‘టెన్’షన్ వద్దు..
ABN , Publish Date - Mar 11 , 2026 | 08:28 AM
పదవ తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.
ఒత్తిడిని జయించి ముందుకు పోవాలి
పదో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుల సూచనలు
హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల సమయం సమీపిస్తున్న కొద్ది విద్యార్థుల్లో ఒత్తిడి మొదలవుతుంది. ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సెల్‌ఫోన్, టీవీ వైపు మనస్సు మరలకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ విద్యార్థి ఏర్పాటు చేసుకున్న టైం టేబుల్ ప్రకారం చదువు కోవాల్సి ఉంటుంది. సందేహాలను విద్యార్థులు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. అందుకోసం తరగతి ఉపాధ్యాయులు లేదా, మంచి స్నేహితులు, సీనియర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
తల్లిదండ్రులు చేయాల్సినవి..
పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. విద్యార్థిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ప్రతిక్షణం కృషి చేయాలి. అవసరమైన ధైర్యం అందివ్వాలి. పిల్లలు ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తారు కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన పౌష్టికాహారం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సమయానికి తగినంత నిద్రపోయేలా కూడా చూడాలి.
విద్యార్థులను సన్నద్ధం చేశాం
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లలో మంచి మార్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మార్చి 14 వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం.
- ఐ. విజయకుమారి, డీఈవో, మేడ్చల్ జిల్లా

మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరీయల్‌ను విద్యార్థులు చదవాలి. పాఠ్య పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. సమయాన్ని వృథా చేయకుండా టెన్షన్ దరిచేరకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలి. సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంది. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు ప్రశాంత వాతావరణంతో పరీక్షలకు హాజరు కావాలి.
- శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా సైన్స్ ఆఫీసర్
9 సెంటర్లు ఏర్పాటు
అల్వాల్ మండల పరిధిలో పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు అన్నిరకాలుగా సిద్ధం చేశాం. 9 సెంటర్లలో పరీక్షలను నిర్వహిస్తున్నాం. దాదాపు 1800 మంది విద్యార్థులు ఈసారి పరీక్షలను రాస్తున్నారు. గణితంలో నూటికి నూరు శాతం మార్కులు వచ్చే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా గణితంలో సులభంగా అర్థమయ్యేలా డయాగ్రామ్స్ వేయాలి. సులభమైన చాప్టర్స్‌పై దృష్టిసారించాలి.
- మురళీకృష్ణ, అల్వాల్ మండల ఎంఈవో
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News