Share News

ఊరంతా భూమి లోపలే...

ABN , Publish Date - Apr 12 , 2026 | 10:16 AM

లక్షలు ఖర్చు చేసి ఇంటిని అద్దాల మేడల్లా తీర్చిదిద్దుకునే వారిని చూస్తూనే ఉంటాం. కోట్లు పెట్టి ఆకాశహర్మ్యాలలో ఫ్లాట్‌ కొనుక్కుంటున్న వారూ ఉన్నారు.

ఊరంతా భూమి లోపలే...

లక్షలు ఖర్చు చేసి ఇంటిని అద్దాల మేడల్లా తీర్చిదిద్దుకునే వారిని చూస్తూనే ఉంటాం. కోట్లు పెట్టి ఆకాశహర్మ్యాలలో ఫ్లాట్‌ కొనుక్కుంటున్న వారూ ఉన్నారు. అవన్నీ భూమిపై ఉంటాయి. కానీ ఎలాంటి ఆధునిక సదుపాయాల జోలికి వెళ్లకుండా నేల మాళిగల్లో నివసిస్తున్నవారు కూడా ఉన్నారంటే నమ్ముతారా? చైనాలో కనిపించే భూగర్భ గృహాలలో ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

ఇల్లు కట్టాలంటే కాంక్రీటు, ఇటుకలు, సిమెంటు, కలప... ఒక్కటేమిటి ఎన్నెన్నో కావాలి. వాటికోసం లక్షల రూపాయలు వెచ్చించాలి. ఇదంతా ఒకవైపు. చైనాలోని షాంగ్జీ, హెనన్‌ ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం అలాంటి హంగుల జోలికి వెళ్లరు. గొయ్యి తవ్వి ప్రాచీనమైన, పర్యావరణ అనుకూలమైన భూగర్భ గృహాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటారు. ఈ భూగర్భ గృహాలను ‘యావోడాంగ్‌’, ‘పిట్‌హౌజ్‌’లని పిలుస్తారు. యావోడాంగ్‌ అంటే చైనా భాషలో ‘ఇంటి గుహ’ అని అర్థం. చైనా నాగరికతకు ఈ ప్రాంతం పుట్టినిల్లుగా పేర్కొంటారు.


వేసవిలో చల్లగా...

చైనాలోని లోయెస్‌ పీఠభూమిలో ఈ తరహా భూగర్భ గృహాలు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. వీటికి నాలుగు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఒక పెద్ద గొయ్యిని తవ్వి, దాని చుట్టుపక్కల కొండచరియలను తవ్వడం, మట్టి తొలగించడం ద్వారా గదులు ఏర్పాటు చేసుకుంటారు. ఈవిధంగా భూమి లోపల నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఏసీ అవసరం ఉండదు. ఇక్కడి నేల ఉష్ణనిరోధకంగా పనిచేస్తుంది. ఈ నివాసాలు మన్నికైనవి.


book4.2.jpgభూకంపాలు సంభవిస్తే కూలిపోతా యేమోనన్న భయం అక్కర్లేదు. కాంక్రీటు, స్టీలు, సిమెంటు ఉపయోగించరు. ఇవి ఎలాంటి సపోర్టు లేకున్నా కూలిపోకుండా ఉంటాయి. 20 నుంచి 30 అడుగుల లోతు గొయ్యి తవ్విన తరువాత అడ్డంగా గదులు తవ్వుతారు. భూగర్భ గృహాలలో నుంచి సులువుగా బయటకు వచ్చేందుకు ఒక ర్యాంప్‌ కూడా నిర్మిస్తారు. ఆధునిక భవంతులు, అపార్టుమెంట్లు, వ్యక్తిగత గృహాలు అందుబాటులో ఉన్నప్పటికీ షాంగ్జీలో లక్షల మంది ప్రజలు ఇప్పటికీ ఈ సంప్రదాయ గృహాలలోనే నివసిస్తుంటారు. కొన్ని వేల ఏళ్లుగా ఈ గృహాలు ఉన్నా 2001లోనే ప్రభుత్వం వీటిని చైనా ‘సాంస్కృతిక వారసత్వ సంపద’గా గుర్తించింది.


ప్రత్యేక పీఠభూమి

కొన్ని లక్షల ఏళ్ల పాటు... గాలులు వీచడం వల్ల కొట్టుకువచ్చిన అతి సూక్ష్మ మట్టి రేణువులతో ఈ పీఠభూమి ఏర్పడిందని చెబుతారు. ఇక్కడి మట్టి మెత్తగా, బంక మట్టితో సారవంతంగా ఉంటుంది. ఇది వ్యవసాయానికి అనుకూలమైనది. గుహలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఒక్కో గుహలో నాలుగైదు గదులు ఏర్పాటు చేసుకుంటారు. పడకగదులు, హాల్‌, వాష్‌రూమ్‌లు, కిచెన్‌... ఇలా సకల సదుపాయాలు ఉంటాయి. వీటిని కొందరు ‘జానపద గృహాల’ని కూడా అంటారు.


ఇందులో నివసించే వారిలో ఎక్కువమంది గ్రామీణ రైతులే కనిపిస్తారు. గ్రామస్థులందరూ పరస్పర సహకారంతో ఒకదాని పక్కన మరొకటి నిర్మించుకుంటారు. ఊరు ఊరంతా ‘పిట్‌ హౌజ్‌’ల్లోనే నివాసం ఉంటుంది. అక్కడికి వెళ్లి భూ ఉపరితలం నుంచి చూస్తే సీన్‌ అదిరిపోతుంది. అందుకే ఈ భూగర్భ గృహాలు పర్యాటక కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. పర్యాటకులు షాంగ్జీ, హెనన్‌లలో ఉన్న ‘యావోడాంగ్‌’ గృహాలను చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..

దేవునికి దణ్ణం పెట్టుకునేటప్పుడు ఎందుకు కళ్లు మూసుకుంటామో తెలుసా..?

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2026 | 11:55 AM