Share News

శ్రీ సిద్ధివినాయక వ్రతకల్పము

ABN , Publish Date - Sep 13 , 2026 | 10:14 AM

వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి.

శ్రీ సిద్ధివినాయక వ్రతకల్పము
Vinayaka Chavithi

వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్ళను అలంకరించుకోవాలి. కుటుంబ సభ్యులంతా తలంటుకొని స్నానం చేయాలి. దేవుని గది ఉంటే అందులో లేదా పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీటవేసి, దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. తెచ్చిన పూజా సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి. దానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు, పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరిణ ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు, కుంకుమలు అంటుతాయి కాబట్టి చేతికింద ఒక శుభ్రమైన గుడ్డను ఉంచుకుంటే బాగుంటుంది.


పూజకు కావలసిన సామగ్రి

పసుపు, కుంకుమ, గంధం, అగరువత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన వత్తులు. వినాయకుడి ప్రతిమ, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు.

చిన్నారి దేవుళ్ళ పండుగ వినాయక పూజా విధానం చిన్నారులను అమితంగా ఆకర్షిస్తుంది. వారికి పూజా విధానం, మన ఆచార సంప్రదాయాలు నేర్పేందుకు ఇది చక్కని అవకాశం.

వివిధ రకాల ఆకులతో దేవుడ్ని పూజించడం ద్వారా వారికి ప్రకృతి ప్రాధాన్యతను వివరించే వీలుంది. చిన్నారులకు వీలుంటే రోజూ వేసుకొనే దుస్తులకు భిన్నమైన బట్టలు వేస్తే వారికి వినాయకచవితి పట్ల మరింత ఆసక్తి పెరుగుతుంది. ఒకటి, మూడు, ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాన్ని తయారు చేసి, పూజలో ఉంచి దానిని పిల్లలు, పెద్దలు అందరూ ధరించవచ్చు.

ముందుగా కుంకుమ బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్థించుకోవాలి.


ప్రార్థన:

శ్లో ॥ శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥

అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ॥

శ్లో ॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి॥


book2.jpg

శ్లో ॥ లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః

యేషామిందీవర శ్యామో హృదయస్థో జనార్దనః ॥

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ॥

సుమఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః,

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః

ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః,

వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః

అష్టావష్టౌ చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి

విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమే తథా

సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే

అభీప్సితార్థ సిద్ధర్థ్యం, పూజితో యస్సురైరపి,

సర్వవిఘ్నచ్ఛిదేతస్మై గణాధిపతయే నమః ॥


(నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతితో ఉద్ధరిణ పట్టుకుని, నీటి పాత్ర నుంచి మూడుసార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ్య అంటూ ఉద్ధరిణతో నీటిని తీసుకుని చేతిని కడుక్కోవాలి.)

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః.


ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషా మ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం చేయాలి. నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ, గాయత్రీ మంత్రాన్ని ఉచ్ఛరించాలి)

ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః ఓగ్‌మ్‌ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌. ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌.

(దీపారాధన వెలిగించి ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి)


book3.jpgసంకల్పం : ఓం శ్రీశ్రీ మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తే అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య .... ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి), అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే శుక్ల పక్షే చతుర్థ్యాం తిథౌ ఇందు వాసర యుక్తాయాం, శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభ తిథౌ, శ్రీమాన్‌ ... గోత్రః ... నామధేయః, శ్రీమతః ... గోత్రస్య ... నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాంఛాఫల సిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షేప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి) ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ గణాధిపతి పూజాం కరిష్యే శ్రీ తదంగ కలశపూజాం కరిష్యే


కలశపూజ:

కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య శ్రీ తస్యోపరి హస్తం నిధాయ ।

(కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు ఉంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)

కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్ర సమాశ్రితః

మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృతాః,

కుక్షౌతుసాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః

అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ॥

ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః

(మన వద్ద ఉన్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు ఉంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్ధతిలో తిప్పాలి)


book3.2.jpgశ్లో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు ॥

కలశోదకేన పూజాద్రవ్యాణి, దేవం, ఆత్మానం చ సంప్రోక్ష్య

తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.


విఘ్నేశ్వర పూజ :

గణానాంత్వాం గణపతిగ్‌ం హవామహే,

కవిం కవీనా ముపమశ్రవస్తమం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః

ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం ॥

శ్రీ మహాగణాధిపతయే నమః ॥

ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)


ధ్యానం :

శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే॥

అనే శ్లోకం చదువుతూ పూలూ అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాల చెంత ఉంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ, అక్షతలు కానీ చల్లరాదు.

ధ్యాయామి ధ్యానం సమర్పయామి॥

ఆవాహయామి ఆసనం సమర్పయామి॥

పాదయోః పాద్యం సమర్పయామి॥

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి॥

ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి॥

అని చెబుతూ ఉద్ధరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి.


book3.3.jpg(పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేయాలి.)

యధాభాగం గుడం నివేద యామి॥

శ్రీ మహాగణాధిపతి స్సుప్ర సన్నో, సుప్రీతో, వరదోభవతు॥

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి॥

అంటూ పూజ చేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై ఉంచుకోవాలి.

శ్రీ మహాగణాధిపతియే నమః

యథాస్థానం ప్రవేశయామి

శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ

అంటూ పసుపు గణపతిని కొద్దిగా తూర్పువైపుకు కదిలించి.. అక్షతలు వేసి నమస్కారం చేయాలి.

మరలా ఆచమనం చేసి పైన సూచించిన విధంగా మరల సంకల్పం చెప్పుకోవాలి.

అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే.

తదంగ ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే

అంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.


శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ :

(విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి)

ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం - ఇత్యాద్యేన ప్రాణప్రతిష్ఠాపనం కృత్వా, నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః

శ్లోస్వామిన్‌ సర్వజగన్నాథ యావత్పూజావసానకం

తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్‌ సన్నిధిం కురు॥

అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీ (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)


షోడశోపచార పూజా :

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్‌

విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం

పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్‌ ॥

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం

భక్తాభీష్టప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥

ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం

చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥

శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి ॥ (వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)


అత్రాగచ్ఛ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర

అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ ॥

ఆవాహయామి ॥ (మరల అక్షతలు వేయాలి)

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్‌

రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌

ఆసనం సమర్పయామి ॥ (అక్షతలు లేదా పూలు వేయాలి)

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన

గృహాణార్ఘ్యం మయాదత్తం గన్ధపుష్పాక్షతైర్యుతమ్‌

అర్ఘ్యం సమర్పయామి ॥ (ఉద్ధరిణతో నీరును స్వామికి చూపించి పక్కన ఉంచుకున్న పాత్రలో వేయాలి)

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక

భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన

పాద్యం సమర్పయామి (మరలా కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి)

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత

గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో

ఆచమనీయం సమర్పయామి (కొంచెం నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి)

దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్‌

మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే

మధుపర్కం సమర్పయామి (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.


స్నానం

పంచామృతైర్దేవ గృహాణ గణనాయక

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత

పంచామృత స్నానం సమర్పయామి ॥ (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు కలిపి స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి)

గంగాది సర్వ తీర్థేభ్యః ఆహృతై రమలైర్జలైః

స్నానం కురుష్వ భగవన్వుమాపుత్ర నమోస్తుతే

శుద్ధోదక స్నానం సమర్పయామి॥ (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం

శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ

వస్త్రయుగ్మం సమర్పయామి ॥ (స్వామికి వస్ర్తాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు)


book3.4.jpgరాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్‌

గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక

ఉపవీతం సమర్పయామి ॥ (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి)

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం

విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌

గంధం సమర్పయామి ॥ (కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)

అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాన్‌ తండులాన్‌

శుభాన్‌ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే

అక్షతాన్‌ సమర్పయామి ॥ (స్వామికి అక్షతలు సమర్పించాలి)

సుగన్ధాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ

యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే

పుష్పాణి పూజయామి ॥ (స్వామిని పూలతో పూజించాలి)


అథ అంగపూజ :

గణేశాయ నమః పాదౌ పూజయామి ॥

ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి ॥

శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి ॥

విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి ॥

ఆఖువాహనాయ నమః ఊరూం పూజయామి ॥

హేరంబాయ నమః కటిం పూజయామి ॥

లంబోదరాయ నమః ఉదరం పూజయామి ॥

గణనాథాయనమః నాభిం పూజయామి ॥

గణేశాయ నమః హృదయం పూజయామి ॥

స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి ॥

స్కందాగ్రజాయనమః స్కందౌ పూజయామి ॥


పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి ॥

గజవక్ర్తాయ నమః వక్త్రం పూజయామి ॥

విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి ॥

శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ॥

ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి ॥

సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి ॥

విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి ॥


అథ ఏకవింశతి పత్ర పూజ :

(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్‌లో పేర్కొన్న పత్రాలు తీసుకుని స్వామిని పూజించాలి)

ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి)

ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)

ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)

ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె)

ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)

ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి)

ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణు)

ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి)

ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి)

ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు)

ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం)


ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)

ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు)

ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం)

ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి)

ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి)

ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ)

ఓం ఇభవక్ర్తాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)

ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి)

ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది)

ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు)

ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాణి పూజయామి.

(అనంతరం శ్రీ వినాయక అష్టోత్తరశతనామాలు చదువుతూ స్వామికి పూలతో లేదా అక్షతలతో పూజ చేయాలి.)


ధూపం

శ్లో దశాంగం గుగ్గులోపేతం సుగన్ధిం సుమనోహరమ్‌

ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ

ధూపమాఘ్రపయామి

(అగరువత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన ఉన్న స్టాండులో కాని, అరటిపండుకు కానీ గుచ్చాలి.)

దీపం

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా

గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపం దర్శయామి(దీపాన్ని స్వామికి చూపించాలి)

నైవేద్యం

(కొబ్బరికాయలు ఇంకా ఉంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరి కాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి)


సుగంధాన్‌ సుకృతాం శ్చైవ మోదకాన్‌ ఘృతపాచితాన్‌,

నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గ్యైః ప్రకల్పితాన్‌ శ్రీశ్రీ

భక్ష్యం, భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవ చ

ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక

మహానైవేద్యం సమర్పయామి

అంటూ ఆకుతో ఆ పదార్థాలన్నింటిపైనా కొద్దిగా నీరు చల్లాలి. ఆ తరువాత స్వామికి నైవేద్యం పెట్టాలి.


తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్‌,

కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌

తాంబూలం సమర్పయామి

(తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచి నమస్కరించాలి.)


నీరాజనం

సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ,

భూమ్యాం స్థితాని భగవన్‌ స్వీకురుష్వ వినాయక

సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా

నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి

(కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచెం నీటిని ఉంచి కళ్ళకు అద్దుకోవాలి)


మంత్రపుష్పం

(పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి)

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా

ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః

వక్రతుండః మహాకాయ కోటిసూర్య సమప్రభ

అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా

(అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి)


ప్రదక్షిణ

శ్లో ॥ యానికాని చ పాపాని జన్మాన్తరకృతాని చ ।

తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదేపదే ॥

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః ।

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ॥

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।

తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప ॥

ఆత్మప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి ॥

(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం) ఆ తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతి లోకి తీసుకోవాలి. కొంచె నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.


యస్యస్మృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు

న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తం గణాధిపం

మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహప్రభో

యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ॥

అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహానివేదనయాచ భగవాన్‌ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహా గణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి.


ఉద్యాపన :

యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్‌

తే హనాకం మహిమానః సచంతే యత్రపూర్వే సాధ్యా సంతి దేవాః

శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి.. శోభనార్థం పునరాగమనాయచ.

అనే మంత్రం చదువుతూ విఘ్నాధిపతిని ఈశాన్యం దిశగా కదిలించి స్వామివారికి ఉద్యాపన చెప్పుకోవాలి. (నిత్యపూజ చేసి చవితి నుంచి 3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనం చేసేవారు ఆ రోజున ఈ మంత్రం పఠించి ఉద్యాపన చెప్పుకోవాలి.)

అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం

అంటూ పంచామృతాలు, కొబ్బరినీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి. అనంతరం పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై ఉంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రపంచ పాలన మారాలి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 13 , 2026 | 11:30 AM