Share News

చరిత్ర సృష్టించిన షర్మిల.. పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

ABN , Publish Date - Jul 28 , 2026 | 08:34 AM

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పారా అథ్లెట్ షర్మిల ధన్‌ఖడ్ చరిత్ర సృష్టించింది. మహిళా షాట్‌పుట్ విభాగంలో స్వర్ణం పతకం సాధించింది. దీంతో కామన్వెల్త్ గేమ్ లో పారా అథ్టెటిక్స్ విభాగంలో స్వర్ణం అందించిన తొలి భారత క్రీడాకారిణిగా షర్మిల అరుదైన ఘనత సాధించింది.

చరిత్ర సృష్టించిన షర్మిల..  పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

స్పోర్ట్స్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత్ అథ్లెట్స్ తాజాగా మరికొన్ని మెడల్స్ సాధించారు. పారా అథ్లెట్ షర్మిల ధన్‌ఖడ్ స్వర్ణం పతకం సాధించింది. ఐదో రోజు భారత అథ్లెట్లు ఏకంగా 6 పతకాలను (1 స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలు) కొల్లగొట్టారు. దీంతో భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 10కి చేరింది.


ఐదో రోజు ఆటకు ప్రధాన ఆకర్షణగా మహిళల పారా అథ్లెటిక్స్ నిలిచింది. షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో షర్మిలా ధన్‌ఖడ్ 9.81 మీటర్ల సీజన్ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని ముద్దాడింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించింది. ఇదే ఈవెంట్‌లో నైజీరియాకు చెందిన యుచారియా డిస్‌క్వాలిఫై అవ్వడంతో, నాలుగో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్ శిల్పా షైలాకు కాంస్యం దక్కింది. దీంతో ఈ గేమ్‌లో భారత్‌కు తొలిసారి ఒకే వేదికపై రెండు పతకాలు దక్కడం విశేషం.


మరోవైపు, పురుషుల హైజంప్‌లో జాతీయ రికార్డు హోల్డర్ సర్వేశ్ కుషారే కొత్త అధ్యాయం లిఖించాడు. 2.25 మీటర్ల ఎత్తును అధిగమించి, కామన్వెల్త్ గేమ్స్ హైజంప్‌లో రజతం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. వీరితో పాటు జ్ఞానేశ్వరి యాదవ్, వల్లూరి అజయ్ బాబు రజత పతకాలు సాధించగా, వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని దేశానికి అందించింది.


ఇప్పటి వరకు కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాల వివరాలు:

బంగారం:

  • మీరాబాయి చాను, వెయిట్‌లిఫ్టింగ్ (మహిళల 48 కేజీలు)

  • షర్మిల ధన్‌ఖడ్, పారా అథ్లెటిక్స్ (మహిళల షాట్ పుట్ F57)

వెండి:

  • రిషికాంత సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ (పురుషుల 60 కేజీలు)

  • ముత్తుపాండి రాజా, వెయిట్‌లిఫ్టింగ్ (పురుషుల 65 కేజీలు)

  • జ్ఞానేశ్వరి యాదవ్, వెయిట్‌లిఫ్టింగ్ (మహిళల 53 కేజీలు)

  • వల్లూరి అజయ్ బాబు, వెయిట్‌లిఫ్టింగ్ (పురుషుల 79 కేజీలు)

  • సర్వేశ్ కుషారే, అథ్లెటిక్స్ (పురుషుల హై జంప్)

కాంస్యం:

  • ఝండు కుమార్, పారా పవర్‌లిఫ్టింగ్ (పురుషుల హెవీవెయిట్)

  • బింద్యారాణి దేవి, వెయిట్‌లిఫ్టింగ్ (మహిళల 58 కేజీలు)

  • శిల్పా షైలా, పారా అథ్లెటిక్స్ (మహిళల షాట్ పుట్ F57)


ఇవి కూడా చదవండి:

మరో కొత్త టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్.. పూర్తి వివరాలు ఇవే!

లిఫ్టర్ల దూకుడు

Updated Date - Jul 28 , 2026 | 08:59 AM