Share News

హోర్ముజ్‌పై ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాకు గట్టి కౌంటర్..

ABN , Publish Date - Aug 16 , 2026 | 08:36 AM

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

హోర్ముజ్‌పై ఇరాన్ కీలక నిర్ణయం.. అమెరికాకు గట్టి కౌంటర్..
Iran Oman Deal

టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. హోర్ముజ్‌ను తమ భూభాగంగా వాషింగ్టన్ ప్రకటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.


ఒప్పందంలో భాగంగా ఒమన్‌తో ఇతర అంశాలపై చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ.. నౌకల సురక్షిత రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ప్రత్యేకంగా జరిగాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ వెల్లడించారు. అయితే అమెరికా విధించిన ఆంక్షలు, నౌకాదళ దిగ్బంధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో పూర్తి స్థాయి భద్రతను పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.


హోర్ముజ్‌ను అమెరికా భూభాగంగా ప్రకటిస్తా: ట్రంప్

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హోర్ముజ్ వ్యవహారాన్ని మరింత వేడెక్కించాయి. శుక్రవారం నాడు న్యూయార్క్‌లో జరిగిన ఓ రాజకీయ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'ఇరాన్‌ను పూర్తిగా ఓడించిన తర్వాత త్వరలోనే హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తా' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ఆ వ్యాఖ్యలను సరదాగా చేసినట్లు వైట్‌హౌస్‌కు చెందిన ఓ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది.


ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటు కౌంటర్..

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు కలిగిన ఈ జలసంధి తమ ఆధీనంలోనే ఉంటుందని ఇరాన్ పేర్కొంది. 'హోర్ముజ్ జలసంధి ఇరాన్‌దే.. ఇప్పుడు.. భవిష్యత్తులోనూ ఇరాన్‌దే. ఈ జలసంధిని మూసివేయడం, తెరవడం ఇరాన్ ఆదేశాల మేరకే జరుగుతుంది' అని ఆ దేశ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు.


హోర్ముజ్‌పైనే పేచీ..

అమెరికా, ఇరాన్ మధ్య వివాదంలో హోర్ముజ్ జలసంధి ప్రధాన అంశంగా మారింది. ఈ జలమార్గంపై తమకు పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ చెబుతుండగా.. అన్ని వాణిజ్య నౌకలకు హోర్ముజ్‌లో స్వేచ్ఛగా రాకపోకలు సాగించే అవకాశం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిస్తే ఆ దేశంతో కొనసాగుతున్న అన్ని శత్రుత్వ చర్యలను నిలిపివేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాకుండా ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలోనూ అమెరికా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆ కథనం వెల్లడించింది. అయితే ఇరాన్ మాత్రం అమెరికా తమ డిమాండ్లను అంగీకరించి, అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే..

ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి

Updated Date - Aug 16 , 2026 | 08:45 AM