కోరిన కోర్కెలు తీర్చే వేల్పు కాణిపాకం వరసిద్ధుడు
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:32 AM
వినాయక చవితి నుంచి ప్రారంభమై 20 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలకు కాణిపాకం సిద్ధమవుతోంది.
వినాయక చవితి నుంచి ప్రారంభమై 20 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలకు కాణిపాకం సిద్ధమవుతోంది. తిరుమల వచ్చే భక్తులు నిత్యం వేలాదిగా కాణిపాకం సందర్శిస్తున్నారు. ఆ రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను పెంపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. చవితి నాటి నుంచి గణేశ్ దీక్షలు తీసుకునే భక్తుల కోలాహలం, బ్రహ్మోత్సవాలను దర్శించడం గొప్ప సుకృతం.
బాహుదా నదీ తీరాన విహారపురి గ్రామంలో పూర్వం ముగ్గురు అన్నదమ్ములుండేవారు. వారిలో ఒకరు అంధుడు, మరొకరు మూగవాడు, ఇంకొకరు బధిరుడు. వీరికి నదీ తీరాన ‘కాణి’ (ఎకరాలో పాతికవంతు) వ్యవసాయ భూమి ఉండేది. బావి నీటితో దాన్ని సాగు చేసేవారు అన్నదమ్ములు. ఓసారి కరువుతో బావి ఎండిపోగా లోతు చేసేందుకు అన్నదమ్ములు పలుగూ పారలతో బావిలోకి దిగారు. తవ్వుతుండగా ఇసుక పొరల్లో రాయి అడ్డువచ్చింది.
పలుగుపోటుకు ఆ రాయి నుంచి రక్తం స్రవించగా ఆ రక్త స్పర్శతో వారి వైకల్యాలు పోయాయి. వారి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇసుక తొలగించి చూడగా బావిలో వినాయక విగ్రహం దర్శనమిచ్చింది. పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం పూజలు చేశారు. వారు కొట్టిన టెంకాయల నుంచి వచ్చిన తీర్థపు నీళ్లతో ఆ పొలమంతా తడిసింది. తీర్థపు నీరు ‘కాణి’ వైశాల్యమున్న పొలమంతా పారినందున ఆ ప్రాంతాన్ని స్థానికులు కాణిపాకం (పారకం అంటే తమిళంలో ప్రవహించడం)గా పిలిచారు. కాలక్రమంలో కాణిపాకం పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. బావిలో స్వయంభువుగా వెలసిన ఇక్కడి స్వామి మూలవిరాట్టు బొజ్జ వరకే భక్తులకు దర్శనమిస్తోంది.
మిగిలిన సగం బావి లోపల ఉండి బయటికి కనిపించదు. బావి చుట్టూ స్వామివారికి గర్భగుడి నిర్మించారు. బావి నుంచి నిత్యం పాతాళజలం పెల్లుబికి వస్తూ ఉంటుంది. దేవుడి అభిషేకాలకు ఈ నీటినే వినియోగిస్తున్నారు. అభిషేకం సందర్భంలో అర్చకులు బావిలో వెలసిన స్వామి వారి చుట్టూ ఉబికి వచ్చే నీటిని చూపిస్తూ భక్తులకు స్థల మహాత్మ్యం గురించి చెబుతారు. స్వామివారి మూలవిరాట్టు శిల్పి చెక్కినట్టు కాక స్వామివారి ఆకారం కలిగిన సహజశిలగా కనిపిస్తుంది. మూలవిరాట్టు పరిమాణం క్రమేపీ పెరుగుతోంది. గతంలో చేయించిన కవచాలు ఇప్పుడు స్వామివారికి సరిపోకపోవడమే అందుకు నిదర్శనం.
బాహుదా నది పురాణ నేపథ్యం
కాణిపాక క్షేత్రాన్ని ఓ వైపు తాకుతు ప్రవహించే బాహుదా నది కూడ ఎంతో మహిమాన్వితమైనదని ప్రజల విశ్వాసం. పురాణాల్లో శంఖలిఖితులు అనే సోదరుల వృత్తాంతం దీనిని బలపరుస్తోంది. పూర్వం శంఖుడు, లిఖితుడు అనే విప్ర సోదరులుండేవారు. దొంగతనానికి పాల్పడిన ఆ సోదరుల చేతులను రాజు నరికిస్తాడు. పశ్చాత్తాపంతో బాధపడుతూ వారు కాణిపాక క్షేత్ర దర్శనానికి వచ్చి, గ్రామం పక్కనే ఉన్న నదిలో స్నానం ఆచరిస్తారు. ఈ పవిత్ర జలం కారణంగా వారికి బాహువులు (చేతులు) తిరిగి వస్తాయి. ఈ కారణం చేతనే నదికి బాహుదానది అని పేరు వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది.
చోళరాజులు నిర్మించిన ఆలయం
కాణిపాక ఆలయానికి వెయ్యేళ్ళకు పైబడిన చరిత్ర ఉన్నదని శాసనాధారాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో చోళరాజు మొదటి కుళోత్తుం గుడు ఆలయం నిర్మించగా, 14వ శతాబ్దంలో విజయనగర రాజులు అభివృద్ధిపరిచారు. కాణిపాకంలో చోళ, పాండ్య, గంగ రాజులకు సంబంధించిన మూడు శాసనాలు లభించాయి. చోళ శాసనంలో కాణిపాకం ‘కావణిపాక్కం’గా పేర్కొన్నారు. కాణిపాక దేవస్థానానికి వరదరాజస్వామి, మణికంఠేశ్వరాలయాలు అనుబంధంగా ఉన్నాయి. ఇవి ప్రాచీనమైనవి. వినాయక ఆలయంలో వీరాంజనేయస్వామి ఉపాలయం ఉండగా, మణికంఠేశ్వరాలయంలో మహాగణపతితో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరారు. వరదరాజస్వామి గుడిలో శ్రీదేవి, భూదేవీ సమేత వరదరాజస్వామి వెలిశారు. దీంతో కాణిపాకం అద్వైతక్షేత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ ఆలయం సత్యప్రమాణాలకు ప్రసిద్ధి. కాణిపాక క్షేత్రంలో పెళ్లిళ్లు చేసుకుంటే వారి జీవితాలు బాగుంటాయని అందరి నమ్మకం.
14 గ్రామాలకు చెందిన భక్తులే ఉభయదారులు
వరసిద్ధుని ఆలయం దినదినాభివృద్ధి చెంది కాలక్రమంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్లింది. కైంకర్యాలను దేవాదాయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. అయితే వార్షిక బ్రహ్మోత్సవాలను మాత్రం ఆలయ ఉభయదాతలు సొంత ఖర్చులతో నిర్వహించడం విశేషం. వరసిద్ధుని బ్రహ్మోత్సవాలను మరెక్కడా లేని విధంగా కాణిపాక ఆలయ ప్రాంతంలో ఉన్న 14 గ్రామాల భక్తులు ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వాహనాన్ని అప్పట్లో పెద్దలు అప్పగించి వారి చేత ఉత్సవాలను నిర్వహించేవారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. వారి వారి వాహనాన్ని నిర్వహించడానికి అవసరమైన నగదు వారే సమకూర్చుకుంటారు. ఆ వాహనాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి కాణిపాకం పురవీధులలో ఊరేగిస్తారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు ఘనంగా, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా నిర్వహిస్తారు.
ఆలయం సర్వాంగ సుందరం
తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కాణిపాక క్షేత్రాన్ని రూ.25 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నిధులతో పాటు అదనంగా రూ.8 కోట్లతో ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రెండు కల్యాణ మండపాలు, అధునాతన వసతులతో అతిఽథి గృహాలు నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే యాత్రికులు బస చేసేందుకు సౌకర్యంగా ఉంటుంది. దీంతో పాటు వరసిద్ధుడి ఆలయం ఎదుట ఉన్న పురాతన పుష్కరిణిని రూ.4 కోట్ల వ్యయంతో 60 అడుగుల దూరం ముందుకు మార్చనున్నారు. పుష్కరిణి ఇక్కడి నుంచి మారితే ఈ ప్రాంతంలో స్వామివారికి నిర్వహించే ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి వాహనాలను ఇక్కడ నిలుపుతారు.
గణేష్ ఇరుముడులు ప్రత్యేకం
వరసిద్ధుడి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయిన రోజు నుంచి భక్తులు గణేష్ దీక్షను తీసుకుంటారు. స్థానికంగా ఉన్న వారు దీక్ష తీసుకుంటే వారికి ఆలయ అధికారులు మూడు పూటల బిక్షను ఏర్పాటు చేస్తారు. అలాగే వారు దీక్ష నియమాలు పాటించడానికి అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు చూసుకుంటారు. వారం రోజులు, 15 రోజులు, 21 రోజులు దీక్షలు తీసుకుంటారు. ప్రస్తుతం కాణిపాకంలో గణేష్ దీక్ష తీసుకునే భక్తుల సంఖ్య నానాటికీ క్రమంగా పెరుగుతోంది.
పెరుగుతున్న భక్తులు
వరసిద్ధుని ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. గతంలో రోజుకు ఐదు నుంచి పది వేల మంది భక్తులు ఆలయానికి విచ్చేసే వారు. ఇప్పుడు ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం వరసిద్ధుని ఆలయానికి సాధారణ రోజులలో 10 నుంచి 15 వేల మంది వరకు భక్తులు విచ్చేస్తారు. ప్రత్యేకమైన రోజులలో 25 వేల నుంచి 50 వేలకు మించి భక్తులు ఆలయానికి విచ్చేస్తున్నారు. శని, ఆదివారాలలో ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారు. అలాగే ఆలయ గోశాలలో 187 ఆవు, దూడలు ఉన్నాయి.
- గాజుల మంజునాథ
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఐరాల
ఫోటోలు: పలుకూరి పవన్‌కుమార్
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిః
Read Latest AP News And Telangana News And International News And Telugu News