ఇంట్లో వినాయక ప్రతిష్ఠ చేస్తున్నారా? ఈ నియమాలు తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Sep 13 , 2026 | 03:36 PM
గణేశ్ చతుర్థి వచ్చిందంటే ఇళ్లలో సందడి మొదలవుతుంది. అయితే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వినాయక చవితి వచ్చిందంటే ఇళ్లలో సందడి మొదలవుతుంది. గణనాథుణ్ని ఇంటికి తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేక కుటుంబాల్లో ఆనవాయితీ. ఈ ఏడాది గణేశ్ చతుర్థి సెప్టెంబర్ 14న(సోమవారం) జరుపుకోనున్నారు. చతుర్థి తిథి సెప్టెంబర్ 14 ఉదయం ప్రారంభమై సెప్టెంబర్ 15 ఉదయం వరకు కొనసాగనుంది.
గణేశ్ చతుర్థిని విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు భక్తులు. ఇంటింటా వెనకయ్యను ప్రతిష్ఠించి కొందరు ఒకటిన్నర రోజు, మరికొందరు 3, 5, 7 లేదా 10 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి రోజున నిమజ్జనంతో ఉత్సవానికి ముగింపు పలుకుతారు. అయితే ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా పాటించాలని సంప్రదాయాలు, వాస్తు విశ్వాసాలు చెబుతున్నాయి.
గణపతి విగ్రహాన్ని ఏ దిశలో పెట్టాలి?
గణపతి ప్రతిష్ఠకు దిశకు ప్రాధాన్యం ఉందని వాస్తు, ఆచార సంప్రదాయాల్లో చెబుతారు. సాధారణంగా ఇంట్లో గణపతి విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఏర్పాటు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పూజ చేసేటప్పుడు భక్తులు తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సంప్రదాయాలు సూచిస్తాయి. అయితే ఇంటి నిర్మాణం, పూజాస్థలం, కుటుంబ ఆచారాలు ఒక్కో ఇంటికి భిన్నంగా ఉంటాయి. అందువల్ల దిశ విషయంలో స్థానిక ఆచారాన్ని లేదా పండితుల సూచనను అనుసరించడం మంచిది.
ఎలాంటి గణపతి విగ్రహం మంచిది?
ఇంట్లో పూజ కోసం సాధారణంగా కూర్చున్న గణపతి విగ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు. కూర్చున్న రూపం శాంతి, స్థిరత్వానికి ప్రతీకగా భావిస్తున్నట్టు ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. విగ్రహం విరిగిపోకుండా, దెబ్బతినకుండా ఉండటమూ ముఖ్యమే. మూషికం, చేతిలో మోదకం, భక్తులను ఆశీర్వదించే హస్తం వంటి లక్షణాలతో ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవడం ఆనవాయితీ.
వినాయకుణ్ని కూర్చోబెట్టే విధానం
సంప్రదాయం ప్రకారం.. గణపతి విగ్రహాన్ని నేలపై నేరుగా పెట్టకుండా ముందుగా ఒక చెక్క పీట లేదా ఎత్తైన పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి. దానిపై శుభ్రమైన ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరిచి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అంతకంటే ముందుగా ఆ ప్రదేశాన్ని ముందుగానే శుభ్రం చేసుకుని పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. గణేశుడిని ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జనం వరకూ.. ఆ ఇంటిని పూర్తిగా ఖాళీగా లేదా తాళం వేసి ఉంచకూడదనే నమ్మకం కొన్ని సంప్రదాయాల్లో ఉంది. ముఖ్యంగా నిత్యపూజ, దీపారాధన, నైవేద్యం కొనసాగించాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇంట్లో ఉండేలా చూసుకుంటారు. అయితే.. ఉద్యోగం, ప్రయాణం వంటి అనివార్య పరిస్థితులు ఉన్నవారు దీనిని కఠినమైన నియమంగా కాకుండా తమ కుటుంబ ఆచారం ప్రకారం నిర్వహించుకోవచ్చు.
రోజుకు ఎన్నిసార్లు పూజ చేయాలి?
గణపతి చతుర్థి సందర్భంగా ప్రతిష్ఠించిన విగ్రహానికి నిత్య పూజ, హారతి, నైవేద్యం చేయడం సంప్రదాయం. కొన్ని కుటుంబాల్లో రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పించే పద్ధతీ ఉంటుంది. గణేశ్ చతుర్థి రోజున షోడశోపచార పూజ నిర్వహించే సంప్రదాయం కూడా ఉంది. ఇందులో సంకల్పం, ఆవాహన, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం తదితర ఉపచారాలు ఉంటాయి. సాధారణంగా తులసి దళాలను గణపతికి సమర్పించకూడదనే అనే సంప్రదాయం ఉంది. దీనికి పురాణాల్లోని తులసి-గణపతి కథను కారణంగా చెబుతారు. అదే సమయంలో కొన్ని గణేశ్ చతుర్థి ఆచారాల్లో తులసిని మినహాయింపుగా ఉపయోగించే సంప్రదాయ ప్రస్తావనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ప్రాంతీయ, కుటుంబ ఆచారాన్ని అనుసరించడం మంచిది.
గణపతి స్థాపనకు సంబంధించిన దిశ, విగ్రహం రూపం, తొండం, ఆహార నియమాలు వంటి అంశాల్లో ప్రాంతానికీ, కుటుంబ సంప్రదాయానికీ అనుగుణంగా తేడాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయ ఆచారాలుగా చూడాలి. ఏదైనా ప్రత్యేక వ్రతం లేదా శాస్త్రోక్త పూజ నిర్వహించాలనుకుంటే కుటుంబ పురోహితుడు లేదా స్థానిక పండితుడి సూచన తీసుకోవడం ఉత్తమం.
ఇవీ చదవండి: