ఈఈఈతో భవితకు భరోసా..!
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:13 PM
జేఎన్‌టీయూ అంటే ఒక బ్రాండ్.. అందులో బీటెక్ సీటు దొరకడం అంటే గొప్పగా భావిస్తారు. అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ కళాశాలలోని పలు కోర్సుల్లో సీనియర్ ప్రొఫెసర్లతో విద్యాబోధన చేస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.
జేఎన్‌టీయూలో అత్యాధునిక విద్యాబోధన
బీటెక్‌లో చేరే విద్యార్థులకు సువర్ణావకాశం
పెరుగుతున్న ఉద్యోగావకాశాలు
అనంతపురం: జేఎన్‌టీయూ అంటే ఒక బ్రాండ్.. అందులో బీటెక్ సీటు దొరకడం అంటే గొప్పగా భావిస్తారు. అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ కళాశాలలోని పలు కోర్సుల్లో సీనియర్ ప్రొఫెసర్లతో విద్యాబోధన చేస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ కోవలో ముఖ్యమైనది ఈఈఈ కోర్సు. జేఎన్‌టీయూలో 1946లో ఈఈఈ కోర్సును ప్రారంభించారు. మొదట్లో 30 సీట్లతో ప్రారంభమైన ఆ విభాగం 2025లో 60 సీట్లకు చేరుకుంది. ఈ సంవత్సరం 60 నుంచి 120 సీట్లకు సామర్థ్యాన్ని పెంచారు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుండటంతో ఈఈఈకి డిమాండ్ పెరిగినట్లు కనిపిస్తోంది.
నిష్ణాతులైన ప్రొఫెసర్లతో బోధన
జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చేసే విద్యార్థులకు ఈఈఈ కోర్సు ఓ వరంలాంటిదే. ఈ విభాగంలో చేరే విద్యార్థులకు అక్కడ నిష్ణాతులైన ప్రొఫెసర్లు విద్యనందిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీతో విద్యార్థులకు పలు రకాలు కోర్సులపై ప్రత్యేక బోధన చేస్తున్నారు. ఎలక్ర్టికల్ పవర్ సిస్టమ్, పవర్ ఎలక్ర్టానిక్ అండ్ డ్రైవ్స్, కంట్రోల్ సిస్టమ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీస్ సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. ఎంటెక్ విద్యార్థులకు కూడా కీలక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా బోధనాపద్ధతులను నిర్వహిస్తున్నారు.
ల్యాబ్‌లతో ప్రాక్టికల్ నాలెడ్జ్
విద్యార్థులకు కోర్సుల వారిగా క్లాసులు బోధించడంతో పాటు... ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేందుకు పలు రకాల ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఎలక్ర్టికల్ మిషన్, పవర్ ఎలక్ర్టానిక్స్, కంట్రోల్ సిస్టమ్, కంప్యూటర్ ల్యాబ్‌లను అందుబాటులో ఉంచారు. వీటికి తోడు సీమెన్స్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా ఎనర్జీ స్టడీ ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ ఇన్‌స్ర్టుమెంటేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వీటికోసం దాదాపు రూ. 2 కోట్లకుపైగా ఖర్చు చేశారు. ప్రతిరోజూ ఉదయం కోర్సులపై తరగతులు, మధ్యాహ్నం నుంచి 4 గంటల పాటు ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అత్యాధునిక ల్యాబ్‌లు ఉన్నాయి. మరింత అత్యాధునికమైన ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఎన్‌ఏబీఎల్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ ల్యాబోరేటరీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ల్యాబ్ విలువ దాదాపు రూ. 15 కోట్లకుపైగా ఉంది. ఈ ల్యాబ్ వస్తే మరిన్ని పరిశోధనలకు వీలుంటుంది.
మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు
జేఎన్‌టీయూ ఈఈఈ విభాగంలో విద్యనభ్యసించిన విద్యార్థులు అత్యధిక వేతనాలతో స్థిరపడ్డారు. ఏకంగా రూ. కోటికిపైగా వేతనాలు తీసుకుంటున్నారంటే ఇక్కడ విద్య ఏ స్థాయిలో అందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈఈఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ప్లేస్‌మెంట్ల ద్వారా రూ. 10లక్షల నుంచి రూ. 1.07 కోట్ల వరకూ వేతనాలు పొందుతున్నారు. ఇందులో మొదటి వరుసలో 2022లో అనిల్‌చౌదరి అనే విద్యార్థి రూ. 1.07 కోట్ల ప్యాకేజీతో అమెరికాలోని అమెజాన్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2024 సంవత్సరంలో ప్రీతి అనే విద్యార్థిని రూ. కోటి ప్యాకేజీతో అమెరికాలోని సిలికాన్ ల్యాబ్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్‌గా ఉన్నారు. 2023లో చరణ్ అనే విద్యార్థి రూ. 35 లక్షలు, 2022లో చైతన్య అనే విద్యార్థి రూ. 25 లక్షలు, 2024లో మనోజ్ రూ. 20 లక్షలు, 2025లో సాయివర్ధన్ రూ. 20 లక్షలు, 2026లో అరవింద్ నాయక్ రూ. 12 లక్షల చొప్పున అత్యధిక ప్యాకేజీలు తీసుకుంటున్న వారిలో ఉన్నారు.
ప్రొఫెసర్ల బోధనే కీలకం
జేఎన్‌టీయూలో బీటెక్ చేరే సమయంలో పలువురు ప్రొఫెసర్ల సలహాతో ఈఈఈ కోర్సు తీసుకున్నాను. అక్కడ నాలుగేళ్ల పాటు విద్యనభ్యసించడంలో సీనియర్ ప్రొఫెసర్ల బోధన కీలకమయింది. వారు అందించే సూచనలు, ల్యాబ్‌లలో అందించే సలహాలు విలువైనవి. 2022లో పాస్డ్‌అవుట్ అయిన సమయంలో జరిగిన ప్లేస్‌మెంట్‌లో అమెరికాలోని అమెజాన్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాను. రూ. 1.07 కోట్ల ప్యాకేజీ ఉద్యోగం చేస్తున్నాను. ఈఈఈ ప్రొఫెసర్లకు జీవితాంతం రుణపడి ఉంటాను.
అనిల్ చౌదరి, ఈఈఈ, జేఎన్‌టీయూ (2022 పాస్డ్‌అవుట్ విద్యార్థి)
జేఎన్‌టీయూ అంటే బ్రాండ్
జేఎన్‌టీయూ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కళాశాలలో సీటు సాధించాలంటే అదృష్టం ఉండాలి. ఈఈఈ విభాగంలో ఫ్యాకల్టీ, సీనియర్ ప్రొఫెసర్ల బోధన మరువలేనిది. వారందించిన విలువైన సలహాలు, బోధనతోనే ఈ రోజు ఇంత పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం సాధించాను. కళాశాలలో నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో అమెరికాలోని సిలికాన్ ల్యాబ్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్‌గా సెలెక్ట్ అయ్యాను. రూ. కోటి ప్యాకేజీతో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈఈఈలో చక్కగా రాణిస్తే... ఉద్యోగం గ్యారెంటీ.
ప్రీతి, ఈఈఈ, జేఎన్‌టీయూ (2024 పాస్డ్‌అవుట్ విద్యార్థిని)
ఈఈఈతో ఉజ్వల భవిష్యత్తు
ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఏఐ రావడం వల్ల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు పడిపోయాయి. కోర్ బ్రాంచెస్ చదవడం మంచి ఎంపిక. ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ అభివృద్ధి విస్తృతమవుతోంది. క్లీన్ హైడ్రోజన్ ఎనర్జీ, ఎలకిర్టకల్ వెహికల్ మ్యానిఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్ వెహికల్స్, డ్రైవర్ లెస్ వెహికల్స్, బ్యాటరీ మ్యానిఫ్యాక్చరింగ్ అన్ని రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. డేటా సెంటర్స్ పెరుగుతుండటం శుభపరిణామం. కోర్ బ్రాంచ్‌ల వైపు విద్యార్థులు అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. రూ. 15 కోట్ల ఎన్‌ఏబీఎల్ ల్యాబ్‌కు దరఖాస్తు చేశాం. త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఎలకిర్టక్ కుకింగ్ ప్రాజెక్ట్ ఈఈఈ విభాగానికి స్టేట్ ఎనర్జీ కమిషన్ రూ. 86 లక్షలు మంజూరు చేసింది.
సుదర్శనరావు, వీసీ, జేఎన్‌టీయూ
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News