Share News

తలపడటం నాకు కొత్తకాదు!

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:28 AM

‘‘వాళ్లకు సినిమా చూపిస్తాం– వీళ్లకు చుక్కలు చూపిస్తాం! మధ్యలో అడ్డొస్తే రప్పా రప్పానే. మొత్తంగా రాష్ర్టానికి, ప్రజలకు నరకం చూపిస్తాం. ఇందుకోసం మావిగన్లకు ఉచిత గొడ్డళ్ల పంపణీ పథకం తీసుకొస్తాం!’’...

తలపడటం నాకు కొత్తకాదు!

పీ4 కార్యక్రమంపై ‘వీకెండ్‌ కామెంట్‌’లో నేను చాకిరేవు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత సర్దుకున్నారు. దానివల్ల ఆయనకే మంచి జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారి నోటి వెంట పరుష పదాలు వెలువడకూడదని, ఆ పదవికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలన్న సూచనను రేవంత్‌రెడ్డి స్వీకరించారు. గతంలో మీడియాలో వెలువడే సలహాలు, సూచనలను గమనిస్తూ లోటుపాట్లను రాజకీయ నాయకులు సరిదిద్దుకొనే వారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జగన్‌రెడ్డి సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి మీడియాలో విభజన గీత ఏర్పడింది. అనుకూల, వ్యతిరేక మీడియా అన్న పదాలు వచ్చాయి. ఇప్పుడు అది కూడా పోయి శత్రు పక్షాలుగా పరిగణిస్తున్నారు.

‘‘వాళ్లకు సినిమా చూపిస్తాం– వీళ్లకు చుక్కలు చూపిస్తాం! మధ్యలో అడ్డొస్తే రప్పా రప్పానే. మొత్తంగా రాష్ర్టానికి, ప్రజలకు నరకం చూపిస్తాం. ఇందుకోసం మావిగన్లకు ఉచిత గొడ్డళ్ల పంపణీ పథకం తీసుకొస్తాం!’’... 2029 ఎన్నికల సందర్భంగా వైసీపీ విడుదల చేయబోయే మ్యానిఫెస్టో ఇంచుమించుగా ఇలాగే ఉండవచ్చు. ఐదారు రోజులుగా కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, హెచ్చరికలు గమనించిన వారికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. ‘2029 తర్వాత ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ర్టాన్నా? ప్రజలనా?’ అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా ఇదే సందర్భంలో ప్రశ్నించడం గమనార్హం. 2029లో అధికారంలోకి వస్తే ఏం చేద్దామనుకుంటున్నారో మనసులో ఉన్నది దాచుకోకుండా వైసీపీ నాయకులు బయటకు చెప్పేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి చంపుతాం–నరుకుతాం అంటున్నారంటే, అధికారంలోకి వస్తే ఎలా ప్రవర్తించనున్నారో చెప్పకనే చెప్పడమే. ఐదారు రోజులుగా ఆ పార్టీ నాయకులు కొందరు తమ నోటి తీట తీర్చుకుంటున్నారు. నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అయితే, వాటన్నింటినీ ఆశీర్వాదాల్లాగే తీసుకుంటున్నాను. బెదిరింపులు, దాడులు నాకు కొత్త కాదు. గత వారం ‘వీకెండ్‌ కామెంట్‌’లో నేను చేసిన వ్యాఖ్య వైసీపీ నాయకుల పల్లదనానికి కారణం.


మా ఇళ్లలోని మహిళలను తిడతారా? అని కొంతసేపు... మమ్మల్ని తిడతారా... అని మరికొంత సేపు యాగీ చేస్తూ వచ్చారు. ఇంతకీ నేను ఎవరిని తిట్టాను అన్న విషయంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి కూడా క్లారిటీ లేకపోవడం విషాదం. పోలికలు, ఉపమానాల గురించి కూడా తెలియని ఘనాపాటీలు ఆ పార్టీలో ఉన్నారు మరి. ఒక వ్యక్తి ఎంత వెధవో చెప్పడానికి వాడికి తల్లికీ చెల్లికీ తేడా తెలియదు అని అంటాం. అంటే, తల్లులనూ చెల్లెళ్లను తిట్టినట్టు కాదు కదా? వారిని అలా చూడలేని వారిని మాత్రమే తిట్టినట్టు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల మితిమీరిన ప్రభు భక్తిని ఎత్తి చూపేందుకు.. ‘మీ భార్యలు భార్యలు కాదు, చెల్లెళ్లు అని జగన్‌రెడ్డి చెబితే... ఔను’ అని వైసీపీ నాయకులు కొందరు తలలు ఊపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈ ఉపమానం వాడాను. ఇక్కడ తిట్టడం అంటూ జరిగిందంటే అది పురుషులనేగానీ మహిళలను కాదు కదా! విషయాన్ని సూటిగా అర్థం చేసుకోలేని వారిని నెల తక్కువ మనిషి అని అంటారు. కొన్ని సందర్భాలలో కొంత మంది రాజకీయ నాయకులను స్పైన్‌ లెస్‌, బ్రెయిన్‌ లెస్‌ అని ఉద్దండులైన అనేక మంది జర్నలిస్టులు గతంలో అభివర్ణించారు. సొంత అభిప్రాయం అంటూ లేకుండా తమ నాయకుడు తానా అంటే తందానా అనే వాళ్లను వెన్నెముక లేని వాళ్లు అని కాక మరేమంటాము? అధినాయకులకు విధేయులుగా ఉండటం వేరు! బానిసలుగా వ్యవహరించడం వేరు! ఒపీనియన్స్‌ అప్పుడప్పుడూ చేంజ్‌ చేస్తుంటేగానీ పొలిటీషియన్‌ కానేరడు అని గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’లో గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో అంటాడు.


మాట మారుస్తారు ఎందుకు? అని శిష్యుడు అడగ్గా, ‘ఇన్ఫాంట్‌ మ్యారేజ్‌లు (బాల్య వివాహాలు) అయితేగానీ యంగ్‌ విడోలు ఉండరు. యంగ్‌ విడోస్‌ ఉంటేగానీ వితంతు వివాహాలు అనే సంస్కరణ తీసుకురావడానికి అవకాశం ఉండదు’ అని గిరీశం సెలవిస్తాడు. రాజకీయ నాయకులు ఒపీనియన్స్‌ మార్చుకోవడాన్ని సమాజం కూడా ఆమోదిస్తోంది. తంటా అంతా అసలు ఒపీనియన్స్‌ లేని వాళ్లతోనే. వైసీపీలో ఈ బాపతు వాళ్లు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నేను మహిళలను అవమానించానని ఆ కార్యక్రమం ప్రసారమైన రెండు రోజులకు జగన్‌రెడ్డి బెంగళూరు నుంచి తీరిగ్గా వచ్చి చెప్పగానే మిడతల దండులా నాపై పడ్డారు. మాజీ మంత్రులు, శాసనసభ్యులు హైదరాబాద్‌కు వచ్చి మరీ మా కార్యాలయం వద్ద మండుటెండలో ధర్నా చేసి తమ అధినాయకుడిని సంతృప్తిపరిచారు. జోగి వంటి వాళ్లు నా దమ్ము, ధైర్యం చూడాలని ముచ్చటపడ్డారు. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థల దాదాపు పాతికేళ్ల ప్రస్థానంలో మా దమ్ము, ధైర్యాన్ని అనేకమార్లు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలో ఉన్నన్ని రోజులూ తల ఎగరేసి బతికామే తప్ప తల దించుకొని బతకలేదు. మేం కయ్యానికి కాలు దువ్వం. అయితే... అవతలి వారు వ్యవహరించే తీరును బట్టి మా స్పందన ఉంటుంది.


మహిళలపై నీచంగా మాట్లాడిన చరిత్ర..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలంటే కనీస గౌరవం లేని వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే జగన్‌ అండ్‌ కోనే కనిపిస్తారు. వారి మాటల్లో, చేతల్లో ‘మేల్‌ చావనిజం’ కనిపిస్తూనే ఉంటుంది. వైసీపీ శ్రేణులు, ప్రధానంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు ఆయనను అభిమానించిన వాళ్లు ఆయన మరణం తర్వాత జగన్‌రెడ్డి అభిమానులుగా మారారు. ఇందులో ఎవరికీ ఆక్షేపణ లేదు. జగన్‌రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ–చెల్లి షర్మిలతో విభేదాలు వచ్చినప్పుడు ఈ మూక అంతా కట్టకట్టుకొని రాజశేఖరరెడ్డి భార్యనూ, కూతుర్నీ ఎంతగా అవమానించిందో చూశాం. రాజశేఖరరెడ్డి సతీమణి, రక్తం పంచుకుపుట్టిన కుమార్తె షర్మిల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే! వారి శీలాన్ని శంకించే వరకూ వెళ్లారు కదా! అంటే వారికి రాజశేఖరరెడ్డి కంటే ఆయన కుమారుడు జగనే ముఖ్యమని తేలిపోయింది. అదే కుటుంబానికి చెందిన మహిళలంటే తమకు గౌరవం లేదని కూడా చాటి చెప్పారు. గౌరవ సభగా ఉండాల్సిన శాసనసభను కౌరవ సభగా మార్చి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఘోరంగా అవమానించడాన్ని ఏమనాలి? పవన్‌ కల్యాణ్‌ కుటుంబ సభ్యులను కూడా నానా మాటలు అన్నారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేశ్యలతో పోల్చడం మహిళలను గౌరవించడమా? దీనిపై నిరసన వ్యక్తం చేసిన మహిళా రైతులను ‘సంకర జాతి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం మహిళలను గౌరవించడం అవుతుందా? సొంత సోదరి అని కూడా చూడకుండా షర్మిలను బహిరంగంగా కించపరిచిన వ్యక్తి జగన్‌రెడ్డి కాదా? వీళ్లా మహిళల గురించి గుండెలు బాదుకొనేది? పోలికలు, ఉపమానాల గురించి కూడా తెలియని వాళ్లను ఏమనాలి? మీ బుర్రల్లో గుజ్జు లేదని అనడం తప్పు ఎలా అవుతుంది? రాజకీయ నాయకులు ఒపీనియన్స్‌ మార్చుకుంటే తప్పు లేదు అని గిరీశం చెప్పాడేగానీ.. అసలు ఒపీనియన్సే ఉండకూడదు అనలేదు. ట్రాజెడీ ఏమిటంటే వైసీపీలో కొందరు నాయకులకు సొంత అభిప్రాయాలు లేకుండా పోయాయి. బాబాయ్‌ గుండెపోటుతో చనిపోయాడని జగన్‌రెడ్డి చెప్పగానే అదే పల్లవి అందుకున్నారు. కాదు.. కాదు.. నారాసుర రక్తచరిత్ర అంటే మళ్లీ జై కొట్టారు. వివేకానందరెడ్డిని ఆయన కూతురు సునీతే చంపారని చెబితే అదే ప్రచారం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి అని అంటే ఎన్నికల్లో అదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని జగన్‌ ప్రకటించగానే అదే పాట పాడారు. మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని అవుతుందని అంటే అదీ నిజమని నమ్మారు. అతడే ఇప్పుడు మావిగన్‌ అని నోటికి తోచినట్టు చెప్పగానే... మావిగన్‌ మావిగన్‌ అని భజన మొదలెట్టారు. అతను విలువలతో కూడిన రాజకీయం, కుటుంబ విలువలు అనగానే.. అవును అవును అని కోరస్‌ పాడుతున్నారు. నా చెల్లి అమ్ముడుపోయింది అని అతగాడు అనగానే.. అవును అవును అని షర్మిలను ముతక భాషలో తిట్టడం మొదలెట్టారు. నా ఆస్తి కాజేయడానికి మా అమ్మ ప్రయత్నిస్తోందని జగన్‌రెడ్డి చెప్పగానే రాజశేఖర రెడ్డి భార్య అని కూడా చూడకుండా విజయమ్మను బూతులు తిట్టారు. 2024కు ముందు ‘వై నాట్‌ 175’ అని అతను అనగానే మీరు వెర్రెక్కిపోలేదా? తీరా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక ఈవీఎంల మోసం అంటే అదే పాట అందుకోలేదా! మధ్యలో కోడికత్తి, గులకరాయి వంటివి ఉండనే ఉన్నాయి. స్థూలంగా వైసీపీలో పరిస్థితి ఇదీ.


ఆ పార్టీలో సొంత అభిప్రాయం కలిగి ఉండటానికి లేదు. సొంత బుర్రలతో ఆలోచించకూడదు. వాళ్లకంటూ ఒక సిద్ధాంతం ఉండకూడదు. విలువలు కూడా ఉండకూడదని అధి నాయకుడు చెబితే... విలువలను వలువలు విడిచిపెట్టినట్టు విడిచిపెట్టాల్సిందే! బుర్రా బుద్ధీ జ్ఞానం ఉండకూడదని చెబితే అంతే కాబోలు అని సర్దుకుపోయే పరిస్థితి. పార్టీలో కొనసాగాలంటే కట్టు బానిసలుగా మారాల్సిందేనా? ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాల్సిందేనా? ఎవరి ఇంటిపైన, ఎవరి కార్యాలయాలపైన దాడి చేయాలని చెబితే ఆకు రౌడీల్లాగా లగెత్తడమేనా? ఇదేం సంస్కృతి? వెన్నెముక ఉన్న వాళ్లు సొంత బుర్రతో ఆలోచిస్తారు. రాజకీయ పార్టీలలో అధినేతలకు జీ హుజూర్‌ అనడం పరిపాటిగా మారింది. అయితే, వైసీపీలో ఇది మోతాదు మించుతోంది. గడచిన ఐదారు రోజులుగా నన్ను దూషిస్తున్నవారు, బెదిరిస్తున్న వారిలో పలువురిని నేను ఇదివరకు వ్యక్తిగతంగా చూసింది కూడా లేదు. నిజానికి వారికి వెన్నెముక, సొంత బుర్ర ఉండి ఉంటే నన్ను ఆ స్థాయిలో దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా మా మీడియాలో వార్తలు ప్రసారం కాలేదు. అయినా వారికి నాపై అంత కోపం ఎందుకు? అని అంటే తమ అధినాయకుడు జగన్‌రెడ్డి నన్ను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకోవడమే. జగన్‌రెడ్డి తన శత్రువులుగా ప్రకటించుకున్న వారందరినీ ఆ పార్టీ నాయకుల్లో అత్యధికులు తమ శత్రువులుగా పరిగణించడాన్ని ఏమనాలి? నోళ్లను మురికిమయం చేసుకోవడం వల్లే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారనేది తెలుసుకోకుండా మళ్లీ నోటి దురుసు ప్రదర్శిస్తున్న వాళ్లను విజ్ఞులుగా పరిగణించాలా? రాజకీయ పార్టీలలో కనీస స్థాయిలో నైనా అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అధినాయకులు ఫాసిస్టులుగా మారిపోతారు. తమ నాయకుడు సలహాలు తీసుకోరు– ఆయనకు ఆ అవసరం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


తప్పులు ఉంటే చెప్పడమే...

ప్రభుత్వాలైనా, పార్టీలైనా దారి తప్పినప్పుడు చెప్పడం మీడియా బాధ్యత. అది మీడియా హక్కు కూడా. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి, తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు వారి తప్పొప్పులను ఇదే ‘వీకెండ్‌ కామెంట్‌’లో అనేక మార్లు ఎత్తిచూపాను. వాటిని సరిదిద్దుకోకపోగా వ్యక్తిగత ద్వేషంతో విమర్శిస్తున్నానని వారిరువురూ భావించారు. దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పర్యవసానమే గత ఎన్నికల్లో ఇరువురూ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉన్నాం. పీ4 కార్యక్రమంపై ‘వీకెండ్‌ కామెంట్‌’లో నేను చాకిరేవు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంత సర్దుకున్నారు. దానివల్ల ఆయనకే మంచి జరిగింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారి నోటి వెంట పరుష పదాలు వెలువడకూడదని, ఆ పదవికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలన్న సూచనను రేవంత్‌రెడ్డి స్వీకరించారు. గతంలో మీడియాలో వెలువడే సలహాలు, సూచనలను గమనిస్తూ లోటుపాట్లను రాజకీయ నాయకులు సరిదిద్దుకొనేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జగన్‌రెడ్డి సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి మీడియాలో విభజన గీత ఏర్పడింది. అనుకూల, వ్యతిరేక మీడియా అన్న పదాలు వచ్చాయి. ఇప్పుడు అది కూడా పోయి శత్రు పక్షాలుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డి నన్ను మీడియా వ్యక్తిగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్‌రెడ్డి నా పైకి తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పుతున్నారు. చంద్రబాబు కంటే నేనే ప్రధాన ప్రత్యర్థిని అన్నట్టుగా జగన్‌రెడ్డి ప్రకటించుకున్నారు.


అహంకారంతో అధఃపాతాళానికి...

2029లో అధికారంలోకి వస్తే నన్ను అది చేస్తా ఇది చేస్తా అని జగన్‌ అండ్‌ కో విసురుతున్న సవాళ్లను స్వీకరిస్తున్నాను. అంతకంటే ముందు మీ నుంచి వచ్చిన ప్రశ్నలకు, విమర్శలకు సమాధానం చెబుతా! గత వారం నేను రాసిన వ్యాఖ్యలు మహిళలను కించపరచడం కిందకు రావు. అధినాయకుడి తెలివి తక్కువ నిర్ణయమైన మావిగన్‌ వంటి వాటిని ప్రశ్నించకపోవడం ఏమిటని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాను. ‘మావిగన్‌ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేయించారు’ అని అంటున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను చూసి సొంత పార్టీ నాయకులే చాటుగా నవ్వుకుంటుండగా, ప్రజలు బహిరంగంగానే ఈ ప్రతిపాదనకు పగలబడి నవ్వుతున్నారు. జగన్‌రెడ్డిని సమర్థించే పేటీఎం బ్యాచ్‌ కూడా మావిగన్‌ను వెక్కిరించడం ఇక్కడ కొసమెరుపు. మా నాయకులు ఎక్కడా దౌర్జన్యానికి, హింసకు పాల్పడలేదని, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ నేను క్షమాపణలు చెప్పాలని మాత్రమే కోరుతున్నారని జగన్‌రెడ్డి సోది మాటలు చెబుతున్నారు. 2029 తర్వాత నన్ను లేకుండా చేస్తాననడం శాంతియుత ప్రవచనాలు అవుతాయా? ఆంధ్రప్రదేశ్‌లో హద్దూ అదుపూ లేకుండా ప్రవర్తించడానికి అలవాటు పడినట్టుగానే హైదరాబాద్‌ వచ్చి ఏబీఎన్‌ వద్ద నోరు పారేసుకుంటున్న ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు హైదరాబాద్‌ పోలీసులు తగు ట్రీట్మెంట్‌ ఇవ్వడం నిజం కాదా? బూతు భాషకు అలవాటుపడిన వారికి అన్నీ బూతులుగానే కనిపిస్తాయి –వినిపిస్తాయి. అయినా, జగన్‌రెడ్డి సొంత మీడియా నిత్యం చేసుకుంటున్న వాంతులతో ఎవరైనా పోటీ పడగలరా? ప్రజాస్వామ్యంలో చట్టం, న్యాయం అనే వ్యవస్థలు ఉంటాయన్న వాస్తవాన్ని విస్మరించి ఆటవిక న్యాయం అమలు చేస్తామన్న బెదిరింపులకు దిగుతున్నది నిజం కాదా? జర్నలిజం గురించి, జర్నలిజం విలువల గురించి కనీస అర్హతలు లేనివారు కూడా చెబితే వినే దుస్థితిలో నేను లేను. నా అభిప్రాయాలతో ఎవరైనా విభేదించవచ్చు. భేదాభిప్రాయాలు ఉండకూడదనుకోవడం ఫాసిజం కిందకు వస్తుంది. జగన్‌రెడ్డి తాజాగా చెబుతున్న మావిగన్‌ ప్రతిపాదనను సీపీఎం నాయకులు బీవీ రాఘవులు కూడా ఎగతాళి చేశారు. ఆయన మీద కూడా దాడికి వెళతారా? అయినా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా జగన్‌రెడ్డిలో ఫ్యాక్షన్‌ మనస్తత్వం పుట్టుకతోనే వచ్చింది.


తాత రాజారెడ్డి పెంపకంలో పెరిగారు కదా మరి? జగన్‌రెడ్డి అనే వ్యక్తి వంద మంది రాజారెడ్డిలతో సమానమని చెబుతారు. రాజకీయాల్లోకి రాకముందే ఫ్యాక్షన్‌ లక్షణాలు వంటబట్టించుకున్నారు. పోలీసు అధికారులను పోలీస్‌ స్టేషన్‌లోనే కొట్టిన ఘన చరిత్ర జగన్‌ది. కాకపోతే ఇప్పుడు అధికారం తోడైతే కనుక పోలీసులతో ప్రత్యర్థులను కొట్టిస్తానని చెబుతున్నారు. అతని లీలల గురించి పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి చివరి రోజుల్లో జగన్‌రెడ్డి ఉనికినే భరించలేకపోయారన్నది నిజం కాదా? ‘నువ్వు హైదరాబాద్‌లో ఉండవద్దు– బెంగళూరులోనే ఉండు’ అని జగన్‌రెడ్డిని ఉద్దేశించి రాజశేఖర రెడ్డి ఎందుకన్నారో సమాధానం చెప్పండి. చివరకు రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత... తాను కోరుకున్న ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వకపోవడంతో సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు తనలోని నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. మొత్తానికి 2019లో ప్రజలను ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని జాలిగా వేడుకొని, నమ్మించి అధికారంలోకి రాగలిగారు. అంతే, ఇక 30 ఏళ్ల వరకు తనకు తిరుగులేదని, తానే ముఖ్యమంత్రినని భ్రమించి అధికార మదంతో విర్రవీగారు. అంతులేని అధికారం, సంపద పోగవడంతో అహంకారం తలకెక్కి తాను నిర్మించుకున్న రాజకీయ వృక్షాన్ని తానే కూకటి వేళ్లతో కూలగొట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే రెట్టింపు విధ్వంసం చేస్తామని చెబుతున్నారంటే వీళ్లను ఏమనాలి? వీరి చేష్టలకు హైకోర్టు న్యాయమూర్తి సైతం విస్మయం చెందారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా తమ లాగే గొర్రెల మంద అనుకుంటున్నట్టుగా ఉంది. అవసరమైనప్పుడు ప్రజలు విజ్ఞత ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతురాలినే ఎమర్జెన్సీ తర్వాత మట్టికరిపించారు. విజ్ఞత ఉన్నవాళ్లు చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటారు. జగన్‌ అండ్‌ కో రూటే సెపరేటు కదా! అందుకే గొడ్డళ్లు, కోడికత్తులు, గన్నులనే నమ్ముకోవాలనుకుంటున్నారు. రప్పా రప్పా ఫ్లెక్సీలు, నినాదాలు ఇందుకు నిదర్శనం. కాలకేయుల్లాగా సభ్య సమాజంలో ఆయుధాలు చేతబట్టి తిరగాలనుకుంటున్నారు. అందుకే అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని ఏ మాత్రం వెరపు లేకుండా మాట్లాడుతున్నారు.


నాకు తెలిసిన జగన్‌రెడ్డి...

ప్రభుత్వాలతో తలపడటం నాకు కొత్త కాదు. రాజశేఖర రెడ్డితో మొదలైన మా పోరాటం కేసీఆర్‌, జగన్‌రెడ్డి వరకు కొనసాగింది. అవసరమైతే భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాం. దోచుకున్నది పంచుకొనే అవకాశం కట్‌ అవుతుందన్న బాధతో వైసీపీకి నేను వ్యతిరేకిని అన్నట్టుగా నమ్మబలికే ప్రయత్నం జగన్‌రెడ్డి చేస్తున్నారు. దోచుకోవడంలో నిన్ను మించిన వాళ్లు ఎవరుంటారు జగన్‌రెడ్డీ! ఇక పంచుకోవడంపై ఆసక్తి ఉండి ఉంటే నీ నుంచి అటువంటి ఆఫర్‌ వచ్చినప్పుడే ఎగిరిగంతేసే వాడిని కదా! జగన్‌రెడ్డి నైజం గురించి ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారుగానీ నాకు ఎప్పుడో అవగతమైంది. ఒక కామన్‌ ఫ్రెండ్‌ సూచన మేరకు రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్‌రెడ్డిని పరామర్శించడానికి ఆ స్నేహితుడితోపాటు వెళ్లాను. సానుభూతి వాక్యాలు అయిన తర్వాత జగన్‌రెడ్డి ఉన్నట్టుండి ‘మీ పత్రిక ఆంధ్రజ్యోతి నేను చదవను’ అని అన్నారు. అసందర్భంగా అతను అన్న మాటలతో జగన్‌రెడ్డి ఎటువంటి వాడో నాకు బోధపడింది. ఆ తర్వాత కామన్‌ ఫ్రెండ్‌తో పాటు బయటకు వచ్చి. ‘మీ వాడు తేడా అనుకుంటానే’ అని అన్నాను. అప్పుడు అతను ‘కొంచెం’ అని తల పంకించాడు. ఆ ఒక్క సంఘటనతోనే జగన్‌రెడ్డి ఎలాంటి వాడో తెలిసిపోయినందున నాటి నుంచి నేటి వరకు అతనితో నేను దూరం పాటిస్తూనే ఉన్నాను. ఈ ఒక్క సంఘటన మాత్రమే కాదు, రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు, అంటే దాదాపు పాతికేళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటుచేసుకున్న ఒక దిగ్ర్భాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేనే బయటపెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్‌ ప్రజానీకం నివ్వెరపోతుంది. ఆ సంఘటన గురించి తెలిసిన నాకు వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అధికారంలోకి వచ్చి నన్ను ఏదో చేయాలనుకుంటున్న జగన్‌రెడ్డికి ప్రస్తుతానికి బెస్టాఫ్‌ లక్‌ చెబుతాను. మ్యాన్‌ ప్రపోజెస్‌ గాడ్‌ డిస్పోజెస్‌ అంటారు. చూద్దాం, ప్రజలు జగన్‌ అండ్‌ కో కొవ్వు కరిగిస్తారా? లేక నా కొవ్వు కరిగిస్తారా? ప్రస్తుతానికి నా శరీరంలో కొవ్వు శాతం పరిమితికి లోబడే ఉంది!

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్‌రెడ్డిని పరామర్శించడానికి.. స్నేహితుడితోపాటు వెళ్లాను. సానుభూతి వాక్యాలు అయిన తర్వాత జగన్‌రెడ్డి ఉన్నట్టుండి ‘మీ పత్రిక ఆంధ్రజ్యోతి నేను చదవను’ అని అన్నారు. అసందర్భంగా అతను అన్న మాటలతో జగన్‌రెడ్డి ఎటువంటి వాడో నాకు బోధపడింది. నాటి నుంచి నేటి వరకు అతనితో నేను దూరం పాటిస్తూనే ఉన్నాను.

Updated Date - Apr 12 , 2026 | 12:34 AM