Share News

విధాతతో పోరాడి విధిని మార్చి

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:15 AM

ఆమె 12 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కింది. పదహారేళ్లకే చావు అంచుల్లో నిలబడింది. సమాజం ఆమెను ఒక ఓడిపోయిన మహిళగా ముద్ర వేసింది. కానీ అదే సమాజం నేడు ఆమె ముందు తలవంచుతోంది...

విధాతతో పోరాడి విధిని మార్చి

ఆమె 12 ఏళ్లకే పెళ్లి పీటలు ఎక్కింది. పదహారేళ్లకే చావు అంచుల్లో నిలబడింది. సమాజం ఆమెను ఒక ఓడిపోయిన మహిళగా ముద్ర వేసింది. కానీ అదే సమాజం నేడు ఆమె ముందు తలవంచుతోంది. కట్టుబట్టలతో ముంబై మెట్రో నగరానికి చేరుకున్న ఓ యువతి అక్షరాలా వందకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందో తెలుసుకోవాలంటే కల్పనా సరోజ్‌ జీవన పోరాటం చదవాల్సిందే!

మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామంలో 1961లో కల్పన జన్మించారు. తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌. పేదరికం ఒకవైపు, దళిత కుటుంబం కావడంతో సామాజిక వివక్ష మరోవైపు ఆమె బాల్యాన్ని నీడలా వెంటాడాయి. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువుకంటే పెళ్లే ముఖ్యమనే భావన ఉండేది. ఫలితంగా 12 ఏళ్ల ఆడిపాడుకునే వయసులో కల్పనకు వివాహం చేశారు. ముంబై మురికివాడలో ఉన్న అత్తమామల ఇంట్లో కోడలిగా అడుగుపెట్టారు.

నరకప్రాయం వైవాహిక జీవితం

ముంబైలో ఆమెను ఆహ్వానించింది ఆనందం కాదు, అంతులేని ఆవేదన. భర్త కుటుంబ సభ్యుల నుంచి శారీరక, మానసిక వేధింపులు మొదలయ్యాయి. తిండి పెట్టకుండా మాడ్చడం, గొడ్డెడు చాకిరీ చేయించడం నిత్యకృత్యమైంది. అత్తింటి నరకాన్ని భరించలేక, చివరకు 16 ఏళ్ల వయసులో తండ్రి సాయంతో మళ్లీ పుట్టింటికి చేరుకున్నారు కల్పన. కానీ, అక్కడి సమాజం ఆమెను ఆహ్వానించలేదు. ‘మొగుడిని వదిలేసి వచ్చింది’ అంటూ ఇరుగుపొరుగువారు చేసే ఎగతాళి, అవమానాలు ఆమెను కుంగదీశాయి.

చావు అంచు నుంచి కొత్త జీవితం వైపు

సమాజం వెక్కిరింపులు భరించలేక 16 ఏళ్ల ప్రాయంలో కల్పన విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే, అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ క్షణమే ఆమెలో ఒక ఆలోచన మెరిసింది. ‘చావడానికి సిద్ధపడినదాన్ని.. బ్రతకడానికి ఎందుకు భయపడాలి?’ అని తనను తాను ప్రశ్నించుకున్నారు. అదే ఆమె జీవితంలో అతిపెద్ద మలుపు. సమాజం గీసిన గీతలను చెరిపేస్తూ.. తన విధిని తానే రాసుకోవాలని నిర్ణయించుకున్నారు.


00-Navya.jpg

నిశ్శబ్ద విప్లవం

మళ్లీ ముంబై చేరుకున్న కల్పన మొదట ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో రోజుకు రెండు రూపాయల కూలికి చేరారు. కుట్టుమిషన్‌పై బట్టలు కుడుతూనే పొదుపు చేయడం నేర్చుకున్నారు. స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే చిన్న రుణం తీసుకుని ఫర్నిచర్‌ వ్యాపారాన్ని ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టి తనలోని వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.

పతనం నుంచి పునరుద్ధరణ

కల్పనా సరోజ్‌ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం ‘కమానీ ట్యూబ్స్‌’ కంపెనీని స్వాధీనం చేసుకోవడం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి అప్పుల ఊబిలో కూరుకుపోయి మూతపడిన ఆ కంపెనీని కాపాడాలని కార్మికులు ఆమెను వేడుకున్నారు. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలే వెనకడుగు వేసిన చోట కల్పన ధైర్యంగా ముందడుగు వేశారు. కోర్టు కేసులు, బ్యాంకు అప్పులు, కార్మికుల సమస్యలు.. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించారు. తన మేనేజ్‌మెంట్‌ చాకచక్యంతో మూతపడిన కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించారు.

వందకోట్ల సామ్రాజ్యం.. పద్మశ్రీ పురస్కారం

కల్పనా సరోజ్‌ నేడు కేవలం కమానీ ట్యూబ్స్‌ అధినేత మాత్రమే కాదు.. స్టీల్‌, రియల్‌ ఎస్టేట్‌, తయారీ రంగాల్లో విస్తరించిన దాదాపు 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి ఆమె రారాణి. దేశంలో మొట్టమొదటి మహిళా పారిశ్రామికవేత్తగా ఆమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2013లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. కల్పన సరోజ్‌ ప్రయాణం కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు, అది ఒక ఆత్మగౌరవ పోరాటం. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా మరణం అంచున నిలబడి గెలుపు తీరానికి చేరడం ఆమె సాధించిన అసలైన విజయం. ‘‘నీ పరిస్థితులు నీ భవిష్యత్తును నిర్ణయించవు. నీ ధైర్యమే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది’’ అని ఆమె ప్రపంచానికి చాటి చెప్పారు.

ఇవి కూడా చదవండి..

నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు

Updated Date - Mar 11 , 2026 | 03:15 AM