Share News

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 10:10 AM

పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్‌ఎస్‏సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

గణితంలో సిద్ధాంతాలు.. సైన్స్‌లో నైపుణ్యాలు

  • రెండింటిపై దృష్టి సారిస్తే పూర్తి మార్కులు

  • చాయిస్‌ ప్రశ్నలపై ఆధారపడకుండా జవాబులు రాయాలి

  • ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం

  • పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సూచనలు

హైదరాబాద్‌ సిటీ: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్‌ఎస్‏సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఇదే క్రమంలో ఉపాధ్యాయులు సైతం తమ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే తరగతి గదుల్లో, ఇంటిలో గంటల తరబడి చదవడం ముఖ్యం కాదని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే 10 జీపీఏ వస్తుందని సబ్జెక్టు టీచర్లు చెబుతున్నారు. పరీక్ష గదిలో ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత ప్రతిదానిని క్షుణ్ణంగా చదివిన తర్వాతనే సమాధానాలు రాయాలని, హడావుడిగా రాస్తే పొరపాట్లు దొర్లి వచ్చే మార్కులు కూడా తగ్గే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.


సైన్స్‌, ఇంగ్లిష్‏లో వీటిపై పట్టు సాధించాలి

  • ఫిజికల్‌ సైన్స్‌లో కాంతి, రసాయన బంధం, మూలకాల వర్గీకరణపై దృష్టి పెట్టాలి. అలాగే కాంతి పరావర్తనం, వక్రీభవనం, కిరణ చిత్రాలు, మానవ కన్ను, విద్యుత్‌ మోటార్‌ వంటి ముఖ్యమైన చిత్రాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. భౌతికశాస్త్రంలో సూత్రాలు, రసాయన శాస్త్రంలో సమీకరణాలను విడిగా రాసుకుని చదవాలి. ముఖ్యంగా గత 5 సంవత్సరాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేయాలి. తద్వారా వరుసగా వచ్చే ప్రశ్నలు ఏమిటో తెలుస్తాయి.


city5.jpg

  • 2 మార్కులు, 4 మార్కుల ప్రశ్నలకు తక్కువ సమయంలో స్పష్టమైన జవాబులు రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. వివరణాత్మక జవాబులు రాసేటప్పుడు ముఖ్యమైన పదాలను హైలెట్‌ (అండర్‌ లైన్‌) చేస్తే బాగుంటుంది.

  • బయాలాజికల్‌ సైన్స్‌లో పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, ప్రత్యుత్పత్తి, సమన్యయం పాఠాల్లోని ప్రయోగాలను ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకోవడంతో 9 మార్కులను పొందవచ్చు.

  • వివిధ క్షీరదాల హృదయం అంతర్నిర్మాణం, విసర్జక వ్యవస్థ, మూత్రపిండాల అంతర్నిర్మాణం, నాడీకణం, మెదడు, పురుష, స్ర్తీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, శుక్రకణం, తదితర పటాలను ప్రాక్టీస్‌ చేస్తే 7 మార్కులను సునాయాసంగా స్కోర్‌ చేయవచ్చు.


  • ఇంగ్లిష్‏లో ప్రోస్‌, పోయెట్రీలో కీలకమైన సంఘటన లు, పాత్రల స్వభావాలను అర్థం చేసుకోవాలి. పార్ట్‌-బీలో మార్కులు సాధించేందుకు టెన్సెస్‌, యాక్టివ్‌/పాసివ్‌ వాయిస్‌, రిపోర్టెడ్‌ స్పీచ్‌, ప్రి పోర్షన్స్‌, లెటర్‌ రైటింగ్‌, డైరీ ఎంట్రీ, ఎస్సే స్పీచ్‌, ఇం టర్వ్యూ స్ర్కిప్ట్‌, నోటీస్‌ వంటి ఫార్మాట్లపై దృష్టి పెట్టాలి.

  • ప్యాసేజ్‌ చదివేందుకు, అన్సర్లు రాసేందుకు, చివరిలో చెక్‌ చేసుకునేందుకు సమయాన్ని విభజించుకోవాలి. హెడ్డింగ్‌, కీవర్డ్స్‌ అండర్‌లైన్‌ చేయాలి. పాయింట్ల వారీగా జవాబులు రాయాలి. హ్యాండ్‌ రైటింగ్‌, స్పష్టంగా నీట్‌గా ఉండేలా చూసుకుంటే జవాబు పత్రాల మూల్యాంకనంలో మంచి మార్కులు వస్తాయి.


zz.jpgగణితంలో వీటిపై దృష్టి సారించాలి..

గణితంలో మొత్తం 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పార్ట్‌-ఏలో 60 మార్కులకు, పార్ట్‌-బీలో 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. సమస్యలను సిద్ధాంతాల రూపంలో పరిష్కరిస్తేనే మార్కులు అధికంగా వస్తాయి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, సాంఖ్యక శాస్త్రం, బహుపదులు, రేఖీయ సమీకరణాల్లో వచ్చే గ్రాఫ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి. ఆబ్జెక్టివ్‌ పేపర్‌లోని ప్రశ్నలను కూడా జాగ్రత్తగా రాస్తే పూర్తి మార్కులు వస్తాయి.


గణితంలో తొందరపాటు వద్దు

చాలామంది విద్యార్థులు ఏటా గణిత పరీక్ష సమయంలో ఆందోళన చెందుతుంటారు. తెలిసిన ప్రశ్నలకు కూడా తప్పులు రాసి ఫెయిలవుతుంటారు. అలా కాకుండా ప్రశ్నపత్రం ఇచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. తెలిసిన వాటికి తొలుత సమాధానం రాయాలి.

రాంబాబు, మ్యాథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, జీహెచ్‌ఎస్ ఇసామియాబజార్‌


జీవశాస్త్రంలో 40/40 పొందడం సులువే

ప్రణాళికాబద్ధంగా చదివితే జీవశాస్త్రంలో 40 మార్కులకు 40 స్కోర్‌ చేయడం కష్టమేమి కాదు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో ముఖ్యమైన ప్రశ్నలు అంటూ ఏమీ ఉండవు. పాఠాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. తొలుత ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి. ఫ్లోచార్టులు, పట్టికలు, గ్రాఫ్‌లపై దృష్టి సారించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. అవయవదానం, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు, నీటి పొదుపు, ఇంధనవనరులు తదితర అంశాలపై, నిజజీవిత వినియోగంపై ప్రశ్నలు అడుగుతున్న తరుణంలో వాటిపై దృష్టిసారించాలి. సమాచార విశ్లేషణ నైపుణ్యం కింద నాలుగు మార్కుల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

- ఏవీ సుధాకర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ బయాలజీ, జెడ్పీఎస్ఎస్‌ మైలార్‌దేవ్‌పల్లి


ఈ వార్తలు కూడా చదవండి:

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కవిత కీలక సమావేశం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 05 , 2026 | 10:10 AM