తండ్రి బాటలో తనయుడి విజయం.. కామన్వెల్త్‌లో తెలుగుకుర్రాడికి రజతం
ABN , Publish Date - Jul 28 , 2026 | 09:16 AM
ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఓ వ్యక్తి కాంస్య పతకంతో దేశ కీర్తిని పెంచాడు. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే కామన్వెల్త్ వేదికపై ఆయన తనయుడు రజత పతకంతో సంచలనం సృష్టించాడు. ఎవరంటే..
స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ వేదికగా 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి కాంస్య పతకంతో దేశ కీర్తిని పెంచితే.. సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే కామన్వెల్త్ వేదికపై తనయుడు రజత పతకంతో సంచలనం సృష్టించాడు. పురుషుల 79 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ్ బాబు రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అజయ్ బాబు మొత్తం 330 కేజీల బరువును (స్నాచ్‌లో 149 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీలు) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. కేవలం ఒక్క కేజీ తేడాతో మలేషియాకు చెందిన ఎర్రీ హిదాయత్ మహమ్మద్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ ముర్రే (325 కేజీలు) కాంస్యం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్2026లో ప్రస్తుతం భారత్‌కు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇది ఆరో పతకం కావడం విశేషం.
అజయ్ బాబు స్వగ్రామం విజయనగరం జిల్లాలోని కొండవెలగాడ గ్రామం. ఇతని తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్ కావడం గమనార్హం. శ్రీనివాసరావు 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ (56 కేజీల విభాగం)లో కాంస్యం గెలిచాడు. తండ్రి అందించిన శిక్షణతో ముందుకు సాగిన అజయ్ బాబు.. తండ్రి సాధించిన పతకం కంటే ఒక అడుగు ముందుకేసి రజతం సాధించి తెలుగు నేల కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాడు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన షర్మిల.. పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
మరో కొత్త టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్.. పూర్తి వివరాలు ఇవే