Share News

అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: సంధ్యారాణి

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:31 AM

‘సీఎం చంద్రబాబు అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారు. వాళ్లకు జీతాలు పెంచాలనే ఆలోచన మాకూ ఉంది.

అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: సంధ్యారాణి

  • ఉగాదిలోపు ప్రకటన చేయకుంటే ఉద్యమం: సుబ్బరావమ్మ

అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారు. వాళ్లకు జీతాలు పెంచాలనే ఆలోచన మాకూ ఉంది. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దృష్ట్యా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. మంగళవారం ఆమె అంగన్వాడీ సంఘాల నేతలతో అమరావతి సచివాలయంలో చర్చలు జరిపారు. అంగన్వాడీల సమస్యలనన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అంగన్వాడీలు పేర్కొన్న 10 సమస్యల్లో తొమ్మిదింటిని ఇప్పటికే పరిష్కరించామంటూ ఆమె వివరించారు. చర్చల అనంతరం అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఉగాదిలోపు వేతనాలు పెంపుపై ప్రకటన చేయాలి. లేని పక్షంలో ఉగాది తర్వాత దశల వారీగా ఆందోళనలు చేపడతాం’ అని సుబ్బరావమ్మ స్పష్టం చేశారు.

Updated Date - Mar 11 , 2026 | 06:32 AM