ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళ్ మిలన్ సమావేశం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై చర్చ..
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:38 PM
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ (మంగళవారం) పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ 'మంగళ్ మిలన్' సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (సవరణ) బిల్లు-2026' ఆమోదంపై వ్యూహాన్ని ఖరారు చేశారు. పేపర్ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు ఈ బిల్లులో కఠిన నిబంధనలు ప్రతిపాదించారు. నేరస్థులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించడంతో పాటు, కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించినట్లు సమావేశంలో చర్చించారు. ఇక భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూటమి ఎంపీలకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. భారత ఎగుమతుల పెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల విస్తరణలో ఈ ఒప్పందాలు కీలకంగా మారాయని ఆయన పేర్కొన్నారు.
మత్స్యశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ వివరించారు. మత్స్యకారుల ఆదాయం పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన ఎంపీలకు వివరించారు. మరోవైపు, జులై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై పోలీసు చర్యను ప్రశ్నిస్తూ సభను అడ్డుకుంటున్న విపక్షాలకు తగిన రీతిలో సమాధానం ఇవ్వాలని ఎన్డీయే నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్‌తో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి..
ప్రమాదానికి గురైన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు.. 39 మందికి గాయాలు..