Share News

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:26 AM

ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే!

  • అన్నిటినీ వాట్సాప్‌ గవర్నెన్స్‌, మన మిత్ర పరిధిలోకి తేవాలి

  • ఈ ఏడాది డిసెంబరు నాటికి అమలు చేయాలి

  • ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకూడదు

  • కర్నూలు జిల్లాలో వేగంగా డ్రోన్‌ సిటీ పనులు

  • సీసీ కెమెరాలతో నేర నియంత్రణ చర్యలు

  • ప్రైవేటు వ్యక్తుల సీసీ కెమెరాలూ ఆర్టీజీఎస్‌కు అనుసంధానం

  • శేషాచలం దావానలంపై ఇంకా వేగంగా స్పందించాల్సింది

  • డీజిల్‌, పెట్రోల్‌పై ప్రభుత్వ చర్యలతో మళ్లీ సాధారణ స్థితి

  • రియల్‌టైమ్‌లో అధికారులు స్పందిస్తే సమస్య తలెత్తేదేకాదు

  • ఆర్టీజీ సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది డిసెంబరు నాటికి ప్రభుత్వ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బుధవారం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌పై అధికారులతో సీఎం సమీక్షించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌, మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలూ తీసుకొస్తే ప్రజలకు ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని సీఎం స్పష్టం చేశారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇప్పుడు 1035 ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని, ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్‌ గవర్నెన్స్‌ పరిధిలోనికి తీసుకురావడం వల్ల ప్రజలకు ఇబ్బందులు లేని పాలనను అందించవచ్చన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 54 లక్షల మందికి 1.75 కోట్ల సేవలను అందించామని అధికారులు వివరించగా.. ప్రజలకు ఈ సేవలపై అవగాహన కలిగించడం ద్వారా మరింత విస్తృతపరాలని సీఎం సూచించారు. ఇప్పటివరకూ 24 లక్షల మందికిపైగా వాట్సాప్‌, మనమిత్ర యాప్‌ ద్వారా సేవలందించామని అధికారులు తెలపగా.. వాట్సాప్‌, మనమిత్ర ద్వారా ప్రభుత్వ సేవలు పొందటంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లాలో డ్రోన్‌సిటీ ఏర్పాటు తొలిదశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇప్పటికే డ్రోన్‌ సిటీలో కార్యకలాపాలు చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఎనిమిది కంపెనీలకు భూ కేటాయింపులు జరిపామన్నారు. డ్రోన్‌సిటీ మాస్టర్‌ ప్లాన్‌ ఖరారైందని వివరించారు. దీంతో ఈ ఏడాది జూలై నాటికి డ్రోన్‌ సిటీ మొదటి దశ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

సీసీ కెమెరాలతో నిఘా

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఏపీలో సీసీ కెమేరాలతో నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నామని సీఎం చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో నేరాలు నియంత్రణలోకి వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. మిస్సింగ్‌ కేసుల ట్రేసింగ్‌, వాహనాలు దొంగిలించేవారిని కనిపెట్టడం సీసీ కెమేరాల నిఘాతో సులువవుతోందన్నారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలతోపాటు.. మారుమూల ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సేవలు వినియోగించాలని సీఎం కోరారు.

Updated Date - Apr 30 , 2026 | 04:26 AM