తెలంగాణలో వరల్డ్ స్కిల్ ల్యాబ్ నెలకొల్పండి
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:49 AM
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర శక్తి(కార్మిక, ఉపాధి కల్పన), గనుల శాఖ మంత్రి జి.వివేక్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
తాడిచెర్ల-2 బొగ్గు గని పనుల్లో వేగం పెంచండి
కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి వివేక్ వినతి
న్యూఢిల్లీ, హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర శక్తి(కార్మిక, ఉపాధి కల్పన), గనుల శాఖ మంత్రి జి.వివేక్ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, గనుల పురోగతి, మౌలిక వసతుల విస్తరణ, కార్మిక సంక్షేమం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ క్రమంలో తెలంగాణలో ‘వరల్డ్ స్కిల్ ల్యాబ్’ ఏర్పాటు చేయాలని, యువతకు త్రిభాషా విధానంలో భాగంగా జర్మన్, జపనీస్ వంటి అంతర్జాతీయ భాషలను నేర్పించాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను విస్తరించాలని.. కేంద్ర నైపుణ్యాభివృద్థి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ.. భూమి కేటాయిస్తే రాష్ట్రంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు వివేక్ తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి.. రామగుండంలో మంజూరైన 100 పడకల ఈఎ్‌సఐ ఆసుపత్రికి త్వరగా జీవో జారీ చేయాలని కోరారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని కలిసిన వివేక్.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులో స్థానిక యువతకు కనీసం 1000 ఉద్యోగాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు..