బడి పిల్లలపై బ్యాగు భారం
ABN , Publish Date - Jun 10 , 2026 | 09:38 AM
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో స్కూల్ బ్యాగుల భారానికి విద్యార్థులు మళ్లీ భయపడుతున్నారు.
వెన్ను వంచుతున్న పుస్తకాల సంచి
మళ్లీ పెరుగుతున్న పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ సంఖ్య
చెప్పినవన్నీ కొనాలంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు
వయసుకు మించిన బరువుతో విద్యార్థుల ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో స్కూల్ బ్యాగుల భారానికి విద్యార్థులు మళ్లీ భయపడుతున్నారు. చదువుతున్న తరగతికి సంబంధించిన పుస్తకాల సంఖ్య పెరుగుతుండడంతో స్కూల్ బ్యాగు నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ సమస్య ఉంటోంది. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండక ముందే చాలామంది నడుము, మెడ నొప్పి, కండరాల సమస్యలతో సతమతమవుతున్నారు. స్కూళ్లలో బుక్స్ భారం తగ్గించి విద్యార్థులకు గుణాత్మక, నైపుణ్య విద్యను అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నప్పటికీ ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టించుకున్నా దాఖలాలు కనిపించడం లేదు.
ఒకటో తరగతికి 26 బుక్స్..
ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ప్రైవేట్ బుక్స్, 6 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు తీసుకుంటారు. అయితే ఆరో తరగతి నుంచి ఐఐటీ కోచింగ్, స్మార్ట్ క్లాసులు, రివిజన్ పేరిట సొంతంగా ప్రింట్ చేసిన బుక్స్‌ను కొనుగోలు చేయాలని ప్రైవేట్ స్కూల్ నిర్వాహకులు తల్ల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. దీంతో పిల్లలు వయసుకు మించిన బరువును అనివార్యంగా మోయాల్సి వస్తోంది. ఉదాహరణకు ఒకటో తరగతి విద్యార్థికి ప్రభుత్వ బడిలో పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్ కలిపి 12 వరకు ఉన్నాయి.
అదే తరగతికి మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో 26 వరకు ఉన్నాయి. కాగా, పదో తరగతిలో ప్రభుత్వ స్కూల్‌లో 18 ఉండగా.. కార్పొరేట్ స్కూల్‌లో అన్ని కలిపి 46 వరకు ఉన్నట్లు మియాపూర్‌లోని ఓ పేరొందిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తండ్రి వాపోయారు. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, కాపీ రైట్, కాంపాక్స్ బాక్స్, ఎక్సర్ సైజ్ నోట్స్, కలర్ కంపోజింగ్, రైటింగ్ ఇంప్రూవ్‌మెంట్, తదితర అన్ని కలిపి 20 కిలోలకుపైగా బరువు ఉంటుందని, రోజూ బాబు స్కూల్‌కు బ్యాగును పట్టుకుని వెళ్తూ ఇంటికి వచ్చేసరికి నీరసించి పోతున్నాడని తెలిపారు.
80 శాతం పాఠశాలల్లో అమలుకు నోచని నో బ్యాగ్ డే..
రోజువారీ తరగతులకు బదులుగా ఆటలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఆచరణాత్మక అభ్యాస సెషన్లతో విద్యార్థుల్లో మానసికోల్లాసాన్ని నింపేందుకు కొంతకాలంగా ప్రతినెలా నాలుగో శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దీనిని కొంత మేరకు అమలు చేస్తుండగా.. ప్రైవేట్ స్కూళ్లలో అసలు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో నో బ్యాగ్ డే రోజు కూడా భుజానికి పుస్తకాల బ్యాగు తగిలించుకుని వెళ్లాల్సి వస్తోంది.
అధిక బరువు మోయడం వల్ల వచ్చే సమస్యలు
పిల్లలు మోయాల్సిన బరువు కంటే అధిక బరువు మోస్తే స్కోలియోసిస్ (వెన్నెముక ఒక వైపు వంగిపోవడం) వంటి ఇబ్బందులు వస్తాయి.
బరువు కారణంగా పాదంపై పట్టు ఉండదు. నడక తీరు మారుతుంది. తద్వారా పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటారు.

స్కూల్ బ్యాగును ఇలా తగ్గించుకోవాలి..
విద్యార్థులు రెండు చేతులకు బ్యాగును తగిలించుకుని వెళ్తే నడుముపై అధిక భారం పడకుండా ఉంటుంది.
బ్యాగు పట్టీలు మందంగా ఉండాలి. పిల్లల నడుమ కింద నాలుగు అంగుళాలు మించకూడదు.
ఆ రోజుకు సంబంధించిన బుక్స్‌ను మాత్రమే తీసుకెళ్లడం ద్వారా కొంత బరువు తగ్గించొచ్చు.
బస్సు కోసం వేచిచూస్తున్నప్పుడు, నిలబడినప్పుడు బ్యాగును కింద పెట్టడం మంచింది.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News