చరిత్ర సృష్టించిన విండీస్ బౌలర్.. వరుసగా ఐదు ఓవర్లు మెయిడిన్లు.. ఐదు వికెట్లు
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:08 PM
పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ పేస్ ఆల్‌రౌండర్ ఒక్క పరుగూ ఇవ్వకుండా.. వరుసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు.
స్పోర్ట్స్ డెస్క్: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ అదిరిపోయే బౌలింగ్‌తో ప్రపంచ రికార్డును సృష్టించాడు. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో తన తొలి ఐదు ఓవర్లలో గ్రీవ్స్ 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. అయితే తన సెకండ్ స్పెల్‌లో మాత్రం అద్భుతం చేశాడు.
గ్రీవ్స్.. తన రెండో స్పెల్‌లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా వరుసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో వరుసగా ఐదు ఓవర్లు మెయిడిన్ చేసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2016లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ నెలకొల్పిన వరుసగా నాలుగు వికెట్ల మెయిడిన్ల రికార్డును తాజాగా గ్రీవ్స్ అధిగమించాడు. అలానే టెస్టుల్లో గ్రీవ్స్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు ఆలౌటైంది. 244/4 స్కోరుతో ఉండగా తన రెండో స్పెల్‌ను ప్రారంభించిన జస్టిన్ గ్రీవ్స్.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన వరుస ఐదు ఓవర్లలో షాన్ మసూద్ (109), ఆమీర్ జమాల్ (3), అలీ ఉస్మాన్ (0), మహ్మద్ రిజ్వాన్ (12), మహ్మద్ అబ్బాస్ (0)లను పెవిలియన్‌కు పంపాడు.
భారీ స్కోరు చేసేలా కనిపించిన పాక్.. గ్రీవ్స్ దెబ్బకు తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. కరేబియన్ బౌలర్లలో కేమర్ రోచ్, షామర్ జోసెఫ్ చెరో రెండు వికెట్లు సాధించగా.. జేడెన్ సీల్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 126/7తో నిలిచి 155 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో కేమర్ రోచ్(5*), షామర్ జోసెఫ్(23) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ
తండ్రి బాటలో తనయుడి విజయం.. కామన్వెల్త్‌లో తెలుగుకుర్రాడికి రజతం