Share News

యుద్ధంపై ముందుకే!

ABN , Publish Date - Mar 10 , 2026 | 05:12 AM

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇజ్రాయెల్‌పై, గల్ఫ్‌లోని చమురు రిఫైనరీలు.....

యుద్ధంపై ముందుకే!

  • పరస్పర దాడులు మరింత ఉధృతం

  • ట్రంప్‌ హెచ్చరికలను పట్టించుకోకుండా..కొత్త సుప్రీంలీడర్‌ను ఎన్నుకున్న ఇరాన్‌

  • ఇజ్రాయెల్‌, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపైక్షిపణులు, డ్రోన్లతో దాడులు పెంపు

  • మరో 6నెలలు యుద్ధం చేయగలం: ఐఆర్‌జీసీ

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, మార్చి 9: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇజ్రాయెల్‌పై, గల్ఫ్‌లోని చమురు రిఫైనరీలు, అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి, డ్రోన్‌ దాడులు కొనసాగుతున్నాయి. తన ప్రమేయం లేకుండా ఇరాన్‌ కొత్త సుప్రీంలీడర్‌ను ఎన్నుకుంటే ఊరుకోబోన్న ట్రంప్‌ హెచ్చరికలు, కొత్త లీడర్‌ను నేరుగా టార్గెట్‌ చేస్తామన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలను పట్టించుకోకుండా.. ఇరాన్‌ నాయకత్వం కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీని ఎన్నుకుంది. యుద్ధంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు ఇచ్చింది. మరో ఆరు నెలలు యుద్ధం చేయగలమని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సన్నాహాలు చేస్తున్నట్టు అమెరికా రక్షణ వర్గాలు వెల్లడించాయి.

ఆగని క్షిపణి, డ్రోన్‌ దాడులు

సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌ చేసిన డ్రోన్‌ దాడిలో సిత్రా ప్రాంతంలో 32 మంది గాయపడ్డారని బహ్రెయిన్‌ ఆరోగ్య శాఖ తెలిపింది. క్షతగాత్రుల్లో రెండు నెలల చిన్నారి, ఏడెనిమిదేళ్ల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. దాడులు మొదలైనప్పటి నుంచి ఇరాన్‌ ప్రయోగించిన 95 క్షిపణులు, 164 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశామని తెలిపింది. ఇక తమ చమురు రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి నేపథ్యంలో.. చమురు సరఫరా కోసం ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను నిలిపివేస్తున్నట్టు బహ్రెయిన్‌ జాతీయ చమురు సంస్థ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడిలో గాయపడిన తమ సైనికుడు ఒకరు సోమవారం మృతిచెందినట్టు అమెరికా ప్రకటించింది. ఇక అరబ్‌ గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ ఇలాగే దాడులు కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెచ్చరించింది. మరోవైపు లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఆ దాడుల్లో ఇప్పటివరకు 486 మంది మృతిచెందారని, 1,313 మంది గాయపడ్డారని లెబనాన్‌ ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది.

3.jpg


ఇజ్రాయెల్‌లో భారతీయుడికి గాయాలు

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణి దాడుల్లో ఒక భారతీయుడికి తీవ్రగాయాలయ్యాయి. ఇరాన్‌ క్షిపణి శకలం ఆ వ్యక్తి మెడలో గుచ్చుకుందని, వెంటనే టెల్‌ అవీవ్‌లోని ఇచిలోవ్‌ ఆస్పత్రికి తరలించి సుదీర్ఘ శస్త్రచికిత్స చేశామని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. కాగా, సౌదీలోని అల్‌ ఖర్జ్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఇరాన్‌ క్షిపణి దాడిలో ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు భారతీయుడు, మరొకరు బంగ్లాదేశీ అని అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇద్దరు మృతులు కూడా బంగ్లాదేశీలేనని గుర్తించినట్టు సోమవారం వెల్లడించారు.

ఇక అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు: ఐఆర్‌జీసీ

ప్రస్తుతం కొనసాగుతున్న స్థాయిలో తాము మరో ఆరు నెలల పాటు యుద్ధం చేయగలమని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. దీనికి సంబంధించి ఐఆర్‌జీసీ ప్రతినిధి అలీ మొహమ్మద్‌ నైనీ మాట్లాడిన దృశ్యాలను ఇరాన్‌ టీవీ ప్రసారం చేసింది. ఇప్పటివరకు తాము మొదటి, రెండో జనరేషన్‌ క్షిపణులను మాత్రమే ప్రయోగించామని.. ఇక ముందు అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులు చేస్తామని మొహమ్మద్‌ నైనీ ఇజ్రాయెల్‌, అమెరికాలను హెచ్చరించారు.

యుద్ధం ఆగే వరకు హోర్ముజ్‌ భద్రం కాదు

కాగా ఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధం కొనసాగుతున్నంత కాలం హోర్ముజ్‌ జల సంధిలో భద్రతను పునరుద్ధరించడం సాధ్యం కాదని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సెక్రెటరీ అలీ లరిజని స్పష్టం చేశారు. హోర్ముజ్‌ జలసంధిలో రాకపోకలను పునరుద్ధరించేలా ఫ్రాన్స్‌, మిత్రదేశాలు కలిసి అంతర్జాతీయ రక్షణాత్మక మిషన్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ చేసిన వ్యాఖ్యలపై అలీ లరిజని ఇలా స్పందించారు.


అది తీవ్రమైన యుద్ధ నేరమే..

ఐఆర్‌జీసీ స్థావరానికి సమీపంలో ఉండటంతో పొరపాటుగా పాఠశాలపై క్షిపణి దాడి చేసినా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అది తీవ్రమైన యుద్ధ నేరమేనని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అంతర్జాతీయ చట్టాల నిపుణులు జనినా దిల్‌ స్పష్టం చేశారు. దాడి చేసే ముందు కచ్చితంగా నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అయితే అమెరికా అంగీకరించకపోయినా మినాబ్‌ స్కూల్‌పై దాడికి ఆ దేశ బలగాలే కారణమనేందుకు పలు ఆధారాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. పాఠశాలపై దాడి ఘటనపై అమెరికా సైన్యం స్వయంగా దర్యాప్తు ప్రారంభించడం, అమెరికా తాము దాడి చేసినట్టు ప్రకటించిన ఐఆర్‌జీసీ స్థావరానికి సమీపంలోనే పాఠశాల ఉండటం, ఆ దాడి తాము చేయలేదని ఇజ్రాయెల్‌ ప్రకటించడం వంటివి చూస్తే.. అమెరికానే బాధ్యురాలని స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు.

శత్రువులకు సహకరిస్తే ఆస్తుల స్వాధీనం

శత్రువులకు సహకరించినా, వారు చెప్పింది చేసినా విదేశాల్లోని ఇరానియన్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఇరాన్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం సోమవారం ప్రకటించింది. అటువంటి వారిని విదేశాల్లో ఉంటోన్న శత్రువులుగా పరిగణించి ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలిస్తామని పేర్కొంది. విదేశాల్లో ఉంటూ ఇజ్రాయెల్‌, అమెరికాల కోసం గూఢచర్యానికి పాల్పడితే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడమే కాక మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది.

1.jpg


ఇరాన్‌ స్కూల్‌పై దాడి అమెరికా పనే!

ఇరాన్‌లోని మినాబ్‌ పట్టణంలో 165 మంది చిన్న పిల్లలను బలిగొన్న క్షిపణి దాడి అమెరికా పనేనని తెలుస్తోంది. ఆ పాఠశాలపై అమెరికా తొమహాక్‌ క్షిపణి దాడి జరిగిందని నెదర్లాండ్స్‌ కేంద్రంగా నడిచే ‘బెల్లింగ్‌క్యాట్‌’ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం గ్రూపు వెల్లడించింది. ఆ పాఠశాలపై క్షిపణి పడుతుండగా చిత్రీకరించిన చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. మినాబ్‌ పాఠశాలపై దాడి ఇరాన్‌ పనేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొంది. ఇరాన్‌పై దాడి మొదలైన ఫిబ్రవరి 28వ తేదీనే మినాబ్‌లోని ఐఆర్‌జీసీ స్థావరంపైకి అమెరికా క్షిపణులు ప్రయోగించింది. అక్కడికి సమీపంలోనే ఉన్న పాఠశాలపై కూడా క్షిపణి దాడి జరిగింది. 165 మంది చిన్నారులు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను బెల్లింగ్‌క్యాట్‌ సంపాదించింది. క్షిపణి పడుతుండగా రికార్డు అయిన వీడియోను బెల్లింగ్‌క్యాట్‌ పరిశోధకుడు ట్రెవర్‌ బాల్‌, అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ జియోలొకేట్‌ చేసి.. అది పాఠశాల వద్దే పడిందని నిర్ధారించారు. అంతేకాదు ఆ దాడి జరిగినది తొమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణితోనని గుర్తించారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా మాత్రమే తొమహాక్‌ క్షిపణులను వినియోగిస్తుండటం గమనార్హం.

ట్రంప్‌.. వీళ్ల కళ్లలోకి చూడు!

165 మంది చిన్నారులు కన్నుమూసిన మినాబ్‌ పాఠశాలపై క్షిపణి దాడి చేసినది అమెరికానే అని తేల్చిన నేపథ్యంలో టెహ్రాన్‌ టైమ్స్‌ పత్రిక తమ మొదటిపేజీని విషాదాన్ని తలపించేలా సిద్ధం చేసింది. దాడిలో మరణించిన చిన్నారుల చిత్రాలతో మొదటిపేజీని నింపేసి.. ‘ట్రంప్‌.. ఒకసారి వీళ్ల కళ్లలోకి చూడు’ అంటూ శీర్షిక పెట్టింది. ట్రంప్‌ అబద్ధాలు, జరిగిన దారుణాల బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు బయటపడ్డాయని పేర్కొంది.


1.jpg

ఇజ్రాయెల్‌కు అమెరికా చీవాట్లు!

ఇరాన్‌లోని ఇంధన నిల్వ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులను అమెరికా తప్పుపట్టింది. ఆ పని సరికాదంటూ చీవాట్లు పెట్టింది. అమెరికా రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్‌ దీనిపై కథనం ప్రచురించింది. ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన తర్వాత ఈ రెండు మిత్రదేశాల మధ్య ఒక అంశంపై ఇలా పొరపొచ్చాలు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌తోపాటు సమీప ప్రాంతాల్లోని 30 పెట్రోల్‌, ఇతర చమురు ఉత్పత్తుల నిల్వ డిపోలపై ఇజ్రాయెల్‌ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. పెట్రోలియం ఉత్పత్తులన్నీ అంటుకుని భారీగా మంటలు చెలరేగాయి. విషవాయువులతో కూడిన దట్టమైన నల్లటి పొగలు టెహ్రాన్‌ను కమ్మేశాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, సల్ఫర్‌ డయాక్సైడ్‌తో కూడిన పొగల కారణంగా యాసిడ్‌ వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు కూడా. మరోవైపు ఇంధన నిల్వలపై దాడులపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తమైంది. నిజానికి ఇంధన డిపోలపై దాడికి సంబంధించి అమెరికాకు ఇజ్రాయెల్‌ ముందే సమాచారమిచ్చినా.. ఇంత తీవ్రమైన స్థాయిలో విధ్వంసాన్ని ఊహించలేదని ఆ దేశ రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పినట్టు యాక్సియోస్‌ కథనం పేర్కొంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ తీరుపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘బుద్ధి ఉందా? ఇదేం పిచ్చిపని’ అనే స్థాయిలో సందేశం పంపినట్టు వెల్లడించింది. ‘‘ఇంధన డిపోలపై దాడులు అధ్యక్షుడికి నచ్చలేదు. ఆయన ఆయిల్‌ను కాపాడాలనుకుంటున్నారు. కాల్చేయాలని కోరుకోవడం లేదు’’ అని ట్రంప్‌ సలహాదారు ఒకరు వెల్లడించారని యాక్సియోస్‌ తెలిపింది. దీనిపై ఇజ్రాయెల్‌, అమెరికా రక్షణ వర్గాలు అధికారికంగా స్పందించడానికి నిరాకరించాయి.

Updated Date - Mar 10 , 2026 | 05:12 AM