Share News

గీతాచార్యుని రాజనీతి

ABN , Publish Date - Sep 04 , 2026 | 11:39 AM

శ్రీకృష్ణుడు గొప్ప వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు. మహాభారతం పొడుగునా ఆయన రాజకీయ చతురత, సమయస్పూర్తి కనిపిస్తాయి.

గీతాచార్యుని రాజనీతి

శ్రీకృష్ణుడు గొప్ప వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు. మహాభారతం పొడుగునా ఆయన రాజకీయ చతురత, సమయస్పూర్తి కనిపిస్తాయి. యుద్ధం ఆయన అభిమతం కాదు. కౌరవులు, పాండవుల మధ్య ఎలాగైనా సంధిని కుదర్చాలని, వారిని ఏకం చేయాలని, వారు సఖ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కృష్ణుడు ఏ పని చేసినా న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరించి చేశాడు. స్వార్థంతో ఏదీ చేయలేదు. సంకుచితంగా ఏనాడూ ఆలోచించలేదు. అధికారం కోసం దౌర్జన్యాలకు, దుశ్చర్యలకు తెగబడలేదు. ఆమాటకొస్తే ఆయనకు రాజ్య కాంక్షే లేదు.

సంక్షోభ నివారణ కోసం...

రాజకీయం ఎప్పుడూ అధికారం, సంప్రతింపులు, చర్చలు, వ్యూహాలతో సాగుతూ ఉంటుంది... బలవంతంగా అణచివేసే క్రూరత్వంతో కాదు. ‘‘నీతివర్తనులు, శక్తిమంతులు, శూరులు అయిన మిత్రులతో సంధి చేసుకోవాలి. ఉత్తమమైన మిత్రుల సలహాలు తీసుకుంటూ పాలన సాగించాలి. శాంతి కావాలంటే బలం, బలగం ఎంత ముఖ్యమో... వివేకం, జ్ఞానం కూడా అంతే ముఖ్యం.


అసలు యుద్ధం వరకూ వెళ్ళనే వెళ్ళకూడదు. ఒక వేళ వెళ్ళాల్సి వస్తే... ‘నా అంతటివాడు లేడు’ అనే అహంకారాన్ని వదిలెయ్యాలి. తర తమ భేదం లేకుండా మిత్రులు అనుకున్న రాజులందరితో పొత్తులు పెట్టుకోవాలి. నీవాళ్ళు అనుకున్న వారందరినీ చేరదీయాలి. సత్సంబంధాలు పెంచుకోవాలి’’ అని హితవు చెప్పాడు శ్రీకృష్ణుడు. యుద్ధం అంటేనే వినాశనం, అశాంతి, జన సంక్షోభం. కురు-పాండవ యుద్ధం తరువాత సంభవించే దుష్పరిణామాలు తెలిసే... యుద్ధానికి ముందు శాంతిదూతగా కౌరవ సభకు కృష్ణుడు వెళ్ళాడు.


తన శక్తి కొద్దీ సంధికోసం ప్రయత్నించాడు. తెలివైన నాయకులు ఎవరైనా... సంక్షోభాన్ని నివారించడానికి ముందు పలుమార్లు చర్చలు జరుపుతారు. సంధి ప్రయత్నాలు, రాయబారాలు చేస్తారు. అవేవీ బలహీనతకు గుర్తు కాదు. అజేయమైన శక్తికి సంకేతాలు. కృష్ణుడి సంధి ప్రయత్నాలు ఫలించలేదు. ‘ఎలాగో వచ్చాం కదా!’ అని కౌరవుల శక్తియుక్తులు, బలాబలాలు తెలుసుకొని వెళ్ళాడు. మహా మహా వీరులందరినీ పాండవులకు జత చేశాడు. మొత్తం ఏడు అక్షౌహిణుల సైన్యం సమకూరింది. యుద్ధంలో కౌరవులు చెల్లాచెదురయ్యారు. పాండవులు విజయం సాధించారు.


ఆ హక్కు మనకు లేదు...

‘‘పని చేయడమే కానీ, దాని ఫలితాన్ని ఆశించే హక్కు, శాసించే హక్కు మనకు లేవు. అంతమాత్రాన పని చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. పెద్దలు ఏది చేస్తే చిన్నవాళ్ళు అది చేస్తారు. పెద్దలు ఏ ప్రమాణాలను నెలకొల్పితే వాటిని లోకం మొత్తం అనుసరిస్తుంది. సంక్లిష్టమైన సమస్యలను అధిగమించడానికి సద్గురువును ఆశ్రయించాలి. అతను ఆచార్యుడై ఉండాలి. శిష్యులను అంతశ్శోధన వైపు మళ్ళించాలి. వారిలోని అహంకారాన్ని తొలగించాలి. ఇవన్నీ చేయగలిగితే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి’’ అని చెప్పాడు కృష్ణుడు.


‘‘ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా పని చేయాలి. ఈ రోజు ఈ పని చేస్తే నాకు రేపు ఈ లాభం కలుగుతుందని ఎలా అనుకుంటావు? అసలు ‘రేపు’ అనేది నీది కానప్పుడు, నిజం కానప్పుడు దానితో బంధం ఎందుకు?’’ అని కూడా అన్నాడు. వెంటనే మనం ‘‘ఫలితం ఆశించకుండా ఎందుకు చెయ్యాలి?’’ అని అడుగుతాం. కేవలం ఫలితం ఆశించి మాత్రమే పని చేయకూడదు. చేసే పనిని శ్రద్ధగా, చిత్త శుద్ధితో చేయాలి. తెలివిగా చేయాలి. భగవంతుణ్ణి నమ్మి చెయ్యాలి. అప్పుడు అవి తప్పకుండా శుభాన్ని, లాభాన్ని కలిగిస్తాయి.


వైఫల్యాలు సోపానాలుగా...

ఎప్పుడూ సంఖ్యా బలాన్ని నమ్ముకోకండి. తెలివితో సమర్థతతో, సమయస్ఫూర్తితో, మధురమైన మాటలతో నెగ్గాలని అనుకోండి. మానవ మనస్తత్వాన్ని అంచనా వేస్తూ అడుగులు కదపాలి. శ్రీకృష్ణుడు చేసినది అదే. శకుని జిత్తులు, మాయలు, దుర్యోధనుడి అహంకారం, లెక్కలేనితనం, ధిక్కార వైఖరి, అన్నీ తానే అనుభవించాలనే పేరాశ, అర్జునుడి భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ, కర్ణుడి అంతర్మధనం, భీష్ముడి అచంచల రాజభక్తి... అన్నీ ఆయనకు తెలుసు. ఎవరిమీద ఏ యుక్తులు ప్రయోగించాలో తెలిసినవాడు కాబట్టి... వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతూ, అర్జునుడికి సమయోచితమైన సలహాలు ఇస్తూ... అతణ్ణి విజయుణ్ణి చేశాడు.


నిత్యం కురు కర్మ త్వం కర్మ జ్యాయో... నీకు అప్పగించిన పనిని శ్రద్ధగా, గొప్పగా, అందరూ మెచ్చుకొనేలా చెయ్యి. స్వల్పకాలిక వ్యూహాలతో కొద్దిపాటి విజయమే లభిస్తుంది. గొప్ప విజయాలు సాధించాలంటే వ్యూహాలు కూడా గొప్పగా ఉండాలి. దీర్ఘకాలికంగా ఉండాలి. సమస్య ఎదురైనప్పుడు భయపడకూడదు. సావధానంగా ఆలోచించి, అడ్డంకులను తొలగించుకుంటూ పోవాలి. విజయాలకు పొంగిపోకూడదు. అపజయాలకు కుంగిపోకూడదు. జయాపజయాలకు అతీతంగా బతకడం నేర్చుకోవాలి. వైఫల్యాలను విజయానికి సోపానాలుగా చేసుకోవాలి... ఇదీ కృష్ణుడి ఉపదేశం.

  • ప్రయాగ రామకృష్ణ


ఈ వార్తలు కూడా చదవండి:

రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..

పదవి ఉన్నా లేకున్నా నా గౌరవం నాకుంది

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 11:39 AM