మాట తప్పితే తిరిగి మంటలే!
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:28 AM
కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) నాయకులు ఆరోపించారు. అసోం, పశ్చిమబెంగాల్, బిహార్‌ల్లో...
అరెస్టు చేసిన విద్యార్థులను మంగళవారం కల్లా విడుదల చేయాలి.. విద్యార్థులపై కేసులను ఎత్తి వేయాలి
కేంద్రానికి కాక్రోచ్ నేతల హెచ్చరిక
నమ్మక ద్రోహాన్ని సహించబోమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని కాక్రోచ్ జనతాపార్టీ(సీజేపీ) నాయకులు ఆరోపించారు. అసోం, పశ్చిమబెంగాల్, బిహార్‌ల్లో విద్యార్థులను, ఇతర ఆందోళనకారులను పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలు అందుతున్నాయని ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లను రద్దుచేసుకుని వారందరినీ విడుదల చేయాలని, చర్చల సందర్భంగా తమకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఇతర హామీలను కూడా మంగళవారం లోపు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాక్రోచ్‌లు తిరిగి ఉద్యమిస్తాయని సౌరవ్ హెచ్చరించారు. నమ్మక ద్రోహాన్ని యువత సహించబోదని తన ‘ఎక్స్’ ఖాతాలో ఆయన స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఉద్యమించిన యువతపై చర్యలు ఉండవని, ఎన్డీయే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులకు గురిచేయడం జరగదని కేంద్ర ప్రభుత్వం చర్చల సందర్భంగా హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హామీలను కేంద్రం నెరవేర్చాలని, ఈ దిశగా కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డా చొరవ చూపాలని కోరారు. తిరిగి తాము ఉద్యమించే పరిస్థితి కల్పించొద్దని అశుతోశ్ రంకా అన్నారు. కేసులు నమోదైన విద్యార్థులు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని, వారి కోసం ఇప్పటికే న్యాయ ప్రక్రియ మొదలయిందని సౌరవ్‌దాస్ తెలిపారు. ‘‘సమర్థులైన న్యాయవాదులతో మా పార్టీ న్యాయ విభాగం సంప్రదింపులు ప్రారంభించింది’’ అని ఆయన తెలిపారు. కాగా, ‘నీట్’ ఆందోళనల్లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న, అరెస్టయి జైళ్లకు పోయిన విద్యార్థులు, ఇతర ఆందోళనకారులకు అండగా కాక్రోచ్ జనతాపార్టీ ‘సాక్షి’ పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. న్యాయపోరాటంలో విద్యార్థులకు కలిసివచ్చే డిజిటల్ ఆధారాలను సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈ సందర్భంగా కాక్రోచ్ నేతలు కోరారు. ఇదిలా ఉండగా, బిహార్‌లో ఆందోళనల సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ప్రకటించింది.
లద్దాఖ్‌కు వాంగ్ చుక్
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా నిరశన దీక్ష చేసిన ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని సోమవారం దర్శించి, నివాళులు అర్పించారు. శాంతి పంథాలో సాగే ఏ పోరాటమైనా నిరుపయోగంగా ముగియబోదని వాంచ్ చుక్ అన్నారు. కొంచెం ఆలస్యం అయినా, అంతిమంగా శాంతి మార్గమే జయిస్తుందనేది ‘నీట్’ ఉద్యమం రుజువు చేసిందన్నారు. ఓపిగ్గా, శాంతియుతంగా ఉద్యమించిన విద్యార్థులను అభినందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం భార్య గీతాంజలితో కలిసి స్వస్థలం లద్దాఖ్‌కు ఆయన తిరిగి వెళ్లారు.
సీజేపీ ఆందోళనలో కరడుగట్టిన నేరగాళ్లు
పేపర్‌లీక్‌లకు నిరసనగా కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన ఆందోళనలో.. సందట్లో సడేమియాలా కరడుగట్టిన పాత నేరగాళ్లు దూరారు! ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అత్యాచారం, హత్య, కిడ్నాప్, దొంగతనం, మాదకద్రవ్యాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్న 989 మందిని ఈ ఆందోళనల్లో గుర్తించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాల అంతర్గత నివేదిక ద్వారా తెలుస్తోంది. దాని ప్రకారం.. జంతర్ మంతర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 100 సీసీటీవీ కెమెరాలను, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలను జల్లెడ పట్టిన పోలీసులు మొత్తం 2,873 మంది వివరాలను గుర్తించగలిగారు. అందులో ఈ 989 మంది క్రిమినల్స్ కూడా ఉన్నారు. వారిలో 101 మందిపై హత్య కేసులు ఉండగా.. 62 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 284 మందిపై దోపిడీ, దొంగతనం కేసులు.. 61 మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయి. ఆరుగురు పోక్సో కేసుల్లో నిందితులు కాగా.. 25 మంది మహిళలపై వేధింపుల కేసుల్లో నిందితులు. 19 మందిపై కిడ్నాప్ కేసులు, 67 మందిపై మత్తుపదార్థాల నిరోధక చట్టం కింద నమోదైన కేసులు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News