Share News

చేత వెన్నముద్ద...

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:08 PM

శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన చిలిపి చేష్టలను, దివ్య లీలలను శ్రీమద్భాగవతం అద్భుతంగా వర్ణించింది.

చేత వెన్నముద్ద...
Sri Krishna Janmashtami

శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన చిలిపి చేష్టలను, దివ్య లీలలను శ్రీమద్భాగవతం అద్భుతంగా వర్ణించింది. ఆబాలగోపాలానికీ ప్రేమపాత్రుడైన ఆ చిన్ని కృష్ణుడి రూపంలో స్వామి కనిపించే అపురూపమైన క్షేత్రం ఒకటి ఉంది. అదే... ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్న శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి ఆలయం.

గుంటూరు జిల్లాలోని కొండవీడు మహాదుర్గం... తెలుగువారి చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం. శత్రు దుర్బేధ్యమైన అక్కడి కొండల పాదాల దగ్గర, పశాంతమైన గ్రామీణ వాతావరణంలో... ముద్దులొలికే పసిబాలుడిగా... ‘భక్తులకు పంచడానికా’ అన్నట్టు కుడి చేతిలో వెన్నముద్ద పట్టుకొని శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. మూడున్నర అడుగుల ఎత్తున ఉండే ఈ బాలకృష్ణుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత అరుదైనది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చెంగిజ్‌ఖాన్‌పేట గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి ప్రాచీన నామం సింగసానిపేట. పూర్వం ఇక్కడ సింగసాని (సింగమ్మ) అనే ప్రసిద్ధ నాట్యకళాకారిణి నివసించేదనీ, ఆమె పేరు మీదుగా ఆ గ్రామం ఏర్పడిందని పెద్దలు చెబుతారు. కాలక్రమేణా... దక్కన్‌ ప్రాంతంలో ముస్లింల పాలనా కాలంలో ఈ గ్రామం పేరు చెంగిజ్‌ఖాన్‌పేటగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం.


రాయలవారి ప్రతిష్ఠ

ఈ క్షేత్రానికి, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలకు అనుబంధం ఉంది. స్థానిక చరిత్ర ప్రకారం... కొండవీడు కోటపై రాయలు దండయాత్రకు వచ్చిన రాయలుకు... ఆ కోటను జయించడం సవాలుగా మారింది. అప్పుడు తిమ్మరుసు సలహా మేరకు ఉదయగిరి కొండల నుంచి తీసుకువచ్చిన బాలకృష్ణుడికి 21 రోజుల పాటు విశేష పూజలు, వెన్న నైవేద్యంతో అర్చనలు జరిపించారు. ఆ పూజాఫలంగా కొండవీడు కోటపై విజయం సాధించారు. స్వామికి కృతజ్ఞతగా ఆ కొండ పాదాల చెంత అద్భుత ఆలయాన్ని రాయలు నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ జరిపించారు. ఆ తరువాత అన్యపాలకుల దండయాత్రల నుంచి కాపాడడం కోసం ఆ విగ్రహాన్ని భూగర్భంలో స్థానికులు భద్రపరిచారు.


కొంతకాలం గడిచిపోయింది. 1712వ సంవత్సరంలో... ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా ఆ విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలిసి... అప్పటి చిలకలూరిపేట జమీందారు తన పట్టణానికి దాన్ని తరలించి, ఆలయ నిర్మాణం చేయించాలని సంకల్పించాడు. విగ్రహాన్ని ఎడ్లబండి మీద తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా... బండి ఇరుసు విరిగిపోయింది. విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఆ రోజు రాత్రి జమీందారు కలలో స్వామి కనిపించి... విగ్రహం ఆగిన చోటనే దేవాలయం నిర్మించాలని ఆదేశించాడు. ఆ ప్రకారం ఆ ఆలయ నిర్మాణం జరిగింది.


ముద్దులొలికే పసి బాలుడిలా...

శిల్పశాస్త్ర రీత్యా ఈ విగ్రహం అత్యంత అరుదైనది. ఉత్తమ పంచతాళంలో... అన్ని ప్రమాణాలకు చక్కగా సరిపోయే అపూరూప సౌందర్యం దానిలో ఉట్టిపడుతూ ఉంటుంది. స్వామివారు పద్మపీఠం మీద కాకుండా... నేల మీద ముద్దులొలికే పసిబాలుడిలా మోకాళ్ళపై పాకుతూ (జాను చలన భంగిమ) దర్శనమిస్తారు. కుడిచేతిలో గుండ్రటి వెన్న ముద్ద పట్టుకొని, ఎడమచేతిని వెన్నకుండపై ఆనించి ఉంటారు. చందమామలాంటి గుండ్రటి ముఖం,


vvv.jpgఉంగరాల జుట్టు, విశాలమైన నేత్రాలు, కోటేరులాంటి ముక్కు, పాలుగారే నిండైన గుండ్రటి బుగ్గలు, చక్కటి చిరునవ్వులొలికే పెదవులు, సన్నటి గీతతో నొక్కుకున్న చిన్ని చుబుకం, చెవులకు వేలాడే శోభాయమానమైన మకర కుండలాలు, భుజకీర్తులు, చిన్నారి చేతులకు కేయూరాలు, మణికట్టు దగ్గర కంకణాలు, మెడలో పులిగోరు పతకంతో కూడిన గొలుసు, అనేక ఆభరణాలు కలిగిన వక్షస్థలం, గుండ్రటి నడుముకు బంగారు మువ్వల మొలతాడు, పాదాలకు అలంకరించిన గజ్జెల కడియాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక మోకాలు నేలకు ఆనించి, మరో మోకాలు పైకి ఉంచి పారాడే యానక స్వరూపం అది.


సంతాన ప్రదాత

స్వామి పులిగోరు పతకం ధరించడమే విశేషం అనుకుంటే... ఆయన భుజాల మీద శంఖ, చక్ర ముద్రలు ఉండడం ఇంకా విశేషం. సాధారణంగా వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుల విగ్రహాలకు, ఆళ్వారుల ప్రతిమలకు మాత్రమే ఉండే ఆ ముద్రలు ఇక్కడ బాలకృష్ణుడి భుజాల మీద ఉండడం ఎంతో విశిష్టమైన విషయం. ఈ ఆలయ ప్రాంగణంలో వేణుగోపాలస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇది సంతానప్రాప్తిని కలిగించే ఆలయంగానూ ప్రసిద్ధి చెందింది. సంతానం లేని దంపతులు 21, 25 లేదా 41 రోజుల పాటు రోజూ ఆవు వెన్నను సమర్పించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. శ్రీకృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం రోజుల్లో ఈ ఆలయంలో విశేష అభిషేకాలు, వెన్న అలంకారాలు కన్నులపండువగా జరుగుతాయి.

  • డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి 9440525788


ఈ వార్తలు కూడా చదవండి:

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 12:08 PM