9/11కు ముందే బిన్ లాడెన్ టార్గెట్‌లో భారత్.. సీఐఏ పత్రాల్లో సంచలన విషయాలు..
ABN , Publish Date - Sep 13 , 2026 | 09:03 AM
అమెరికాపై 9/11 దాడులకు ఏళ్ల ముందే అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ పలు దేశాల్లో దాడులకు ప్రణాళికలు రూపొందించాడు. తాజాగా విడుదలైన సీఐఏ రహస్య పత్రాలు ఈ సంచలన విషయాన్ని వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాపై 9/11 దాడులకు ఏళ్ల ముందే అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ పలు దేశాల్లో దాడులకు ప్రణాళికలు రూపొందించాడు. తాజాగా విడుదలైన సీఐఏ రహస్య పత్రాలు ఈ సంచలన విషయాన్ని వెల్లడించాయి. లాడెన్ టార్గెట్‌లో భారత్, పాకిస్థాన్ కూడా ఉన్నట్లు 1998 నాటి అమెరికా అధ్యక్షుడి ఇంటెలిజెన్స్ బ్రీఫ్‌లో పేర్కొన్నారు. అయితే భారత్‌లో ఏ ప్రాంతాన్ని బిన్ లాడెన్ ఎంచుకున్నాడనే వివరాలు ఆ పత్రంలో లేవు (Osama 9/11 attacks).
9/11 ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) 71 ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్స్‌ను డీక్లాసిఫై చేసింది. 1998 నుంచి 2001 సెప్టెంబర్ 12 వరకు ఉన్న ఈ పత్రాల్లో బిన్ లాడెన్, అల్‌ఖైదా కార్యకలాపాలు, ఆయుధాల సమీకరణ, అమెరికాపై దాడుల హెచ్చరికలకు సంబంధించిన కీలక సమాచారం ఉంది. 1998 ఆగస్టు 28నాటి 'బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఎ థ్రెట్' పేరుతో ఉన్న బ్రీఫ్‌లో బిన్ లాడెన్ దాడులకు గురిచేయాలని భావించిన దేశాల జాబితాలో భారత్ పేరును ప్రస్తావించారు. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా, నైజీరియా వంటి దేశాల పేర్లు ఉన్నాయి (India Pakistan al-Qaeda).
డీక్లాసిఫై చేసిన పత్రాల్లో బిన్ లాడెన్‌కు అప్పటి తాలిబాన్ పాలనతో ఉన్న సంబంధాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి (Bin Laden hit list). 1998 ఏప్రిల్ నాటి బ్రీఫ్ ప్రకారం.. బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబాన్లు సిద్ధంగా లేరని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. సోవియట్ ఆక్రమణ సమయంలో బిన్ లాడెన్ అందించిన సహాయంపై తాలిబాన్లకు ఉన్న కృతజ్ఞత దీనికి కారణంగా పేర్కొన్నారు. రసాయన, జీవ, రేడియోలాజికల్ ఆయుధాల సామర్థ్యాన్ని సంపాదించేందుకు బిన్ లాడెన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది.
ఇవి కూడా చదవండి..
ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓకు మస్క్, ఆల్ట్‌మన్ మద్దతు..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..