Share News

వంట గ్యాస్‌ సంక్షోభం!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:04 AM

పశ్చిమాసియాలో యుద్ధం సెగ మనదేశానికి తగులుతోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది....

వంట గ్యాస్‌ సంక్షోభం!

  • దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత.. హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం

  • ముంబైలో ఇప్పటికే 20 శాతం హోటళ్ల మూసివేత

  • ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి

  • పీజీలు, హాస్టళ్ల నిర్వాహకుల ఆందోళన

  • రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం.. సహజ వాయువు సరఫరాపై నోటిఫికేషన్‌ జారీ

  • ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పైప్డ్‌ వంట గ్యాస్‌కు ప్రాధాన్యం

  • చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టం

  • గరిష్ఠంగా ఎల్‌పీజీ ఉత్పత్తి.. రిఫైనరీలకు ఆదేశం

  • ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి

  • కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ, మార్చి 10: పశ్చిమాసియాలో యుద్ధం సెగ మనదేశానికి తగులుతోంది. అక్కడ నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా తగ్గిపోయింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో 20 శాతం హోటళ్లను మూసివేశారు. గ్యాస్‌ కొరత ఇలాగే కొనసాగితే రెండ్రోజుల్లోనే ముంబైలో 50 శాతం హోటళ్లు మూతపడతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్‌పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఆర్‌ఏఐ) సహా పలు సంఘాలు వంట గ్యాస్‌ కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గ్యాస్‌ సరఫరా లేకపోతే చాలా రెస్టారెంట్లు మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. రెస్టారెంట్‌ పరిశ్రమ వాణిజ్య ఎల్‌పీజీపైనే ఆధారపడి నడుస్తోందని.. గ్యాస్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పెద్దఎత్తున రెస్టారెంట్లు మూతపడతాయని ఎన్‌ఆర్‌ఏఐ ఓ ప్రకటనలో తెలిపింది. వంట గ్యాస్‌ సంక్షోభం బెంగళూరు నగరంలో తీవ్రంగా కనిపిస్తోంది. గృహ వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా, వాణిజ్య సిలిండర్ల కొరత పెరిగింది. బెంగళూరులో 8వేలకు పైగా హోటళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా టీ స్టాళ్లు, చిన్న హోటళ్లు మరో 6 వేలకుపైగా ఉన్నాయి. పీజీలు, హాస్టళ్లు 7 వేల దాకా ఉంటాయి. రెండు రోజుల నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపేశారు. హోటళ్ల నిర్వాహకులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న సిలిండర్లతో సర్దుకుంటున్నారు.


ఒకటి రెండు రోజుల్లో అవి ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే హోటళ్లు మూతపడక తప్పదని అంటున్నారు. గ్యాస్‌ సిలిండర్లు లభించకపోతే పీజీలు, హాస్టళ్లకు కొన్నాళ్ల తర్వాత సెలవులు ప్రకటిస్తామని నిర్వాహకులు అంటున్నారు. బెంగళూరు జనాభా 1.40 కోట్లు. వీరిలో 30 శాతం మంది హోటళ్ల ఆహారంపైనే ఆధారపడుతున్నారు. బెంగళూరులో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరతపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి కర్ణాటక సీఎం సిద్దరామయ్య లేఖ రాశారు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలో రెస్టారెంట్‌ పరిశ్రమ రూ.6.6 లక్షల కోట్ల విలువైనదని, అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోందని ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్‌ యజమాని చెప్పారు. ఇలాంటి కీలక రంగానికి ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. ఒక్క రోజు ఎల్‌పీజీ సరఫరా ఆగిపోతే రూ.1200-1300 కోట్ల నష్టం వస్తుందని తెలిపారు. ఎల్‌పీజీ కొరత హైదరాబాద్‌లోని పీజీలు, హాస్టళ్లపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల సరఫరా 75 శాతం తగ్గిపోయిందని హాస్టళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత వల్ల లక్షల మందికి ఉపాధి కల్పించే హోటల్‌ పరిశ్రమ మూతపడే పరిస్థితి నెలకొందని తెలంగాణ హోటళ్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లో అసోసియేషన్‌ ప్రతినిధులు అత్యవసర సమావేశం నిర్వహించారు. వంట గ్యాస్‌ కొరతపై ప్రభుత్వం నుంచి ముందస్తుగా ఎలాంటి సూచనలు లేవని, గ్యాస్‌ డీలర్లు చెబితేనే తెలిసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40-50 వేల హోటళ్లు ఉన్నాయని, గ్యాస్‌ లేకపోవడం అవన్నీ మూతపడే పరిస్థితి నెలకొందని చెప్పారు.

3.jpg


వంట గ్యాస్‌ సరఫరాకు ప్రాధాన్య క్రమం

వంట గ్యాస్‌ కొరతను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశీయంగా ఉత్పత్తయ్యే సహజ వాయువును ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేయాలని నిర్ణయించింది. గ్యాస్‌ దిగుమతులకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పైప్డ్‌ వంట గ్యాస్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సీఎన్‌జీ, పైప్డ్‌ వంట గ్యాస్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వగా.. ఈ జాబితాలో ఎల్‌పీజీ కూడా చేరింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. సహజ వాయువును ఇతర రంగాల కంటే ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పైప్డ్‌ వంట గ్యాస్‌ ఉత్పత్తిదారులకే ముందు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆయా ఉత్పత్తిదారులకు గడిచిన ఆర్నెల్ల సగటు వినియోగం మేరకు 100 శాతం సహజ వాయువును కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎరువుల తయారీ కర్మాగారాలకు గడిచిన ఆర్నెల్ల సగటు గ్యాస్‌ వినియోగాన్ని పరిశీలించి, 70 శాతం కేటాయించాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. మూడో ప్రాధాన్యంగా టీ పరిశ్రమలు, తయారీ, ఇతర పారిశ్రామిక వినియోగదారులకు గడిచిన ఆర్నెల్ల సగటు వినియోగంలో 80 శాతం సహజ వాయువును కేటాయించాలని పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ రోజుకు 191 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల వినియోగ అవసరాలను తీరుస్తోందని.. ఇందులో పెట్రో కెమికల్‌ ప్లాంట్లు, పవర్‌ యూనిట్లు, అత్యధిక స్థాయిలో గ్యాస్‌ వినియోగించే వారికి సరఫరాను తగ్గించి; ప్రాధాన్య రంగాలకు మళ్లించాలని స్పష్టం చేసింది. కాగా, వంట గ్యాస్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం చమురు సంస్థలపై నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత ఎక్కువగా ఎల్‌పీజీని ఉత్పత్తి చేయాలని రిఫైనరీలు, పెట్రోకెమికల్‌ యూనిట్లను ఆదేశించింది. కాగా, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లలో హఠాత్తుగా కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర చమురు శాఖ రంగంలోకి దిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఆందోళనకు దిగడంతో పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ కార్యకలాపాలను బంద్‌ చేస్తామని హెచ్చరించాయి. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రం మూడు చమురు మార్కెటింగ్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసింది.

4.jpg


ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగొద్దు: ప్రధాని

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో వంట గ్యాస్‌ కొరత నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మల, వాణిజ్య మంత్రి గోయల్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంధన పరిస్థితులపై చర్చించారు. పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఎల్పీజీ ఉత్పత్తి పెంచుతాం

  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడి

తమ జామ్‌నగర్‌ రిఫైనరీలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతామని ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మంగళవారం వెల్లడించింది. అలాగే తమ కేజీ-డీ6 బ్లాక్‌ నుంచి లభించే గ్యాస్‌ను కూడా ప్రాధాన్య రంగాలకు మళ్లిస్తామని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో దేశ ప్రజలకు అత్యవసర ఇంధనాల కొరత రాకుండా చూడడం జాతీయ ప్రాధాన్య అంశమని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Mar 11 , 2026 | 06:20 AM