Share News

కుటుంబ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ ఉంటే.. ఓటుకు ఢోకా లేదు..!

ABN , Publish Date - Jul 28 , 2026 | 08:30 AM

రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) జరుగుతున్న నేపథ్యంలో.. కుటుంబాలవారీగా కచ్చితమైన వివరాలు ఉండాల్సిన అవసరంపై చర్చ జరుగుతోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను రూపొందించేందుకు.. దాని ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్ల (ఎఫ్‌ఆర్‌సీ) జారీకి సిద్ధమైంది.

కుటుంబ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ ఉంటే.. ఓటుకు ఢోకా లేదు..!
Family Register Certificate

  • తెలంగాణ కుటుంబ రిజిస్టర్‌ను రూపొందించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. జీవో 172 విడుదల

  • ‘మీ సేవ’ ద్వారా.. 2 రోజుల్లో ధ్రువీకరణ పత్రం

  • సర్టిఫికెట్‌ పొందడానికి రేషన్‌ కార్డే ఆధారం

  • ఆ కార్డు లేకుంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే

  • రేషన్‌ కార్డ్‌ నంబరే ఎఫ్‌ఆర్‌సీ గుర్తింపు సంఖ్య

  • ఆస్తిహక్కులకు, వారసత్వానికి ఈ సర్టిఫికెట్‌

  • ఆధారం కాదని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో!


హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) జరుగుతున్న నేపథ్యంలో.. కుటుంబాలవారీగా కచ్చితమైన వివరాలు ఉండాల్సిన అవసరంపై చర్చ జరుగుతోంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను రూపొందించేందుకు.. దాని ఆధారంగా ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్ల (ఎఫ్‌ఆర్‌సీ) జారీకి సిద్ధమైంది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది ఓటర్లకు ఊరటనిచ్చే నిర్ణయం. ఎందుకంటే.. ‘సర్‌’లో ఓటర్ల ధ్రువీకరణకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ గుర్తిస్తున్న 12 పత్రాల్లో ఎఫ్‌ఆర్‌సీ కూడా ఒకటి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇప్పటికే వివిధ పేర్లతో ఈ తరహా ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ లేకపోవడంతో.. ఏ పత్రాలూ లేని కొన్ని కుటుంబాలు ‘సర్‌’ ప్రక్రియలో ఓటుకు దూరమయ్యే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.


రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఉన్న సభ్యులందరి వివరాలను ఎలకా్ట్రనిక్‌ విధానంలో నమోదు చేయడం, అలా ఒకే చోటుకు తేవడం ద్వారా ప్రభుత్వ సేవలను వేగవంతం చేయడం, వివిధ శాఖలకు ఒకే ప్రామాణిక కుటుంబ రికార్డును అందుబాటులో ఉంచడం లక్ష్యంగా.. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ పేరుతో ఎలకా్ట్రనిక్‌ కుటుంబ రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ(సర్వీసెస్‌-2) శాఖ సోమవారం జీవో 172 జారీ చేసింది. దీంతో ఇకిపై కుటుంబ వివరాల ధ్రువీకరణకు ‘మీసేవ’ కేంద్రాల ద్వారా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ను పొందే వీలుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో.. ఒక కుటుంబానికి సంబంధించిన వివరాలు వివిధ ప్రభుత్వ శాఖల్లో వేర్వేరుగా నమోదై ఉంటున్నాయి. దీనివల్ల ధ్రువీకరణ సమస్యలు ఎదురవుతున్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య, సంబంధాలు, చిరునామా వంటి వివరాల విషయంలో ఏకరీతి లేకపోవడం వల్ల అనేక సేవల మంజూరులో ఆలస్యం జరుగుతోంది. ఫ్యామిలీ రిజిస్టర్‌తో ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా అందించవచ్చని సర్కారు భావిస్తోంది.


రేషన్‌కార్డ్‌ ఉంటే..

ఫ్యామిలీ రిజిస్టర్‌ రూపొందించేందుకు కొత్త సర్వే చేపట్టకుండా, ప్రస్తుతంపౌరసరఫరాల శాఖ నిర్వహిస్తున్న ఆహార భద్రత కార్డు(రేషన్‌కార్డు) డేటాబే్‌సను ఆధారంగా తీసుకుంటారు. రేషన్‌కార్డులో నమోదైన కుటుంబ వివరాలనే..ఎలకా్ట్రనిక్‌ విధానంలో ఫ్యామిలీ రిజిస్టర్‌లో నమోదుచేస్తారు. రేషన్‌కార్డు నంబరునే ఫ్యామిలీ రిజిస్టర్‌ గుర్తింపు సంఖ్యగా పరిగణిస్తారు. ఏదైనా కుటుంబానికి రేషన్‌కార్డు లేకపోతే ఆ కుటుం బం ఫ్యామిలీ రిజిస్టర్‌లో నమోదు కోసం రేషన్‌ కార్డు తీసుకోవడం తప్పనిసరని అధికారులు చెబుతున్నారు.

రిజిస్టర్‌లో ఉండే వివరాలు ఇవే

కుటుంబ రిజిస్టర్‌ గుర్తింపు సంఖ్య( రేషన్‌కార్డు నంబరు), కుటుంబ పెద్ద పేరు, కుటుంబంలోని సభ్యుల పేర్లు, కుటుంబ పెద్దతో వారి బంధం, ప్రతి సభ్యుడి వయసు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్‌ సంఖ్య, ఇంటి నంబర్‌, వీధి, గ్రామం/ వార్డు, గ్రామ పంచాయతీ/ మునిసిపాలిటీ, మండలం, జిల్లా తదితర వివరాలుంటాయి.

ఏయే రాష్ట్రాల్లో ఉందంటే..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సమగ్ర కుటుంబ రిజిస్టర్‌ (ఫ్యామిలీ ఐడీ) విధానం అమల్లో ఉంది. హరియాణాలో పరివార్‌ పెహచాన్‌ పత్రపీపీపీ), కర్ణాటకలో కుటుంబ, ఉత్తర ప్రదేశ్‌లో ఫ్యామిలీ ఐడీ(ఏక్‌ పరివార్‌ ఏక్‌ పెహచాన్‌), మధ్య ప్రదేశ్‌లో సమగ్ర ఫ్యామిలీ ఐడీ, రాజస్థాన్‌లో జన ఆధార్‌, పంజాబ్‌లో ఫ్యామిలీ ఐడీ పేరుతో ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఒక కుటుంబం- ఒక గుర్తింపు అన్న నినాదంతో చాలా రాష్ట్రాలు ఈ కుటుంబ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నాయి. తాజాగా తెలంగాణ సర్కారు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధం కావడాన్ని వివిధ రాజకీయ పార్టీలు స్వాగతించాయి. ‘సర్‌’ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌సీలు జారీ చేయాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన మజ్లిస్‌ అధినేత ఒవైసీ.. సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనిపై సకాలంలో నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

తుంగభద్రలో పూడికతీతపై ఉప కమిటీ

బైబ్యాక్‌, ప్రీ లాంచ్‌ ప్లాట్ల పేరుతో మోసం

Updated Date - Jul 28 , 2026 | 08:30 AM