నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:15 PM
ఫ్లోరిడాలో రిపబ్లికన్ మెంబర్స్ ఇష్యూస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ, మూడున్నర రోజుల్లో ఇరాన్ నావికాదళానికి చెందిన 46 నౌకలను అమెరికా మిలటరీ సముద్ర గర్భంలో ముంచేసిందని, అవన్నీ సముద్రం అడుగున పడి ఉన్నాయని తెలిపారు.
వాషింగ్టన్: మద్యప్రాచ్యంలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్‌లోని 5,000 లక్ష్యాలను అమెరికా ఛేదించిందని, దీంతో దేశ క్షిపణి సామర్థ్యం 10 శాతం తగ్గిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడాలో రిపబ్లికన్ మెంబర్స్ ఇష్యూస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, మూడున్నర రోజుల్లో ఇరాన్ నావికాదళానికి చెందిన 46 నౌకలను అమెరికా మిలటరీ సముద్ర గర్భంలో ముంచేసిందని, అవన్నీ సముద్రం అడుగున పడి ఉన్నాయని తెలిపారు.
యూఎస్ మిలటరీ అధికారులతో తాను జరిపిన సంభాషణలను ఆయన ప్రస్తావిస్తూ, నౌకలను స్వాధీనం చేసుకోకుండా ఎందుకు ముంచేశారని తాను వారిని అడిగినట్టు చెప్పారు. ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడం కంటే ముంచేయడం సురక్షితమని, సరదాగా ఉంటుందని తనకు మిలటరీ సిబ్బంది చెప్పారని ఆయన పేర్కొన్నారు. 'ఇరాన్ డ్రోన్, క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమైంది. నావికాదళం పూర్తిగా అంతమైంది. నౌకలన్నీ పూర్తిగా సముద్రం అడుగున పడి ఉన్నాయి. 46 షిప్పులు ముంచేశామంటే నమ్ముతారా?. నిజానికి మన వాళ్లు (అమెరికా మిలటరీ) చేసిన పనికి కొంత మసస్థాపం చెందాను. షిప్పులు ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయారు? వాటిని మనం ఉపయోగించుకుని ఉండొచ్చు. వాటిని ఎందుకు ముంచేశారని అడిగా. నౌకలను ముంచేయడమే సురక్షితమని చెప్పారు. దాన్నే వాళ్లు ఇష్టపడ్డారు. బహుశా అదే కరెక్ట్ కావచ్చు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
దుష్టశక్తులను అంతం చేయడానికి మధ్యప్రాచ్యానికి ఒక చిన్న విహార యాత్ర చేశామని ఇరాన్‌పై జరుపుతున్న యుద్ధాన్ని ట్రంప్ అభివర్ణించారు. ఇది స్వల్పకాలిక యాత్రమాత్రమేనని అన్నారు. శత్రువుని పూర్తిగా చిత్తు చేసేంత వరకూ అమెరికా మిలటరీ విశ్రమించేది లేదని ట్రంప్ చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో ఆయిల్ సరఫరాలను ఇరాన్ అడ్డుకుంటే ఒకటికి ఇరవై రెట్లు సామర్థ్యంతో దెబ్బతీస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
యుద్ధం ఆపేయండి.. ట్రంప్‌నకు సలహాదారుల సూచన
పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ యుద్ధం గురించి చర్చ..