బ్యారేజీల్లో నీళ్లు నింపాలా? వద్దా?
ABN , Publish Date - Jul 28 , 2026 | 07:43 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నింపాలో, వద్దో తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను, జాతీయ ఆనకట్టల భద్రత సంస (ఎన్‌డీఎస్ఏ)ను కోరింది. ఈ బ్యారేజీలను వానాకాలంలో ఫ్రీ ఫ్లో కండిషన్‌లో (వచ్చిన వరద వచ్చినట్లే వెళ్లేలా గేట్లు తెరిచి) ఉంచాలా? లేక నీటిని నింపాలా? అనే దానిపై సాంకేతిక సలహాలు ఇవ్వాలంటూ లేఖలు రాసింది.
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నింపాలో, వద్దో తెలపాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను, జాతీయ ఆనకట్టల భద్రత సంస (ఎన్‌డీఎస్ఏ)ను కోరింది. ఈ బ్యారేజీలను వానాకాలంలో ఫ్రీ ఫ్లో కండిషన్‌లో (వచ్చిన వరద వచ్చినట్లే వెళ్లేలా గేట్లు తెరిచి) ఉంచాలా? లేక నీటిని నింపాలా? అనే దానిపై సాంకేతిక సలహాలు ఇవ్వాలంటూ లేఖలు రాసింది. ప్రాణహిత నదికి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో బ్యారేజీల్లో నీటిని నింపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే బ్యారేజీల్లో నీటిని నింపాలా, వద్దా అన్నది రాష్ట్రప్రభుత్వం చేతిలోనే ఉందని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి, ఎన్‌డీఎస్ఏకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అన్నారం బ్యారేజీ కింద ఊహించిన దానికన్నా ఎక్కువ రంధ్రాలు ఉన్నట్లు కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) పరీక్షల నివేదికల్లో తేలడంతో ఆ నివేదికను కూడా లేఖకు జత చేశారు. ఈ బ్యారేజీలో అనుకున్నదానికన్నా ఎక్కువ సీపేజీ వచ్చే అవకాశం ఉందని, రంధ్రాలు చాలా చోట్ల కనిపించాయని నివేదిక తేల్చడంతో.. ఇందులో నీటి నిల్వ ఏమాత్రం సురక్షితం కాదని లేఖలో తెలంగాణ పేర్కొంది.
అత్యధిక లోపాలు అన్నారం బ్యారేజీలోనే ఉండటంతో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా.. ఆ తర్వాత రెండు రోజులకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. అయితే ఈ బ్యారేజీలను పరిశీలించిన ఎన్‌డీఎస్ఏ కమిటీ.. బ్యారేజీలను ప్రధానంగా వానాకాలంలో ఫ్రీ ఫ్లో కండిషన్‌లో ఉంచాలని సిఫారసు చేసింది. దీంతో ఈ పత్రాలను కూడా లేఖలకు ప్రభుత్వం జత చేసింది. ఎల్‌నినో ప్రభావంతో వానలు లేకపోవడంతో ప్రాజెక్టుల కింద సాగునీటిని ఇప్పటికిప్పుడు ఇవ్వరాదని సర్కారు గతంలోనే నిర్ణయించింది. అయితే ప్రధాన గోదావరితో పోలిస్తే.. ప్రాణహితకు భారీగా వరద వస్తుండటంతో ఆ వరదను పంపులు ఆన్ చేసి, అన్నారం, ఆ తర్వాత అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి తరలించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే నిపుణులతో సమావేశమయ్యారు.
కన్నెపల్లి వద్ద 5.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే పంపింగ్ సాధ్యమని, అలాకాకుండా తక్కువ వరదకు మోటార్లు ఆన్ చేయలేమని, దీనివల్ల పంపులు దెబ్బతింటాయని నివేదించారు. ఆ తర్వాత అధికారులతో సమావేశమై.. బ్యారేజీల్లో నీటి నిల్వ చేయాలా? వద్దా? అనే దానిపై కేంద్ర జలశక్తి శాఖ, ఎన్‌డీఎస్ఏకు లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కేంద్రానికి లేఖ రాశారు. అవసర మైతే ఒక కమిటీని పంపించాలని, బ్యారేజీలను, నివేదికలను పరిశీలించి తగిన సాంకేతిక సహాయం అందించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణలో వరల్డ్ స్కిల్ ల్యాబ్ నెలకొల్పండి
డైటీషియన్ పోస్టులకు మోక్షమెప్పుడు..?