్స్, కాస్మొటిక్ ఉత్పత్తులకు ఇప్పటికే యూరప్, అమెరికా, జపాన్ మార్కెట్లలో డిమాండ్ ఉంది. ఎర్రటి రంగులో మెరిసే ఈ ఫలం... పోషకాల అద్భుతం.
- శ్యాంమోహన్, 94405 95858