Share News

మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:49 AM

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పలు జిల్లాల్లో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి.

మండుతున్న ఎండలు

  • వడదెబ్బకు పదో తరగతి విద్యార్థి సహా నలుగురి మృతి

  • నిర్మల్‌ జిల్లాలో 46 డిగ్రీల గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పలు జిల్లాల్లో బుధవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌లో అత్యధికంగా 46 డిగ్రీల గరిష్టానికి చేరుకున్నాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరటపల్లిలో 45.9, కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరాలో, జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 45.8, ఆదిలాబాద్‌ జిల్లా సత్నాలాలో 45.6, కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడలో 45.5, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా వడదెబ్బకు తాళలేక రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం సోలీపూర్‌కు చెందిన పదోతరగతి విద్యార్థి చింతకాయల భరత్‌కుమార్‌ (15) స్నేహితులతో క్రికెట్‌ ఆడుతూ కుప్పకూలిపోయాడు. జిల్లా ఆస్పత్రికి తరలించగా వడదెబ్బతో మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఇతను 432 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడుకు చెందిన ఆటో డ్రైవర్‌ భూక్య సురేష్‌ (27), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన పగడాల కృష్ణమూర్తి (70), ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వెన్నవల్లికి చెందిన కామిశెట్టి బాలరంగారావు (58) వడదెబ్బ మృతుల్లో ఉన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వీటి తాకిడికి వరి, మామిడి, వేరుశెనగ రైతులు నష్టపోయారు. కొనుగోళ్లలో జాప్యం వల్లే ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా పేద్దేముల్‌ మండలం కొండాపూర్‌లో బుధవారం పిడుగుపడి కోడి ఆనందం(45) మృతి చెందాడు.

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

రాగల రెండు రోజుల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల లోపే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Apr 30 , 2026 | 05:49 AM