Share News

నమ్మకంగా చేరి నట్టేట ముంచుతున్నారు!

ABN , Publish Date - May 30 , 2026 | 11:00 AM

అందరూ ధనవంతులే.. ఖరీదైన భవనాల్లో ఉంటారు. సేవలు చేసేందుకు పనివారి పైనే ఆధారపడతారు.

నమ్మకంగా చేరి నట్టేట ముంచుతున్నారు!
Workers, House thefts

  • పనివారి విషయంలో తస్మాత్‌ జాగ్రత్త

  • పనిమనుషుల వివరాలను పూర్తిగా తెలుసుకోవాలని హితవు

  • అప్రమత్తంగా ఉండాలంటూ ఇంటింటికీ నోటీసులు

హైదరాబాద్: అందరూ ధనవంతులే.. ఖరీదైన భవనాల్లో ఉంటారు. సేవలు చేసేందుకు పనివారి పైనే ఆధారపడతారు. జీతాలు అలాగే చెల్లిస్తారు. వీరి వద్ద పనిచేస్తామని నమ్మకంగా చేరుతున్న వారు నట్టేట ముంచుతున్నారు. అదును చూసి కోట్లలో గుల్ల చేస్తున్నారు. హిల్స్‌లో పనిమనుషుల చోరీలు ప్రతీ నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల నేపాలీలు ఆగడాలు శృతిమించాయి. దోపిడీలు, హత్యలకు తెగబడుతుండడంతో కొందరు యజమానుల్లో వణుకు మొదలైంది. మరికొందరు పాత వారే నమ్మకంగా ఉంటున్నారంటూ పర్వాలేదులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరి అభిప్రాయం వారిదే అయినప్పటికీ జూబ్లీహిల్స్‌ పోలీసులు మాత్రం పనిమనుషుల కదలికలపై నిఘా పెట్టారు. ప్రతీ ఇంటికి వెళ్లి పనిచేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ నోటీసు జారీ చేస్తున్నారు.


కౌన్సెలింగ్‌

ఇళ్లలో వంట మనుషులుగానూ, సెక్యూరిటీ గార్డులుగానూ, తోటమాలిగానూ చేరే నేపాలీలు యజమానుల నమ్మకాన్ని గెలుచుకుంటున్నారు. ఇంట్లోని బంగారు నగలు, నగదు ఎక్కడ పెడుతున్నారనే విషయాలపై నిఘా పెడుతున్నారు. యజమానులు ఊరు వెళ్లినప్పుడో, లేదా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడో తమ ప్రతాపం చూపిస్తున్నారు. అవసరమైతే యజమానుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. చోరీ చేసిన వెంటనే పక్కా ప్లాన్‌తో సరిహద్దులు దాటి నేపాల్‌ పారిపోతుండడంతో వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాల్‌గా మారుతోంది.


గడిచిన మూడు నెలల్లో జూబ్లీహిల్స్‌లో నేపాలీలు మూడుచోట్ల దోపిడీలకు తెగబడ్డారు. ఇందులో పోలీసు ఉన్నతాధికారి భార్యను హత్య చేయడం కలకలం రేపుతోంది. వీటితోపాటు పనిమనుషుల దొంగతనాలు కేసులు మరో ఐదు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రతీ ఇంటికి వెళ్లి యజమానులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ప్రతీ ఇంటికి వెళ్లి ఎంత మంది పనిచేస్తున్నారు? వారి పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నేపాలీలు పనిచేస్తున్నచోట అన్ని ఆధారాలను తీసుకుంటున్నారు. అవసరమైతే వారిని అక్కడే విచారిస్తున్నారు.


వివరాలు తెలుసుకోవాలి

ఇంట్లో ఏ పనికైనా సరే, కొత్తవారిని పెట్టుకునే ముందు వారి ఆధార్‌ కార్డు అసలు ఊరు, గతంలో ఎక్కడ పనిచేశారనే అన్ని రకాల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాలు కలిగితే పనిచేసే వారి వివరాలను పోలీసులకు అప్పగిస్తే తామే వెరిఫికేషన్‌ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆశ్రయం ఇచ్చిన చేతులనే నరికేసే ఇలాంటి దొంగల పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.


city4.2.jpgనిర్లక్ష్యం చాటున..

కాస్త నమ్మకంగా ఉండే మనవాడులే అని భావించుకోవడమే చాలామంది ఇళ్లలో కొంప ముంచేందుకు కారణమవుతుంది. కొన్ని రోజులు నమ్మకంగా పనిచేసిన పనిమనుషులకు ఇల్లంతా అప్పగించి వెళ్లడం తాము పెట్టుకునే ఆభరణాలు దాచి పెట్టే స్థలాలను వారికి చూపడం, ఇంటి పడకగదిలోకి అనుమంతించడం, ఇంటి యజమానుల చిన్నపాటి నిర్లక్ష్యమే దొంగతనానికి కారణమవుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లాంటి ప్రాంతాల్లో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఇంటి యజమానులు కొందరు పనివాళ్లకు అన్ని పనులనూ అప్పగించడం మరో కారణంగా మారుతోంది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.24లో యజమానుల విలువైన నగలు ఇంట్లో పెట్టి పనిమనుషులకు అప్పగించడం వల్లే చోరీ జరిగింది.


పోలీసుల కీలక సూచనలు

  • కొత్తవారిని పనిలో పెట్టుకునేటప్పుడు వారి ఫొటోలు, గుర్తింపు కార్డులు దగ్గర ఉంచుకోవాలి.

  • నేపాల్‌ లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారి స్థానిక అడ్ర్‌సలను సరిచూసుకోవాలి.

  • ఇంట్లో విలువైన వస్తువులు, లాకర్ల తాళాలు వారి కంటపడకుండా జాగ్రత్త పడాలి.

  • అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో నిరంతరం గమనించాలి.

  • వాళ్ల గురించి స్థానికంగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని పరిచయం చేస్తూ ఓ లేఖను తీసుకోవడం మంచిది.

  • పనిమనుషుల ముందు డబ్బులు లెక్కపెట్టడం, బంగారు ఆభరణాలను తీసి పెట్టుకోవడం మంచిది కాదు.

  • ఏటీఎం కార్డులు ఇచ్చి వాటి పిన్‌ నంబర్లు చెప్పి డబ్బులు డ్రా చేయమనకూడదు.

  • ప్రధానంగా ఊరికి వెళ్లేటప్పుడు ఇంట్లో ఎలాంటి ఆభరణాలు, డబ్బులు ఉంచకూడదు. తప్పనిసరిగా హై రెజెల్యూషన్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.


యజమానులు అప్రమత్తంగా ఉండాలి

హిల్స్‌లో సర్వేంట్‌ తెఫ్ట్‌లు ప్రతీ నెల జరుగుతుంటాయి. యజమానులు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే నిందితులను పట్టుకోవడం బంగారం రికవరీ చేయడం వంటివి జరిగిపోతుంటాయి. ఇటీవల నేపాలీలు దోపిడీలు, హత్యకు తెగబడడం వంటి సంఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో యజమానులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పనివారిని పెట్టుకునేందుకు ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. పనిలో పెట్టుకున్నాక ఎటువంటి అనుమానం వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే విచారిస్తాం. పనిచేయించుకునేంతసేపు పనివారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలి. వ్యక్తిగత విషయాలు వారి ముందు మాట్లాడకపోవడం చాలా ఉత్తమం. పనివారి విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. యజమానులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం.

  • యు.శ్రీనివాస్‏రెడ్డి, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

లింగంపల్లి ఆర్‌ఓబీ పనులకు మోక్షం

15 ఏళ్లు దాటిన పురుషుల్లో 44శాతం మద్యం ప్రియులే

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 30 , 2026 | 11:00 AM