శుభప్రదం... సౌభాగ్యదాయకం... శ్రావణం
ABN , Publish Date - Aug 16 , 2026 | 10:26 AM
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలోని వ్రతాలు, పూజలు అన్నీ భక్తిభావంతోనే కాక సామాజిక క్షేమాన్ని కాంక్షిస్తూ కూడా జరుగు తుంటాయి.
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలోని వ్రతాలు, పూజలు అన్నీ భక్తిభావంతోనే కాక సామాజిక క్షేమాన్ని కాంక్షిస్తూ కూడా జరుగు తుంటాయి. అలాంటి పూజలు, వ్రతాలకు శుభప్రదం... శ్రావణమాసం. చాంద్రమానం ప్రకారం వర్ష రుతువులో వచ్చే ఐదవ నెల ఇది. పౌర్ణమి ఏ నక్షత్రంతో కూడుకుని వేస్త ఆ మాసానికి ఆ పేరొస్తుంది. శ్రవణా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కనుక దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఈ మాసానికి భారతీయ జీవన విధానంలో ఎంతో విశిష్ట స్థానం ఉంది. లక్ష్మీదేవి, పరమశివుడు, మహా విష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఆరాధనకే కాక కొందరు దైవాంశ స్వరూపులు, కారణజన్ములు జనించిన మాసమిది. వ్రతాచరణకు ఎంతో అనుకూలమైనది.
గౌరీదేవి ఆరాధన...
శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి పూజలు, నోములు, వ్రతాలు గుర్తుకువస్తాయి. ఈ మాసంలో వచ్చే ప్రతీ మంగళవారం, శుక్ర వారం మహిళలకు ఎంతో ముఖ్యం. కొత్తగా పెళ్ళైన ముత్తైదువలు ఐదేళ్లపాటు ఈ మాసంలో ‘మంగళగౌరి వ్రతం’ ఆచరిస్తారు. తమ సౌభాగ్యం నిలిచి ఉండాలని, భర్త ఆయు రారోగ్యాలతో వర్థిల్లాలని గౌరీదేవిని భక్తితో ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన పండుగ ‘వరలక్ష్మీ వ్రతం’. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. ఒకవేళ ఆ రోజు వీలు కాకుంటే ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా వరలక్ష్మీ పూజ చేసుకో వచ్చు. ఇళ్లను తోరణాలతో, ముగ్గులతో అలంకరించి, కలశాన్ని స్థాపించి, లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. తొమ్మిది పోగుల తోరానికి పూజ చేసి చేతికి కట్టుకుంటారు. ముత్తైదు వులను పిలిచి తాంబూలాలు, వాయనాలు ఇవ్వడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.
శ్రావణ మాసం కేవలం విష్ణు, లక్ష్మీ ఆరాధనకే కాదు... శివారాధనకు కూడా పరమ పవిత్రమైనది. ఉత్తర భారతదేశంలో ఈ మాసాన్ని ‘సావన్’ అని పిలుస్తూ పూర్తిగా శివునికి చేేస పూజలు, అభిషేకాలకు తమ సమయాన్ని అంకితం చేస్తారు. ఈ నెలలో వచ్చే సోమవారాలు (శ్రావణ సోమవారాలు) ఎంతో మహిమగలవి. రోజంతా ఉపవాసం ఉండి... శివలింగానికి పాలు, నీరు, బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ మాసంలోనే ‘కావడి యాత్ర’ కూడా నిర్వహిస్తారు. భక్తులు పవిత్ర నదీ జలాలను కావళ్లలో తెచ్చి శివునికి అభిషేకం చేస్తారు.
రక్షాబంధన్...
శ్రావణ మాసంలో పండుగలకు కొదవ లేదు. నాగచతుర్థి, నాగపంచమి, గరుడ పంచమి వంటి పండగలు ఈ నెలలోనే వస్తాయి. అలాగే తోబుట్టువుల మధ్య అనురాగానికి ప్రతీక అయిన ‘రక్షాబంధన్’ (రాఖీ పౌర్ణమి) శ్రావణ పూర్ణిమ నాడే జరుపుకుంటారు. అక్కచెల్లెళ్లు తమ అన్నదమ్ముల మణికట్టుకు రక్షా సూత్రాన్ని కట్టి వారి రక్షణను కోరుతారు. అన్నదమ్ములు తమ తోబుట్టువులను ఎల్లవేళలా కాపాడతామని మాట ఇస్తూ కానుకలు అందిస్తారు.
ఇదే రోజున వేదపండితులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించే ‘ఉపాకర్మ’ను నిర్వహిస్తారు. ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పిస్తుంటారు. కృష్ణవిదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి జయంతిని జరుపుతారు. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలు చేస్తారు.
కృష్ణపక్ష ఏకాదశిన కామిక ఏకాదశిని ఆచరిస్తారు. ఈరోజున నవనీతాన్ని (వెన్న) దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కృష్ణపక్ష అమావాస్య తిథిన పొలాల అమావాస్యను ఆచరిస్తారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని ఆచరించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ పర్వదినాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందన్నది నమ్మకం.
ఇలా ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతిపరంగా కూడా శ్రావణ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వర్షాలు వెనుకబడి భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది. నదులు, చెరువులు జలకళను సంతరించుకుంటాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉంటారు. సృష్టి అంతా నూతన చైతన్యంతో నిండిపోతుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఈ నెలలో కేవలం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం, ఉపవాసాలు చేయడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సకల శుభాలను, ఐశ్వర్యాలను, భక్తి భావాన్ని ప్రసాదించే శ్రావణమాసం మానవ సంబంధాలను బలోపేతం చేస్తుంది. వ్రతాలు, పూజల కారణంగా బంధుమిత్రులు ఒకరినొకరు కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. భక్తి, ఆరోగ్యం, సామాజిక ఐక్యతల సమాహారంగా శ్రావణ మాసం కనిపిస్తుంది.
శ్రీమల్లి, 98485 43520
ఈ వార్తలు కూడా చదవండి:
వరుసగా రెండో ఏడాది ఖర్గే, రాహుల్ డుమ్మా
Read Latest AP News And Telangana News And International News And Telugu News