కొమురవెల్లి మల్లన్నకు ఇన్‌చార్జి గ్రహణం!
ABN , Publish Date - Jun 10 , 2026 | 10:57 AM
పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది.
తరచూ ఈవోల మార్పు
అందరూ ఇన్‌చార్జి ఈవోలే
కుంటుపడుతున్న ఆలయాభివృద్ధి
కొమురవెల్లి(సిద్దిపేట): పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. క్షేత్రస్థాయిలో ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకోవాల్సిన కార్యనిర్వహణాధికారి (ఈవో) పదవి మ్యూజికల్ చైర్‌ను తలపిస్తోంది. కేవలం 17 నెలల వ్యవధిలోనే ఐదుగురు ఈవోలు మారడం, వారంతా ఇన్‌చార్జిలుగానే బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఆలయాభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
మార్పు వెనుక మతలబేంటి?
ఏటా 30 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించే, డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన, అలాగే సుమారు రూ. 25 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన కొమురవెల్లి ఆలయంలో ఈవోల మార్పు తీవ్ర చర్చనీయాంశమైంది. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను నియమించడం లేదా వేరే ఆలయాల్లో పని చేస్తున్న వారికి అదనపు బాధ్యతలు అప్పగించడంతో, వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. కొత్తగా వచ్చిన ఈవోలు స్థానిక పరిస్థితులను, ఆలయ పరిపాలనను అర్థం చేసుకునేలోపే బదిలీ కావడం లేదా ఉద్యోగ విరమణ చేస్తుండటంతో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడుగు వేస్తున్నారు.
17 నెలల్లో ఐదుగురు..
సుమారు నాలుగు సంవత్సరాలు పాటు పనిచేసిన బాలాజీ పదవి విరమణ పొందారు. గత ఏడాది జనవరి 1న రామాంజనేయులు బాధ్యతలు చేపట్టగా, మూడు నెలలకే బదిలీ అయ్యారు. ఏప్రిల్‌లో అన్నపూర్ణ బాధ్యతలు తీసుకుని ఆగస్టు 31 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆమె తర్వాత ఈవోగా అంజనీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏమైందో తెలియదు కానీ బాధ్యతలు తీసుకోవడానికి ఆలయానికి వచ్చేలోపే ఆమెను బాసర సరస్వతీ ఆలయ ఈవోగా నియమించి దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ కమిషినర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న టంకశాల వెంకటేష్‌ను నియమించారు.
సెప్టెంబర్ 1న బాధ్యతలు తీసుకుని సుమారు ఐదు నెలల పాటు విధులు నిర్వర్తించిన ఆయన ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న ఉద్యోగ విరమణ చేశారు. ఆతర్వాత శ్రీకాంతరావుకు బాధ్యతలు అప్పగించినా ఆయన చేరలేదు. ఆ తర్వాత డీ.కృష్ణప్రసాద్ ఇన్‌చార్జిగా పనిచేయగా, ఆయన వరంగల్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. తాజాగా కీసర ఆలయ ఈవో కట్టా సుధాకర్‌రెడ్డిని ఇన్‌చార్జి ఈవోగా నియమించగా, ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం
ఆలయంలోని విభాగాలపై పట్టు సాధించకముందే అధికారుల మార్పు జరుగుతుండటంతో అభివృద్ధి పనులు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా తయారయ్యాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఏళ్లుగా చేపట్టిన పనులు పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని పూర్తిస్థాయి ఈవోగా నియమించాలని, తద్వారా ఆలయాభివృద్ధిలో వేగం పెంచి, ఉద్యోగుల పనితీరులో పారదర్శకత తీసుకురావాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుత ఈవో అయినా ఎక్కువ కాలం కొనసాగుతారా లేక మళ్లీ బదిలీల పర్వం కొనసాగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
కాంగ్రెస్ డివిజన్ కమిటీల ఏర్పాటు ఎప్పుడో?
Read Latest AP News And Telangana News And International News And Telugu News