Share News

ప్రమాదానికి గురైన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు.. 39 మందికి గాయాలు..

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:12 AM

జమ్మూకశ్మీర్‌ గందర్‌బల్ జిల్లాలో ఇవాళ (మంగళవారం) ఉదయం అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బస్సు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు.

ప్రమాదానికి గురైన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు.. 39 మందికి గాయాలు..
Amarnath Yatra Bus Accident

జమ్మూకశ్మీర్‌: గందర్‌బల్ జిల్లాలో ఇవాళ (మంగళవారం) ఉదయం అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బస్సు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా కంగన్‌లోని గనివాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. హరిగన్వాన్ మీదుగా ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకర మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పైనుంచి పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ ఇంటిని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.


ఈ ప్రమాదంలో ఇల్లు ధ్వంసమవగా.. బస్సులోని యాత్రికులు గాయపడ్డారు. మరోవైపు, ఇంటిని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న సింధు నదిలో బస్సు పడిపోకుండా పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి భద్రతా సిబ్బంది, అత్యవసర బృందాలకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. యాత్రికులకు చికిత్స కొనసాగుతుండగా వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక నివేదిక రావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ ప్రమాదంపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. గందర్‌బల్ డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు మనోజ్ సిన్హా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 'బాబా బర్ఫానీ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న 39 మంది యాత్రికులు గనివాన్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బాధితులను ఎస్‌కేఐఎమ్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించాను' అని సిన్హా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడు సంచలనంగా మారిన అధికార పార్టీ TVK నేతల ఆడియో లీక్‌!

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కు ఢిల్లీ హైకోర్టు మూడు వారాల గడువు..

Updated Date - Jul 28 , 2026 | 11:31 AM