అనుమానం పెనుభూతమై.. భార్యను నరికి చంపిన భర్త
ABN , Publish Date - Apr 30 , 2026 | 08:09 AM
అనుమానం పెనుభూతమైంది. భార్యతో తరచూ గొడవలు పడేవాడు. చివరికి బుధవారం తెల్లవారుజామున మరోసారి గొడవపడి ఆమెను గొడ్డలితో నరికి హతమార్చాడు.
మీర్‌పేట్‌లో దారణం
హైదరాబాద్: అనుమానం పెనుభూతమైంది. భార్యతో తరచూ గొడవలు పడేవాడు. చివరికి బుధవారం తెల్లవారుజామున మరోసారి గొడవపడి ఆమెను గొడ్డలితో నరికి హతమార్చాడు. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడకు చెందిన నర్సింహ(60), వసంత(56) దంపతులు కొంతకాలం క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బీఎన్‌రెడ్డినగర్ సమీపంలోని టీచర్స్‌కాలనీలో నివసిస్తున్నారు.
వసంత ఇళ్లలో పనిచేస్తుండగా, నర్సింహ రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా నర్సింహ తన భార్యపై అనుమానం పెంచుకుని తరచుగా గొడవ పడుతున్నాడు. ఇదే విషయమై మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారు జామున సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలిసింది. అనంతరం వసంత ఉదయం 5గంటల తర్వాత సమీపంలోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లి, అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్తుండగా నర్సింహ ఆమెకు ఎదురెళ్లి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తన వెంట తీసుకెళ్లిన గొడ్డలితో ఆమెపై దాడి చేశారు.
దాంతో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల ఫిర్యాదుతో మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానమే ఈ హత్యకు కారణంగా భావిస్తున్నామని ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
Read Latest Telangana News and National News