Share News

పుష్కర ప్రధాని

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:11 AM

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు.

పుష్కర ప్రధాని

  • నెహ్రూ 12 ఏళ్ల రికార్డును అధిగమించిన మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 9: నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టి బుధవారంతో 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. అలాగే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును కూడా ఆయన సొంతం చేసుకోనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు నెహ్రూ పేరు మీద ఉంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచాక 1952 మే 13న ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1964 మే 27న మరణించేదాకా 4,398 రోజులపాటు నిరంతరాయంగా ఆ పదవిలో కొనసాగారు. కాంగ్రెసేతర పార్టీ తరఫున రెండు సార్లు పూర్తికాలపు ప్రధానిగా (పదేళ్లు) పనిచేసి రికార్డు సాధించిన మోదీ.. ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు. 2014 మే 26న ప్రధాని పగ్గాలు చేపట్టిన ఆయన.. బుధవారంతో ఆ పదవిలో నిరాటంకంగా 4,399 రోజులు పూర్తిచేసుకోనున్నారు. తద్వారా దీర్ఘకాలం ప్రధానిగా కొనసాగిన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు.

ప్రధాని ఆధ్వర్యంలో నేడు ఎన్‌డీఏ భేటీ

కేంద్రంలో తన సారథ్యంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం ఎన్‌డీఏ కీలక సమావేశం జరుగనుంది. 22 ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు, బీజేపీ సీనియర్‌ నేతలు దీనికి హాజరు కానున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలు, భారత ఆర్థిక వ్యవస్థ, చమురు, వంటగ్యాస్‌ ధరలు, కేంద్రప్రభుత్వ వికసిత్‌ భారత్‌ రోడ్‌మ్యాప్‌పై సమీక్షిస్తారు. రాజకీయంగా ఇది కీలక సమావేశం కానుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్‌డీఏ భేటీ తర్వాత ప్రధాని నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు. కాగా.. కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ, బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలోనే జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఎన్‌డీఏ, నీతి ఆయోగ్‌ సమావేశాలు ముగిసినా ఢిల్లీలోనే ఉండాలని కేంద్ర మంత్రులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.


  • 12 ఏళ్లలో సాధించిన విజయాలివీ

ఎక్స్‌లో మోదీ సుదీర్ఘ పోస్టు

12 ఏళ్లలో తన ప్రభుత్వ విజయాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, మధ్యతరగతికి పన్ను మినహాయింపుల గురించి మంగళవారం ప్రధాని ‘ఎక్స్‌’లో వివరించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా.. ‘సేవ.. సత్పరిపాలన.. పురోగమనం’పై ప్రత్యేక దృష్టితో తమ ప్రయాణం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ మధ్య సమతుల్యం సాధిస్తూ సాగుతున్నామన్నారు. ప్రధానంగా వివిధ సంక్షేమ పథకాల కింద 81 కోట్ల మంది ఉచిత రేషన్‌ అందిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద పేదలకు 4 కోట్లకుపైగా ఇళ్లు నిర్మించామన్నారు. ఉజ్వల పథకం కింద 10.5 కోట్ల మందికి వంటగ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చామని.. దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే.. పీఎం-కిసాన్‌ స్కీం కింద అన్నదాతల ఖాతాల్లోకి నేరుగా రూ.4.3 లక్షల కోట్లకుపైగా బదిలీచేశాం. పంటల బీమా కింద 4 కోట్ల మందికి రూ.2 లక్షల కోట్లు చెల్లించాం. కనీస మద్దతు ధర కింద రూ.26 లక్షల కోట్ల విలువైన పంటల ఉత్పత్తులను సేకరించాం. కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ స్కీం కింద 8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.38,400 కోట్లకు చేరుకుంది. వలస పాలన వాసనలను తొలగించడానికి పలు చర్యలు తీసుకున్నాం. రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చాం. శివాజీ స్ఫూర్తితో నౌకాదళానికి కొత్త పతాకం తీసుకొచ్చాం. భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వపరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నాం. అయోధ్యలో రామాలయం నిర్మించాం. వారాణసీ, ఉజ్జయిని, కేదార్‌నాథ్‌లను కాశీవిశ్వనాథ్‌ ధామ్‌, మహాకాల్‌ లోక్‌, కేదార్‌నాథ్‌ ధామ్‌ పేరిట పునర్నిర్మించాం.


భారీ మౌలిక ప్రాజెక్టులు..

మా హయాంలో భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు చేపట్టాం. అటల్‌ సేతు, సుదర్శన్‌ సేతు, చినాబ్‌ రైలు బ్రిడ్జి, బోగీబీల్‌ బ్రిడ్జ్‌, పంబన్‌ సీ బ్రిడ్జి వంటివి ఇందులో ముఖ్యమైనవి. 26 నగరాల్లో 1100 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాం. 164 వందేభారత్‌ రైళ్లు ప్రవేశపెట్టాం. దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 74 నుంచి 164కి పెంచాం.

మహిళలకు, యువతకు పెద్దపీట

మహిళలకు 32 కోట్ల జన్‌ధన్‌ ఖాతాలు తెరిచాం. భారత సైన్యం మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేశాం. ‘లఖ్‌పతీ దీదీ’ స్కీం కింద 3 కోట్ల మంది మహిళలు రూ.లక్ష వరకు వార్షిక ఆదాయం పొందారు. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్ల మందికి పైగా గ్రామీణ మహిళలు ఉన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కింద సుమారు 2 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చాం. ముద్ర యోజన కింద రూ.40 లక్షల కోట్ల విలువైన రుణాలు మంజూరుచేశాం. విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 10 వేలకుపైగా ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌’లను నెలకొల్పాం. ఆయుష్మాన్‌ భారత్‌ స్కీం కింద ఇప్పటివరకు 60 కోట్ల మందికిపైగా లబ్ధి పొందారు. 70 ఏళ్లకుపైబడిన సీనియర్లకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 19వేలకుపైగా జన ఔషధి కేంద్రాల ద్వారా 90శాతం వరకు తగ్గింపు రేట్లతో చౌకగా ఔషధాలు అందజేస్తున్నాం.

Updated Date - Jun 10 , 2026 | 05:54 AM