Share News

ఏ బిడ్డా.. ఇది మా అడ్డా!

ABN , Publish Date - Oct 30 , 2026 | 10:31 AM

డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నగర శివార్లలో స్మగ్లర్లు మత్తుపదార్థాల వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు.

ఏ బిడ్డా.. ఇది మా అడ్డా!
Moinabad Drug Case

  • జేబీఐఈటీ చౌరస్తాలో డ్రగ్స్‌ దందా?

మొయినాబాద్(రంగారెడ్డి): డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నగర శివార్లలో స్మగ్లర్లు మత్తుపదార్థాల వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. శివార్లలోని ఇంజినీరింగ్‌, ప్రొఫెషనల్‌ కాలేజీల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్‌ దందా కొనసాగుతోంది. ముఖ్యంగా మొయినాబాద్‌లోని భాస్కర విద్యాసంస్థలు, జేబీఐఈటీ కళాశాల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జేబీఐటీ చౌరస్తా ఇప్పుడు గంజాయి, ఇతర మత్తుపదార్థాలకు అడ్డాగా మారింది. స్మగ్లర్లు ఈ ప్రాంతంలోని విద్యార్థులను టార్గెట్‌ చేస్తూ దండిగా వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో మత్తుపదార్థాలు విక్రయిస్తూ పలువురు పట్టుబడ్డారు. వారిపై మొయినాబాద్‌ పోలీసులు కూడా నమోదు చేశారు.


ఈ వ్యవహారంపై కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డ్రగ్స్‌ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు, యాంటీనార్కొటిక్‌ బ్యూరో, ఈగల్‌ ఫోర్స్‌ నిరంతరం నిఘా పెడుతున్నప్పటికీ ఎక్కడో ఓ చోట గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారు పట్టుబడుతూనే ఉన్నారు. నగర శివార్లలోని పలు కాలేజీల్లో పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. గతంలో ఓ మెడికల్‌ కాలేజీతో పాటు మరికొన్ని శివారు కాలేజీల్లో 32 మంది విద్యార్థులను అదుపులో తీసుకుని పరీక్షలు నిర్వహించగా, వారు డ్రగ్స్‌కు బానిసలైనట్లు వెల్లడైంది. దీంతో నగర శివార్లలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచారు. అయితే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కాలేజీలు కూడా సహకరించాల్సి ఉంది.


drug1.3.jpgవిద్యార్థులే లక్ష్యంగా విక్రయాలు

విద్యార్థులకు మత్తు పదార్థాలను విక్రయించేందుకు కొందరు వ్యక్తులు జేబీఐటీ కళాశాల పరిసర ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇక్కడ మత్తు పదార్థాలు విక్రయిస్తూ పలువురు పట్టుబడ్డారు. మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయినా మత్తు దందా కొనసాగుతూనే ఉందని పలువురు పేర్కొంటున్నారు.


చెడు వ్యసనాల బారిన విద్యార్థులు

విద్యార్థి దశలోనే కొందరు యువత చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యంతో పాటు వారి చదువు, ప్రవర్తన, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కళాశాల యాజమాన్యం మాత్రం ఇది తమకేమిపట్టనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఏదో క్లాసులు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.


కళాశాల యాజమాన్యానికి బాధ్యత ఏది?

విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి నడవడిక, ఆరోగ్యం, భద్రతపై కూడా కళాశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. కళాశాల పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం తెలిస్తే, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ కళాశాల యాజమాన్యం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. ఎవరు ఎలాపోతే మాకేంటి, మాకు మాత్రం డబ్బులు వస్తున్నాయనే ధోరణిలో యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది.


విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం

విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత విద్యాసంస్థలతో పాటు అధికారులపై కూడా ఉంది. మత్తు పదార్థాల విక్రయాలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యువతను చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు ఇప్పటికైనా సంబంధిత వర్గాలు సమష్టిగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు కళాశాల యాజమాన్యం సహకరిస్తుందో, లేక మనకెందుకులే అంటూ వదిలేస్తుందో వేచి చూడాలి.


drug1.jpgఅధికారులు స్పందించాలి

మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరాను అరికట్టేందుకు కళాశాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, విద్యాసంస్థల సమీపంలో మత్తు పదార్థాల అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, పోలీసులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కళాశాల యాజమాన్యం ముందుకొస్తేనే అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకొని ఈ మత్తపదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని చెబుతున్నారు.


సూచనలు పట్టించుకోని యాజమాన్యం

జేబీఐటీ చౌరస్తా పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు విక్రయదారులు పట్టుబడ్డారు. దీనిపై కళాశాల యాజమాన్యానికి పోలీసులు సూచనలు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల నివారణకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి విద్యా సంస్థ యాంటీ డ్రగ్స్‌ కమిటీలు ఏర్పాటు చేసి.. కాలేజీల్లోకి మత్తుపదార్థాలు ఎవరైనా సరఫరా చేస్తున్నారా? దీన్ని అరికట్టేందుకు విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టాల్సి ఉంది. కానీ ఈ మేర సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను కూడా కాలేజీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.


కళాశాల పరిసరాల్లో నమోదైన కేసుల వివరాలు

2026 జూలై 14న జేబీఐటీ కళాశాల ఎదురుగా ఓపెన్‌ వెంచర్‌లోని టీ టైమ్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిసున్నారనే సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఆకుల లోకేష్‌ నాయుడు, వెంకట మణిరాములురౌత్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 1.45 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.


2026 జూన్‌ 2న ఇద్దరు వ్యక్తులు ఎండీఎంఏ అనే మాదక ద్రవ్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి ఆదేశానుసారం దాడిచేసిన పోలీసులు అక్కడ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు బీచ్‌మోర్‌ దల్బీర్‌సింగ్‌, సయ్యద్‌ ఖాదర్‌పాషా అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 13.28 గ్రాములు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


గత సంవత్సరం జూలై 10న జేబీఐఈటీ కళాశాల ఎదురుగా టీటైమ్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులు నీలి రంగు ప్యాకెట్లలో గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేసి, అక్కడ గంజాయి విక్రయిస్తున్న సున్నం మధు, కోతమెల్లె వెంకటేష్‌ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోని తీసుకున్నారు. వారి నుంచి 1.075 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇవి పోలీసులు దాడిచేసి పట్టుకున్న కేసులు మాత్రమే. ఇంకా అనేకం ఇక్కడ జరుగుతున్నాయనే సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 10:31 AM