విజయ్ రోడ్‌షోకు పోటెత్తిన జనం
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:05 PM
అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో పోటీచేస్తున్న టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ బుధవారం పాల్గొన్న రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు.
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో పోటీచేస్తున్న టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ బుధవారం పాల్గొన్న రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఈ నెల 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసేందుకు నిర్ణయించిన విజయ్ ‘విజిల్’ గుర్తుపై పోటీచేయనున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు విజయ్ పలు జిల్లాల్లో రోడ్‌షో, సభల్లో పాల్గొని విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
మంగళవారం తిరుప్పూర్ జిల్లాలోని తిరుప్పూర్ నార్త్, తిరుప్పూర్ సౌత్, అవినాశి, పల్లడం, గాంగేయం, ధారాపురం, ఉడుమలై, మడత్తుకుళం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బుధవారం గ్రేటర్ చెన్నైలోని టి.నగర్, ఎగ్మూర్, ట్రిప్లికేన్ నియోజకవర్గాల్లో రోడ్‌షోలో పాల్గొని ప్రజలకు అభివాదం చేస్తూ టీవీకే గుర్తు విజిల్‌ను చూపించి ఓటు వేయాలని సైగ చేశారు. సాయంత్రం 4 గంటలకు టి.నగర్‌లోని సీఐటీ నగర్ నుండి ప్రారంభమైన విజయ్ రోడ్‌షో టి.నగర్ బస్ స్టాండ్, సౌత్ ఉస్మాన్‌రోడ్డు, హబీబుల్లా రోడ్డు జంక్షన్ల మీదుగా నుంగంబాక్కంలోని వళ్లువర్‌కోట్టమ్‌కు చేరుకుంది.
అక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ విజయ్ చేట్‌పేట్ వంతెన మీదుగా పయనించి ఎగ్మూర్ నియోజకవర్గానికి చేరుకున్నారు. రోడ్‌షోలో పాల్గొన్న విజయ్‌ను నేరుగా చూసేందుకు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ యువత ఉత్సాహంగా పరుగులు తీశారు. గతంలో విజయ్ పాల్గొన్న సభల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట మళ్లీ పునరావృతం కాకుండా నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం పోలీసులు రోడ్‌షో సాగిన మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళా రిజర్వేషన్.. లోక్‌సభ ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లు
Read Latest Telangana News and National News