కృష్ణా జలాలపై యథాతథ స్థితి
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:01 AM
కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య నడుస్తున్న సుదీర్ఘ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) ఉత్తర్వులను అధికారిక గెజిట్‌లో ప్రచురించేలా ఆదేశాలివ్వాలని, 2011 నాటి మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే ఎత్తివేయాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
సాంకేతిక, న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి..
హడావుడిగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
కర్ణాటక వాదనలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
సెప్టెంబరు మొదటివారానికి విచారణ వాయిదా
న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య నడుస్తున్న సుదీర్ఘ వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) ఉత్తర్వులను అధికారిక గెజిట్‌లో ప్రచురించేలా ఆదేశాలివ్వాలని, 2011 నాటి మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే ఎత్తివేయాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ కేసులో కృష్ణా జలాలపై యథాతథ స్థితే (స్టేటస్ కో) కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై లోతైన, విస్తృత స్థాయి విచారణ అవసరమని పేర్కొంటూ తదుపరి విచారణను సెప్టెంబరు మొదటి వారానికి వాయిదా వేసింది.
కృష్ణా జల వివాదానికి సంబంధించి 'ఏపీ వర్సెస్ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, కేంద్రం ప్రభుత్వం' పిటిషన్‌ను సోమవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. కర్ణాటక తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కర్ణాటకకు 173 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని తెలిపారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్-3 కింద కాలువలు సహా ఇతర పనుల కోసం ఇప్పటికే రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు. అయితే, గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల తాము నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని తీవ్ర కరువు ప్రాంతాలైన కలబుర్గి, యాదగిరి, రాయచూర్ తదితర జిల్లాలకు నీటి వనరులు ఎంతో అవసరమని, వీటన్నింటిని పరిశీలించి 2011 నాటి మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని ధర్మాసనం ఎదుట విజ్ఞప్తి చేశారు.
ఇదొక అంతర్రాష్ట్ర జల వివాదమని, ఈ కేసులో అనేక న్యాయ, సాంకేతికమైన అంశాలు ఇమిడి ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అప్పీళ్లు, వాదనల్ని సైతం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మధ్యంతర ఉత్తర్వులను ఇప్పటికిప్పుడే అత్యవసరంగా, హడావుడిగా ఎత్తివేయడం, సవరించడం సాధ్యం కాదని తెలిపింది. ' కేసులో తీర్పు చెప్పకుండా నేను పదవీ విరమణ చేయను. సెప్టెంబరు మొదటి వారంలో దీనికి సంబంధించి తదుపరి విచారణ చేపడతాం. ప్రస్తుతం ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నాను. అయితే, ఈ కేసు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఉన్నందున.. సాధ్యమైనంత త్వరగా విచారించేలా మరో బెంచ్‌కు కేటాయిస్తాం' అని సీజేఐ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణలో వరల్డ్ స్కిల్ ల్యాబ్ నెలకొల్పండి
బ్యారేజీల్లో నీళ్లు నింపాలా? వద్దా?