టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:33 PM
వరంగల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
288 పాఠశాలలు... 9,492 మంది విద్యార్థులు...
47 పరీక్షా కేంద్రాలు..496 మంది ఇన్విజిలేటర్లు
నేటి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అవకాశం
వరంగల్: వరంగల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సత్యశారత ఇప్పటికే పలుదఫాలుగా సమన్వయ సమావేశాలు నిర్వహించారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు.
కాగా, ఈ ఏడాది జిల్లాలో 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పది ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచేం దుకు ఇప్పటికే ప్రణాళికబద్ధమైన పటిష్టమైన చర్యలను విద్యా శాఖ చేపట్టింది. స్పెషల్ క్లాసులు, రివిజన్ క్లాసులు, నిపుణులతో విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. ఈ నెల 14 లోగా విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసే పనిలో జిల్లా విద్యా శాఖ నిమగ్నమైంది.
జిల్లాలోని 288 పాఠశాలల నుంచి 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,932 మంది బాలురు పరీక్షలకు హాజరు కానుండగా 4560 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో అన్ని వసతులతో కూడిన 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 47 మంది సీఎస్, 48 మంది డీవోలను, 47మంది సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల బట్వాడ కోసం ఆరుగురు రూట్ ఆఫీసర్లు, మరో ఆరుగురు అదనపు రూట్ ఆఫీసర్లను నియమించారు. ముగ్గురు సభ్యులతో కూడిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 496 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇక 22 పరీక్షా కేంద్రాల్లో శాశ్వత సీసీ కెమెరాలు ఉండగా, మిగిలిన 25 కేంద్రాల్లో తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచి రాష్ట్ర స్థాయిలోనే జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు నెల 1వ తేదీ నుంచే విద్యార్థులకు సాయంత్రం పూట స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేశారు. జనవరి 1 నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్పెషల్ క్లాసులు నిర్వహించారు. ఈ నెల 6 నుంచి వారం రోజుల పాటు విషయ నిపుణులతో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
నేటి నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
పదవ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు శుక్రవారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షలకు అనుమతిస్తారని, హెడ్మాస్టర్ల సంతకాలతో అవసరం లేదని డీఈవో రంగయ్య స్పష్టం చేశారు.
జిల్లాను ముందంజలో ఉంచుతాం..
రంగయ్య నాయుడు, డీఈవో
వరంగల్ జిల్లాను పదవ తరగతి ఫలితాల్లో ముందంజలో ఉంచుతాం. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పదవ తరగతి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు కొరత ఉన్నచోట సర్ధుబాటు చేశాం ఎక్కడా సబ్జెక్టు టీచర్ లేకుండా లేరు. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు బోధించారు. ప్రత్యేకమైన ప్రణాళికతో విద్యార్థులను పదవ తరగతి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలకు హాజరు కావాలి. తల్లిదండ్రులు విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతగా హాజరయ్యేలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
మరోసారి తగ్గిన బంగారం, వెండి రేట్లు.. నేటి ధరలివే..
Read Latest Telangana News and National News