బంగ్లాదేశ్, పాక్‌లో ఇంధన సంక్షోభం!
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:45 AM
పశ్చిమాసియాలో యుద్ధంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం విద్యుత్, ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది. రంజాన్ పండుగ సెలవులను ముందుకు జరిపి సోమవారం నుంచే యూనివర్సిటీలను మూసివేసింది.
ఢాకా, మార్చి 9: పశ్చిమాసియాలో యుద్ధంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం విద్యుత్, ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది. రంజాన్ పండుగ సెలవులను ముందుకు జరిపి సోమవారం నుంచే యూనివర్సిటీలను మూసివేసింది. ప్రైవేటు కోచింగ్ సెంటర్లు కూడా తమ కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో విద్యుత్ ఆదా అవడంతోపాటు, ఇంధన వృథాకు కారణమవుతున్న ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుందని బంగ్లాదేశ్ ప్రభుత్వ భావన. మరోవైపు, దేశంలో ఐదు ప్రభుత్వరంగ ఎరువుల ఫ్యాక్టరీలు ఉండగా, వాటిలో నాలుగు ఇప్పటికే తీవ్ర గ్యాస్ కొరతతో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. బంగ్లాదేశ్ తమ ఇంధన అవసరాలలో 95ు వరకు దిగుమతులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు పాఠశాలలను మూసివేయడంతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు పనిదినాలను తగ్గించింది. దేశంలోని అన్ని పాఠశాలలను 15 రోజుల పాటు మూసివేయాలని, ఉన్నత విద్యాసంస్థలు తక్షణమే ఆన్‌లైన్ తరగతులకు మళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకులు మినహా ప్రభుత్వ కార్యాలయాలన్ని హైబ్రిడ్ పద్ధతిలో వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. అత్యవసర సేవలు మినహా, మిగిలిన ప్రభుత్వ విభాగాల్లో 50 శాతం సిబ్బంది ఇంటి నుంచే పని చేయాల్సి ఉంటుంది.