Share News

కృష్ణస్తు భగవాన్‌ స్వయం

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:17 AM

పరమ సత్య స్వరూపుడిగా వర్ణిస్తాయి. బాలుడిగా గోకులంలో లీలలు చేసినవాడే భగవద్గీతను బోధించిన పరమాత్మగా, భక్తుల ప్రేమకు వశుడైన భగవానుడిగా దర్శనమిస్తాడు.

కృష్ణస్తు భగవాన్‌ స్వయం

వేదాలు, పురాణాలు శ్రీకృష్ణుణ్ణి కేవలం చారిత్రక మహాపురుషునిగా కాకుండా... పరమ సత్య స్వరూపుడిగా వర్ణిస్తాయి. బాలుడిగా గోకులంలో లీలలు చేసినవాడే భగవద్గీతను బోధించిన పరమాత్మగా, భక్తుల ప్రేమకు వశుడైన భగవానుడిగా దర్శనమిస్తాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి... ఆయన అవతార రహస్యాన్ని, దివ్య గుణాలను, భగవత్తత్త్వాన్ని మరింత లోతుగా తెలుసుకొనే పవిత్రమైన సందర్భం.

శావతారాలలో అనేక అవతారాలు నిర్దిష్టమైన ధర్మ కార్యాల కోసం ఆవిర్భవించాయి. శ్రీకృష్ణుడు ఎల్లవేళలా ఆనంద నిలయుడు. శాస్త్రాల ప్రకారం... భగవంతునికి ఉన్న 64 గుణాలలో... జీవాత్మల్లో గరిష్టంగా యాభై, పరమ శివునిలో యాభై అయిదు, శ్రీమహావిష్ణువులో అరవై గుణాలు ద్యోతకం అవుతాయి. శ్రీకృష్ణుని స్వరూపంలో మాత్రమే అరవై నాలుగు గుణాలు సంపూర్ణంగా గోచరిస్తాయి. లీల, ప్రేమ, వేణు, రూప మాధుర్యాలనే నాలుగు అసమాన గుణాలు కేవలం శ్రీకృష్ణునిలోనే ప్రకటితమవుతాయి. అందుకే ఆయనను అంశావతారంగా కాకుండా సంపూర్ణావతారంగా, స్వయం భగవంతుడిగా ‘శ్రీమద్భాగవతం’ కీర్తించింది.


పరమ సత్య స్వరూపం

పరమ సత్యం అనేది బ్రహ్మం, పరమాత్మ, భగవాన్‌ అనే మూడు స్థాయిల్లో వ్యక్తం అవుతుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి. సర్వవ్యాప్తమైన నిరాకార కాంతిని ‘బ్రహ్మం’ అని, ప్రతి అణువులోను, ప్రతి హృదయంలోను కొలువై ఉండే స్థానిక రూపాన్ని ‘పరమాత్మ’ అని, సకల ఐశ్వర్య, దివ్య కళ్యాణ గుణాలు కలిగిన ఆది పురుషుడి స్వరూపాన్ని ‘భగవాన్‌’ అని అంటారు. ‘కృష్ణస్తు భగవాన్‌ స్వయం’ అనే వాక్యం శ్రీకృష్ణుడే సకల అవతారాలకు మూలం అని, పరమసత్యం తాలూకు అత్యున్నత వ్యక్తిగత స్వరూపం అని స్పష్టం చేస్తుంది. ‘మల్లానాం అశనిర్నృణాం నరవరః...’ అనే శ్రీమద్భాగవత శ్లోకం ప్రకారం.. శ్రీకృష్ణుడు మల్ల యుద్ధ రంగస్థలంలోకి ప్రవేశించినప్పుడు... అక్కడ ఉన్నవారు తమతమ భావాలను బట్టి ఆయనను విభిన్న రూపాలలో దర్శించారు. మల్లయోధులు వజ్రాయుధంగా, సాధారణ మానవులు నరోత్తమునిగా, స్త్రీలు మన్మధుడిగా, గోపాలురు తమ ఆప్తునిగా, తల్లిదండ్రులు ముద్దుల బిడ్డగా, దుష్టరాజులు తమను శిక్షించే పాలకునిగా, కంసుడు సాక్షాత్తూ మృత్యువుగా, అల్పబుద్ధి కలిగినవారు కేవలం ఒక భౌతిక విశ్వరూపంగా, యోగులు నిర్గుణ పరమసత్యంగా చూశారు. ఇది భక్తుని శరణాగతిని బట్టి భగవంతుడు వివిధ రసాల (భావాల) ద్వారా ప్రతిస్పందిస్తాడనే భక్తితత్త్వాన్ని తెలియజేస్తోంది. కృష్ణుడు సమస్త రసాలకు మూలమైన అఖిల రసామృత సింధువు. లౌకిక బంధాలలో ప్రేమను వెతుకుతూ నిరాశ చెందే జీవుడికి... భగవంతునితో శాశ్వతమైన ఏదో ఒక రస సంబంధాన్ని తిరిగి జోడించుకోవడమే నిజమైన జీవిత సాఫల్యమని ఆయన దివ్యలీల మనకు బోధిస్తోంది.


బాల్య చేష్టలు కాదు... దివ్య లీలలు

వెన్న దొంగిలించడం, గోప బాలురితో ఆడుకోవడం లాంటి శ్రీకృష్ణుని చేష్టలు సామాన్య బాలుడికి చెందినవిలా కనిపించినా... అవి దివ్య లీలలు. ఆయన శరీరం పంచభూతాలతో కూడినది కాదు. ఆధ్యాత్మికమైన సచ్చిదానంద స్వరూపం. బ్రహ్మాండ భాండానికి సృష్టికర్త అయిన ఆయన ఆకలి కోసం వెన్న దొంగిలించలేదు. త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరించినప్పుడు... లంకను చేరేందుకు, సీతమ్మను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా సాయపడిన వానర సైన్యానికి ఆనాడు ఏ ప్రతిఫలం ఇవ్వలేకపోయాననే కృతజ్ఞతా భావనతో... వారు ద్వాపరయుగంలో తన సహచరులుగా జన్మించగా... వెన్నను దొంగిలించి మరీ తన స్వహస్తాలతో తినిపించి రుణం తీర్చుకున్నాడని ప్రతీతి. తన తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు లొంగి, వారి ఆనందం కోసమే లీలామానుషంగా ఈ పవిత్ర లీలలను ఆయన ఆచరించాడు.


హరినామస్మరణ విశిష్టత

కలియుగంలో కఠినమైన పూజలు, తపస్సుల కన్నా ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణకృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామరామ హరే హరే’ అనే పదహారు నామాల మహామంత్రం అన్ని కల్మషాలను హరిస్తుంది. మానవ దేహం అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అనే 16 పొరల్లో బందీగా ఉంటుంది. ఈ మహామంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మనస్సు పవిత్రమై, ఒత్తిడి, అశాంతి తొలగి స్థిరత్వం సిద్ధిస్తుంది. ఈ నామస్మరణ చేసే సాధకుడికి ప్రతిరోజూ జన్మాష్టమే అవుతుంది.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - Sep 04 , 2026 | 06:18 AM