‘ఆమె’కు అండగా జీఆర్‌సీలు!
ABN , Publish Date - Jul 28 , 2026 | 10:19 AM
తెలంగాణలో ఏదో ఒక చోట చిన్నారులు, మహిళలపై దారుణాలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపులు వంటి జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో జెండర్ రిసోర్స్ సెంటర్ల(జీఆర్‌సీల)ను ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లోనే కాదు... గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏ ఒక్కరికి ఆపద వచ్చినా... జీఆర్‌సీ సభ్యులంతా తామున్నామనే భరోసా కల్పిస్తూ అండగా నిలవనున్నారు.
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏదో ఒక చోట చిన్నారులు, మహిళలపై దారుణాలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపులు వంటి జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో జెండర్ రిసోర్స్ సెంటర్ల(జీఆర్‌సీల)ను ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లోనే కాదు... గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏ ఒక్కరికి ఆపద వచ్చినా... జీఆర్‌సీ సభ్యులంతా తామున్నామనే భరోసా కల్పిస్తూ అండగా నిలవనున్నారు. బాధితురాలికి రక్షణ కల్పించడంతోపాటు చట్టప్రకారం న్యాయం దక్కేలా అవసరమైన మార్గదర్శనం చేస్తారు. ఆపద సమయంలో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి అన్నీ తామై వ్యవహరించి.. భరోసా కల్పించనున్నారు.
వేధింపులు, గృహ హింస వంటి ఘటనల్లో బాధితులకు సహాయం చేసేందుకు భరోసా, సఖి వంటి ప్రభుత్వ విభాగాలు ఉన్నప్పటికీ మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సహాయం అందడం లేదన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లోని ప్రతి మహిళకు తామున్నామనే భరోసా కల్పించే విధంగా జీఆర్‌సీ సభ్యులు పని చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 553 జీఆర్‌సీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా... 143 కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఒక్కో కేంద్రం నిర్వహణకు ప్రతి మూడేళ్లకు ఒక సారి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. వీటితోపాటు సీఎస్ఆర్ నిధులు, ఇతర విరాళాలతో జీఆర్‌సీ కేంద్రాలు నిర్వహించనున్నారు. కేవలం లింగ వివక్షకే పరిమితం కాకుండా మహిళా భద్రత, ఉపాధి, ఆర్థిక సాధికారతకోసం జీఆర్‌సీలు పని చేయనున్నాయి.
సెర్ప్, మెప్మా, మహిళా శిశు సంక్షేమ, పోలీస్ శాఖలతో జీఆర్‌సీ సభ్యులు సమన్వయం చేసుకుని పనిచేస్తారు. జిల్లా కేంద్రం, మండలాలు, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, తండాలు... ఇలా ఎక్కడికక్కడ మహిళలు, యువతులు ఎదుర్కొనే సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. జీఆర్‌సీ సభ్యులుగా స్థానికులకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం కానున్నాయి. అయితే... బాధితులు తమను ఆశ్రయించినప్పుడు ఏయే అంశాలపై వివరాలు సేకరించాలి? సమస్య పరిష్కారానికి ఎవరి దృష్టికి తీసుకెళ్లాలి? అనే దానిపై జీఆర్‌పీ సభ్యులకు జిల్లాల వారీగా శిక్షణ ప్రారంభమైంది. ఏ సమస్యను ఏ ప్రభుత్వ విభాగం దృష్టికి తీసుకెళ్లాలి? తండాలు, గ్రామాల్లో స్థానిక పెద్దల ప్రమేయం, పాత్ర సమస్య పరిష్కారంలో ఎంత వరకు ఉంటుంది? అనే అంశాలపైనా జీఆర్‌పీ సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు.
అత్యధిక గృహహింస కేసులు ఇక్కడే
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా ప్రకారం తెలంగాణలో పెళ్లి అయిన మహిళల్లో 37.2శాతం మంది గృహహింసను ఎదుర్కొంటున్నారు. ఈ సర్వే ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో గృహహింస కేసులు తెలంగాణలోనే అత్యధికంగా నమోదు అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. నివేదిక ప్రకారం గ్రామీణ మహిళల్లో 33శాతం మంది గృహహింస ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇది 24.8 శాతంగా ఉంది. బాధితుల్లో 71శాతం మంది సామాజిక అవమానం, వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం, ఆర్థికంగా ఇతరులపై ఆధారపడడం వల్ల నోరు విప్పడం లేదు. బాధితుల్లో కేవలం 8శాతం మంది మాత్రమే సహాయం, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గృహహింసతోపాటు ఇతర వేధింపులు, హింసకు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించేందుకు జీఆర్‌సీలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవి మహిళల హక్కులపై అవగాహన పెంచడంతోపాటు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో సమస్యలను పరిష్కరించేందుకు పని చేయనున్నాయి.
వారధిలా పని చేయనున్న జీఆర్‌సీలు
స్వయం సహాయక సంఘాల సభ్యులే జీఆర్‌సీలో సభ్యులుగా ఉంటారు. బాధితులకు న్యాయం అందించేందుకు చట్టబద్ధంగా ఏర్పడ్డ సంస్థలకు, బాధితులకు మధ్య జీఆర్‌సీలు వారధిగా పని చేస్తాయి. బాధితులకు అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా సాయం అందిస్తారు. చివరికి వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటారు. జిల్లా మొత్తంలో ఒకే సఖి కేంద్రం ఉండటంతో చాలా మందికి అక్కడికి వెళ్లాలని కూడా తెలియని పరిస్థితి. కానీ జీఆర్‌సీలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సంఘంలో గ్రామం నుంచి ఒక ప్రతినిధి జీఆర్‌సీలో సభ్యులుగా ఉంటారు. అందువల్ల ప్రతి గ్రామంలో జరుగుతున్న పరిణామాలు జీఆర్‌సీకి తెలుస్తాయి.
- దివ్య దేవరాజన్, సెర్ప్ సీఈవో
బాధితులకు సత్వర న్యాయం
జీఆర్‌సీల ఏర్పాటుతో వికారాబాద్ తరహా ఘటనలకు ఆస్కారం ఉండదు. పోక్సో కేసులో నిందితుడికి బెయిల్ వచ్చిందన్న విషయం ముందుగా జీఆర్‌సీ సభ్యులకు తెలుస్తుంది. వారు బాధిత చిన్నారికి రక్షణ వలయంగా నిలిచి, ప్రమాదం ఉందని గ్రహిస్తే పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇప్పటికే ఉన్న కమిషన్లకు అనుబంధంగా జీఆర్‌సీలను చట్టబద్ధం చేయడం వల్ల బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది.
- జమున, జెండర్ యూనిట్ సలహాదారు
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం రేవంత్‌రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్: రాంచందర్‌రావు
ప్రసిద్ధ పోచమ్మ ఆలయంలో చోరీ.. బంగారు, వెండి నగలతో పాటు హుండీ అపహరణ