కర్ణాటక ముఖ్యమంత్రిగా జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం..?
ABN , Publish Date - May 30 , 2026 | 10:04 AM
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్‌ను సంప్రదించిన అనంతరం జూన్ 3వ తేదీన ప్రమాణస్వీకారం చేయాలని శివకుమార్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
బెంగళూరు: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్‌ను సంప్రదించిన అనంతరం జూన్ 3వ తేదీన సీఎంగా ప్రమాణం చేయాలని శివకుమార్ నిర్ణయించుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు శివకుమార్, కాంగ్రెస్ నేతలు ఈరోజు (శనివారం) గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలిసి ప్రమాణస్వీకారంపై చర్చించనున్నట్లు సమాచారం.
డీకే శివకుమార్‌తో పాటు మరో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ వర్గానికి చెందినవారు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ అగ్రినేత రాహుల్ గాంధీ కోరుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నూతన ప్రభుత్వంలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి లభించే అవకాశం ఉంది.
మరోవైపు ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎల్పీ సమావేశం జరగనున్నట్లు కేపీసీసీ కార్యదర్శి అల్లమప్రభు పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. కాగా, ఈ నెల 28న కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. అనంతరం నిన్న (శుక్రవారం) ఆయన రాజీనామా లేఖను ఆమోదించినట్లు లోక్ భవన్ ప్రకటించింది. కర్ణాటక మంత్రివర్గం కూడా రద్దయినట్లు తెలిపింది. కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని లోక్ భవన్ పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి
జూన్ 2026 బ్యాంక్ సెలవుల జాబితా: మీ బ్యాంకింగ్ పనులను ఇలా ప్లాన్ చేసుకోండి!
సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్ సేవలు నిలిపివేత..