Share News

ఆధ్యాత్మిక కేంద్రంగా.. బోరబండ అయ్యప్ప ఆలయం

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:00 PM

భక్తికి ప్రాంతాలు, మతాలు, కులాలతో సంబంధం లేదని నిరూపించిన ఆధ్యాత్మిక క్షేత్రం అది. అయ్యప్పస్వామిపై అచెంచలమైన భక్తి.. తోటి భక్తుల నుంచి ఎదురైన హేళననే పట్టుదలగా మార్చుకుని సొంత ప్రాంతంలోనే అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు శ్రీకారం చుట్టాడు.

ఆధ్యాత్మిక కేంద్రంగా.. బోరబండ అయ్యప్ప ఆలయం
Borabanda Ayyappa Temple

  • హేళన నుంచి ఆలయ నిర్మాణానికి సంకల్పించిన లక్ష్మణ్‌గౌడ్‌

  • యేటా వందలాది మంది మాలధారణ

  • రెండు నెలలపాటు 600 మందికి అన్నప్రసాదం

హైదరాబాద్: భక్తికి ప్రాంతాలు, మతాలు, కులాలతో సంబంధం లేదని నిరూపించిన ఆధ్యాత్మిక క్షేత్రం అది. అయ్యప్పస్వామిపై అచెంచలమైన భక్తి.. తోటి భక్తుల నుంచి ఎదురైన హేళననే పట్టుదలగా మార్చుకుని సొంత ప్రాంతంలోనే అయ్యప్ప ఆలయ నిర్మాణానికి ఓ భక్తుడు శ్రీకారం చుట్టాడు. ఈయన సంకల్పానికి ముస్లింల అండదండలు.. వెరసి బోరబండ సైట్‌-2 కాలనీలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవస్థానం ఆవిర్భవించింది. నేడు వందలాది మంది అయ్యప్ప భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.


ఎగతాళే ఆలయ నిర్మాణానికి ప్రేరణ

బోరబండ ప్రాంతంలో అయ్యప్పస్వామి ఆలయం లేని రోజుల్లో ఇక్కడి భక్తులు దీక్షలు, పూజల కోసం సనత్‌నగర్‌లోని హనుమాన్‌ దేవస్థానానికి వెళ్లేవారు. అరుణ్‌ గురుస్వామి ఆధ్వర్యంలో మాలధారణ చేసి పూజలు నిర్వహించేవారు. 2005లో దీక్ష, పూజల కోసం వెళ్లిన బోరబండకు చెందిన జి.లక్ష్మణ్‌గౌడ్‌, కె.రాజ్‌కుమార్‌, వి.నర్సింగ్‌రావు తదితరులను సనత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కొందరు అయ్యప్ప భక్తులు హేళన చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంత పట్టుదల ఉంటే బోరబండలోనే అయ్యప్ప ఆలయం నిర్మించుకోవచ్చు కదా! అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఎర్రగడ్డ డివిజన్‌ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌గౌడ్‌లో పట్టుదలను పెంచాయి. ఎలాగైనా సొంత ప్రాంతంలో అయ్యప్పస్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు.


city7.2.jpgబెదిరింపులను లెక్క చేయకుండా..

ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలాన్ని అప్పట్లో కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఆలయ నిర్మాణ పనులు చేపట్టవద్దంటూ హత్య కేసుల నిందితుల నుంచి బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ లక్ష్మణ్‌గౌడ్‌ వెనకడుగు వేయలేదు. ఆ స్థలం ఆలయ నిర్మాణానికి కేటాయించినదని తెలుసుకున్న అప్పటి అవిభక్త ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పీజేఆర్‌ ఆలయ నిర్మాణానికి సహకారం అందించారు. అప్పటి ఎర్రగడ్డ కార్పొరేటర్‌ మహ్మద్‌ షరీ్‌ఫతోపాటు స్థానిక ముస్లిం సోదరులు కూడా ఆలయ నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి సహకారంతో 2005 డిసెంబరు 25న శ్రీ హరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవస్థానానికి భూమిపూజ చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా ఆలయ నిర్మాణానికి పునాది పడింది.


city7.3.jpgనాలుగేళ్ల నిరీక్షణ.. పంచలోహ విగ్రహ ప్రతిష్ఠ

ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు సుమారు నాలుగేళ్లపాటు అయ్యప్పస్వామి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి భక్తులు పూజలు నిర్వహించారు. దీక్షలు కొనసాగించారు. ఎట్టకేలకు ఆలయ నిర్మాణం పూర్తికావడంతో 2009 మార్చి 17న స్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణానికి పరోక్షంగా ప్రేరణగా నిలిచిన సనత్‌నగర్‌ ప్రాంత అయ్యప్ప భక్తులను సైతం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అప్పటి నుంచి నేటి వరకు యేటా వందలాది మంది భక్తులు ఈ ఆలయంలో అయ్యప్ప దీక్ష చేపడుతున్నారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.లక్ష్మణ్‌గౌడ్‌, గోపాలకృష్ణ గురుస్వామి, ప్రవీణ్‌ పూజారి భక్తులకు మాలధారణ చేయిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.


రెండు నెలలపాటు అన్నదానం

అయ్యప్ప దీక్ష కాలంలో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారుతోంది. యేట నవంబరు, డిసెంబరులో దాతల సహకారంతో ప్రతి రోజూ మధ్యాహ్నం సుమారు 600 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబరు 1న ప్రారంభమైన అన్నప్రసాద కార్యక్రమం డిసెంబరు 31 వరకు కొనసాగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ అభివృద్ధి, నిర్వహణలో కమిటీ ప్రతినిధులు బాలకృష్ణ, కాశీరావు, విజయ్‌కుమార్‌, సత్యనారాయణ, తివారీ, సోమేష్‌, నాగరాజు, గోవింద్‌, సంజీవరెడ్డి, బెల్లంకొండ సురేష్‌, శ్రీను తదితరులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. భక్తుల భాగస్వామ్యంతో ఆలయంలో ప్రతి యేటా ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సాఫీగా.. వేగంగా.. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు

జనవరి 2నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 12:00 PM