తుంగభద్రలో పూడికతీతపై ఉప కమిటీ
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:10 AM
తుంగభద్ర జలాశయంలో పూడికతీతపై ఉప కమిటీ వేయాలని తుంగభద్ర హైపవర్ కమిటీ నిర్ణయించింది. తుంగభద్ర బేసిన్‌లో సమస్యల పరిష్కారం కోసం వేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం వర్చువల్‌గా సమావేశమైంది.
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర జలాశయంలో పూడికతీతపై ఉప కమిటీ వేయాలని తుంగభద్ర హైపవర్ కమిటీ నిర్ణయించింది. తుంగభద్ర బేసిన్‌లో సమస్యల పరిష్కారం కోసం వేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం వర్చువల్‌గా సమావేశమైంది. కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) సభ్యుడు యోగేశ్ పైథాంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నుంచి ఈఎన్‌సీ (జనరల్) రమేశ్ బాబు, ఏపీ ఈఎన్‌సీ(ఇరిగేషన్) నర్సింహామూర్తి, కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి బీఎస్ శివకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుంగభద్ర జలాశయంలో పూడికతీతపై ఉప కమిటీ వేయాలని సభ్యులందరూ కోరగా.. ఆ దిశగా చర్యలు తీసుకోవాని సమావేశం నిర్ణయించింది. కాగా, సమావేశంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణపై నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాలని తెలంగాణ కోరింది. ఆర్డీఎస్‌లో తెరిచి ఉంచిన స్లూయిస్‌ను, కన్‌స్ట్రక్షన్ స్లూయిస్‌ను మూసివేయాలని, పూడికతీత చేపట్టాలని, ఆర్డీఎస్ కట్ట ఎత్తు పెంచాలని విన్నవించింది. 15 రోజుల్లో కమిటీ విధివిధానాలపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తామని తెలంగాణ నివేదించగా... ఇతర రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. తదుపరి సమావేశం ప్రత్యక్ష విధానంలో జరగాలని కోరగా... దీనికి అంగీకారం కుదిరిం ది.
తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునికీకరణపై మూడు రాష్ట్రాల అధికారులతో కలిపి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఇటీవలే తుంగభద్ర జలాశయం 33 గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా తుంగభద్ర రిజర్వాయర్‌లో పూడికతీత, నావలి రిజర్వాయర్, ఆర్డీఎస్‌పై మూడు రాష్ట్రాల సీఎంలతో జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమావేశం కావడమే కాకుండా... ఒక కమిటీ వేసి, అధ్యయనం అనంతరం నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి
బ్యారేజీల్లో నీళ్లు నింపాలా? వద్దా?